కృష్ణా నదిలో సాగుతున్న ఇసుకదోపిడీ
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని నిర్మాణం పేరుతో మూడు పంటలు పండే వేల ఎకరాల పచ్చని భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు హఠాత్తుగా అమరావతిలో ఉష్ణోగ్రతలను తగ్గించాలంటూ అధికారులకు ఉపదేశించటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణం అంటూ వాగూ వంకలను మళ్లిస్తూ ఆ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చేసి ప్రకృతి విధ్వంసానికి పాల్పడటంతోనే ఎండలు మండుతున్నాయనే వాస్తవాలను అంగీకరించకుండా ఉష్ణోగ్రతలు కనీసం 10 డిగ్రీలు తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించటంపై అధికారులు నివ్వెరపోతున్నారు. నదీ గర్భంలో ఆక్రమణలు, ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తూ అటవీ భూములను గుంజుకుంటుంటే ఉష్ణోగ్రతలు ఎలా తగ్గుతాయి? వర్షాలు ఎలా కురుస్తాయి? అని ప్రశ్నిస్తున్నారు.
పచ్చని భూములు మాయం..
టీడీపీ 2014లో అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూ దోపిడీకి తెరతీసింది. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ కృష్ణా తీరంలోని పచ్చని భూముల్లో రాజధాని నిర్మించాలని నిర్ణయించింది. అవసరమైన దానికంటే దాదాపు మూడింతల భూమిని అధికంగా సేకరించింది. రైతులను భయపెట్టి మరీ 33 వేల ఎకరాలు బలవంతంగా గుంజుకుంది. కృష్ణా కరకట్టలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు అండగా నిలిచింది. స్వయంగా సీఎం చంద్రబాబే కృష్ణా ఒడ్డున నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తన అధికారిక నివాసంగా చేసుకోవడం గమనార్హం.
అటవీ భూములకూ ఎసరు
రాజధాని ముసుగులో అటవీ భూములపై కూడా కన్నేసిన ప్రభుత్వ పెద్దలు 47,582.16 ఎకరాలను తమకు అప్పగించాలని కేంద్రానికి తొలుత లేఖ రాశారు. అయితే అటవీ భూములు తీసుకొని వినియోగించాల్సినంత అత్యవసరం రాజధానిలో లేదని దీనిపై కేంద్రం నియమించిన పర్యావరణ, అటవీ శాఖ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు వీడకపోవటంతో 2017 ఆగస్టులో 5,157 ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు కేంద్రం షరతులతో అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో కనీసం 7,71,821 చ.కి.మీ. మేర విస్తీర్ణంలో అటవీ భూములుండాలి. కానీ ప్రస్తుతం 5,30,779 చ.కి.మీ. విస్తీర్ణంలోనే అటవీ భూములు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇసుక దోపిడీతో భూగర్భ జలాలు ఖాళీ
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కృష్ణా నదిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. వందల సంఖ్యలో లారీలు, ప్రొక్లెయినర్లతో అమరావతిలోని ఆరు ఇసుక రీచ్‌ల నుంచి నిత్యం లక్ష టన్నుల ఇసుకను కొల్లగొడుతున్నారు. లింగాయపాలెం, పెనుమాక ఇసుక రీచ్ నుంచే రోజూ 50 వేల టన్నుల ఇసుక దోపిడీకి పాల్పడుతుండటం గమనార్హం.
మాస్టర్ ప్లాన్‌లోనే విధ్వంస రచన
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అమరావతి మాస్టర్ ప్లాన్‌లోనే ప్రకృతి విధ్వంసం మొదలైంది. దాదాపు 217.23 చ.కి.మీ. విస్తీర్ణంలో కోర్ క్యాపిటల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. 29.65 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న నదులు, వాగులు, కాలువలు కూడా అందులో కలిపేస్తూ మాస్టర్‌ప్లాన్ రూపొందించడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. కొండవీటి వాగు పరీవాహక ప్రాంతాలను ధ్వంసం చేసేలా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. రాజధానిలో పర్యటించిన జలసంరక్షణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ అక్కడ జరుగుతున్న ప్రకృతి విధ్వంసం చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మాటలకు, చేతలకు పొంతన లేదు
పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేదు. రాజధాని పేరుతో భారీగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. కృష్ణా నదిని కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మేం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు కూడా వేశాం.
– ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ కార్యదర్శి
పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో పచ్చని భూములను నాశనం చేస్తోంది. నదీ ప్రవాహాన్ని కూడా మారుస్తుండంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది.
– రాజేంద్రసింగ్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
నదిలో నీటికంటే పరివాహక ప్రాంతం భూగర్భంలో పది రెట్లు నీరు నిల్వ ఉంటుంది. నదిలో నీరు తగ్గినప్పుడు ఇసుకలో నీరు నదిలోకి ప్రవహించి నీటిస్థాయిని నిలబెడుతుంది. అమరావతిలో ఇసుకను కొల్లగొట్టడంతో పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాలు పడే అవకాశాలు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
– విక్రం సోని, పర్యావరణ శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment