‘చిరుత కనిపిస్తే, అమ్మో.. చిరుత అని భయపడకండి.. అది మ్యాన్ ఈటర్ కాదు. పైగా పర్యావరణానికి మేలు చేస్తుంది’ ఇది పర్యావరణ నిపుణుల మాట. మరి అంతగా మేలు చేసే చిరుతపులులు మనదేశంలో ఎన్ని ఉన్నాయి.. వాటి మనుగడ ఎలా ఉంది.. వాటి సంరక్షణకు ఇంకేం చేయాలి.. అనే అంశాల గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే, ‘స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా’నివేదికలో ఏం ఉందో చూడాల్సిందే! దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని చిరుతపులుల సంఖ్యను శాస్త్రీయ పద్ధతుల ద్వారా లెక్కించిన వివరాలు, అధికారిక గణాంకాల నివేదికను ఇటీవల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే వీటి మనుగడ కొనసాగుతోంది. మిగతా ఖండాల్లో ఇవి క్రమంగా కనుమరుగైపోయాయి. భారత్‌లో చిరుతల సంఖ్య భారీగానే పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిరుతల సంఖ్య పెరిగింది.
ఆ నివేదికలో ఏముందంటే..?
ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా–2018 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం... దేశంలో మొత్తం 12,852 చిరుతపులులున్నట్లు అంచనా. వీటిలో అత్యధికంగా సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో 8,071 చిరుతలున్నాయి. అందులో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,421, పశ్చిమ కనుమల్లో భాగంగా ఉన్న కర్ణాటక 1,783 చిరుతలతో రెండోస్థానాన్ని ఆక్రమించింది. సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర 1,690 చిరుతపులులతో తృతీయస్థానంలో నిలిచింది. సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్ల విభాగంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 492, తెలంగాణలో 334 చిరుతలున్నాయి. 2014లో దేశంలో దాదాపు 7,900 చిరుతలుండగా 2018 కల్లా వాటి సంఖ్య 12,852కు (దాదాపు 60 శాతం పెరుగుదల) పెరిగింది. మనదేశంలో పెద్దపులులు, ఆసియాటిక్ లయన్స్, ఇప్పుడు చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని బట్టి భారత్‌లో పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు మేలైన చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోందని ఈ నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.
చిరుతల సంఖ్య పెరిగితే..
మనరాష్ట్రంలో చిరుతల సంఖ్య 334 ఉండగా, 2022లో మరోసారి లెక్కలను వెల్లడించే నాటికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పులుల సంఖ్య కూడా గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో పెద్దపులులు, చిరుతపులుల సంఖ్య పెరుగుదలతో అడవులు, పర్యావరణానికి మంచి భవిష్యత్ ఉన్నట్టు కనిపిస్తోంది. చిరుతల సంఖ్య పెరుగుదలతోనే అవి జనావాసాల్లోకి ఎక్కువగా వచ్చేస్తున్నాయని భావించడం సరికాదు. వాటి సహజసిద్ధమైన ఆవాసాలు, అడవి, ఇతర అనువైన చోట్లలో మనుషులు, ఇతరత్రా రూపాల్లో అంతరాయాలు కలిగించడం వల్లే అవి తరచూ జనావాసాలకు దగ్గరగా వస్తున్నాయి.
–ఎ.శంకరన్, అటవీశాఖ వైల్డ్ లైఫ్ విభాగం ఓఎస్డీ
వాటి పరిరక్షణకు ఏం చేయాలంటే..
అడవులు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణ సమతూకంగా పాటించడంలో భాగంగా చిరుతలు కూడా కీలకపాత్రను పోషిస్తున్నాయి. చిరుతలనూ ‘కీ స్టోన్’ సీషెస్‌గా పరిగణిస్తాం. జింకలు, దుప్పులు, నీల్గాయిలు వంటి శాకాహార జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగితే వాటి వల్ల అడవికి జరిగే నష్టాన్ని పులులు, చిరుతలు బ్యాలెన్స్ చేసే అవకాశముంది. లెపర్డ్స్ కారిడార్‌లను ఏర్పాటు చేసి వాటి పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ కారిడార్ల పరిధిలోని గ్రామాల ప్రజలను చైతన్యవంతులను చేయాలి. రోడ్లు, రైలు ప్రమాదాల్లో అవి మరణించకుండా, గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
–జి.సాయిలు, బయో డైవర్సిటీ ఎక్స్‌పర్ట్, ఫారెస్ట్ 2.0 ఆర్‌డీ
Comments
Please login to add a commentAdd a comment