
‘పర్యావరణ పరిరక్షణలో భాగం కండి’
ముంబై: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని సీఎం ఫడ్నవీస్ సతీమణి అమృతనగరవాసులకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దక్షిణ ముంబైలోని మలబార్ ప్రాంతవాసులతో కలసి ఆమె మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోథా, విల్సన్ కాలేజీ ప్రిన్సిపల్ వీజే సిర్వారియా, ఎంసీజీఎం కార్పొరేటర్లు, వందమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడతామని కార్యక్రమానికి హాజరైన ప్రజలతో లోథా ప్రతిజ్ఞ చేయించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు పలు కార్యక్రమాలు చేపట్టాయి. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఇండియన్ నేవీ స్వచ్చత అభియాన్ నిర్వహించింది. కొంకణ్ రైల్వే ప్రత్యేక సైకిల్ స్టాండ్లను ఏర్పాటు చేసింది.
గోదావరి తీరంలో స్వచ్ఛత అభియాన్...
నాసిక్‌లోని గోదావరి తీరంలో మహా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం జరిగింది. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ పర్యావరణ దినం సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా 10 వేల చెట్లను నాటాలని సంకల్పించింది.