గత ఏడాది గణేశ్ సామూహిక నిమజ్జనంలో తీవ్ర జాప్యం
కారణాలను విశ్లేషించిన ఉన్నతాధికారులు
ఈసారి పునరావృతం కాకుండా కసరత్తు
హుస్సేన్ సాగర్ వద్ద పటిష్ట చర్యలు
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో గణేశ్ సామూహిక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గత ఏడాది ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. బందోబస్తు కోణంలో సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు ఫైనల్స్ వంటివి. గత కొన్నేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2023 సెప్టెంబర్ 28 తెల్లవారుజాము నుంచి 29 రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. ఈ ఆలస్యానికి కారణాలను ఉన్నతాధికారులు విశ్లేషించి ఈసారి ఏ ఒక్కటీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ లోపాలను ప్రస్తావించారు. వీటిని జీహెచ్‌ఎంసీ సహా ఇతర విభాగాల దృష్టికీ తీసుకువెళ్లారు.
రెండు క్రేన్ల మధ్య వంద అడుగుల దూరం...
కొన్ని క్రేన్లలో ఇనుపతాళ్లకు బదులుగా బెల్ట్‌లు వాడారు. నిమజ్జనం సందర్భంలో ఇవి ఊడిపోవడంతో మరింత ఆలస్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయాల్సి వస్తే... ప్రతి రెండు క్రేన్ల మధ్య కనీసం 100 నుంచి 150 అడుగుల దూరం ఉండాలి. అలా చేస్తేనే నిమజ్జనానికి విగ్రహాలను తెచ్చిన లారీలు, ఖాళీ అయినవి తేలిగ్గా ముందుకు వెళ్తాయి. అయితే సరైన పర్యవేక్షణ లేని కారణంగా గత ఏడాది ప్రతి క్రేన్ మధ్య 30 నుంచి 40 అడుగుల దూరమే ఉంచారు. దీంతో విగ్రహాలను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కోసం క్రేన్లు ఖాళీగా వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ట్యాంక్‌బండ్‌పై బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు ఎక్కువగా డ్యూటీలు వేశారు. సరైన అవగాహన లేని వీళ్ళు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేకపోయారు.
ఇదీ చదవండి: కీలక ఘట్టానికి వేళాయే
పటిష్టంగా బారికేడింగ్
నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్భకులు లారీల మధ్యలోకి, రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా పటిష్ట బారికేడింగ్ ప్రతి ఏడాదీ ఏర్పాటు చేస్తుంటారు. ఇది గత ఏడాది సక్రమంగా జరగలేదు. దీంతో అనేకమంది లారీల మధ్యకు వస్తుండటంతో అవి చాలా ఆలస్యంగా కదిలాయి. మరోపక్క బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వాహనాలను అనుమతించడం మరో ఇబ్బందికి కారణమైంది. విగ్రహాలు తీసుకువచ్చే లారీల వెనుక వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతరాలను గత ఏడాది పూర్తిస్థాయిలో అడ్డుకోలేదు. ఇది కూడా నిమజ్జనం ఆలస్యానికి కారణంగా మారింది. ఇవన్నీ విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు ఈసారి అవి పునరావృతం కాకుండా, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ లోపాలు...
ముందుగా వచ్చే విగ్రహాలు నిమజ్జనం కాగానే బండ్ నుంచి 20 అడుగుల దూరం మేర నీటిలో పేరుకుపోయే వ్యర్థాలు, వస్తువులను వెంట వెంటనే తొలగించాలి. అలా జరగకపోవడంతో ఆ వెంటనే నిమజ్జనం చేసే విగ్రహాలు మునగడానికి చాలా సమయం పట్టింది. నిమజ్జనం సందర్భంగా సాగర్‌లో కనీసం నాలుగు, ఐదు ఫ్లోటింగ్ జేసీబీలను ఏర్పాటు చేయాలి. ఓ పక్క విగ్రహాలు నీటిలో పడుతుంటే, మరోపక్క వాటి వ్యర్థాలను తొలగించాలి.
అయితే జీహెచ్‌ఎంసీ అధికారులు గత ఏడాది కేవలం ఒక్క ఫ్లోటింగ్ జేసీబీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల నిమజ్జనం ప్రక్రియ వేగంగా జరగడానికి తీసుకువచ్చిన అత్యాధునిక క్యూఆర్డీ హుక్స్ సరిగ్గా పనిచేయలేదు. క్రేన్ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న నాలుగు మూలలు సమానంగా నీటిలోకి దిగితేనే ఇవి సక్రమంగా పని చేస్తాయి. అయితే సాగర్‌లో ఉన్న వ్యర్థాలు, విగ్రహాలు, ఇనుప సీకులకు తట్టుకుని నాలుగు వైపులా నీటిలో దిగక హుక్స్ వెంటనే రిలీజ్ కాలేదు. దీంతో కొన్ని విగ్రహాల నిమజ్జనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment