
50 మైక్రాన్ల కన్నా తగ్గితే జరిమానా
ప్లాస్టిక్ బ్యాగ్‌లపై పర్యావరణ మంత్రి
సాక్షి, ముంబై: ప్లాస్టిక్ వినియోగం వల్ల విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు పర్యావరణ శాఖ నడుం బిగించింది. 50 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఒకవేళ అక్రమంగా వాటిని తయారుచేస్తే సంబంధిత తయారిదారులపై, వాటిని విక్రయించే షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ మంత్రి రామ్‌దాస్ కదం ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై లక్ష రూపాయల వరకు జరిమాన, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. ఈ నియమాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి.
వాతావరణ పరిరక్షణ కోసం గతంలో 40 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రభుత్వం నిషేధించింది. కాని పకడ్బందీగా అమలు చేయకపోవడంవల్ల వాటి వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. దీనిపై మంత్రాలయంలో జరిగిన సమావేశంలో సంబంధిత అధికారులతో కదం చర్చించారు. ప్లాస్టిక్ వినియోగంవల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని, దీంతో 50 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీని, వాటి వినియోగాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని సమావేశంలో తీర్మానించారు.
దీంతో కదం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిషేధించినప్పటికీ వాటి తయారి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్‌కు బదులుగా బట్టతో కుట్టిన, కాగితపు సంచుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కదం తెలిపారు. అందుకు మహిళా పొదుపు సంఘాలకు వాటి తయారీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.