
‘పర్యావరణా’నికి ప్రజలు ధర్మకర్తలు కావాలి : ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణలో, సహజ వనరులను ఇప్పుడు వినియోగించుకుంటూనే భవిష్యత్ తరాల ఆనందాన్ని కాపాడటంలో ప్రజలంతా ధర్మకర్తలుగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా.. పర్యావరణ పరిరక్షణకు, భూగోళాన్ని మరింత పరిశుభ్రంగా, ఆకుపచ్చగా రూపొందించటానికి పునరంకితం కావాల్సిన అవసరముందని మోడీ సామాజిక వెబ్‌సైట్ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యల్లో ఉద్ఘాటించారు.
పర్యావరణంతో మమేకమై సామరస్యంతో జీవించటమనేది మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. మరింత శుభ్రమైన, పచ్చనైన భూగోళం కోసం ప్రభుత్వ కృషితో పాటు ప్రజల భాగస్వామ్యం మంచి ఫలితాన్నిస్తుందని చెప్పారు. ప్రకృతిని, ప్రకృతి వనరులను పరిరక్షించటానికి దైనందిన జీవనంలో ఏ చిన్న చర్య అయినా చేపట్టాలని ప్రజలను కోరారు.
అడవిలో మొక్కలు నాటిన మమత
కోల్‌కతా: పర్యావరణ దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గురువారం అడవిలో పకృతి మధ్య గడిపారు. ఉత్తర బెంగాల్‌లోని జల్దాపరా నేషనల్ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సామాజిక వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో మమత పోస్ట్ చేశారు. తన చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి, ఏనుగులు, ఖడ్గమృగాలు, జలపాతాలు, ప్రజల ఆత్మీయత తనను ముగ్ధురాలిని చేశాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.