ఇది దుర్భిక్ష చిత్రం | It is the image of drought | Sakshi
Sakshi News home page

ఇది దుర్భిక్ష చిత్రం

Published Mon, May 2 2016 2:17 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

ఇది దుర్భిక్ష చిత్రం - Sakshi

ఇది దుర్భిక్ష చిత్రం

♦ రాష్ట్రంలో ఇంటింటా దాహం కేకలు..
♦ గుక్కెడు నీటి కోసం అగచాట్లు
♦ ఎండుతున్న తోటలు.. దిక్కుతోచని అన్నదాతలు
♦ కరువును ఎదుర్కొనే  ప్రణాళిక ఊసే లేని వైనం
♦ పరిస్థితిని ఇప్పటిదాకా కేంద్రం దృష్టికి తీసుకెళ్లని సీఎం
 
 మార్కాపురం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. పల్లెలు గొల్లుమంటున్నాయి. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 42 నుంచి 47 డిగ్రీల వరకు పెరిగిపోయాయి.రైతుల కళ్లెదుటే పంటలు ఎండిపోతున్నాయి. ఎటుచూసినా వడిలిపోతున్న తోటలే. పశుపక్ష్యాదులు గుక్కెడు నీటి కోసం అలమటించిపోతున్నాయి. గొంతు తడుపుకోవడానికి మైళ్లకొద్ది దూరం నడిచి వెళ్లాల్సిందే. కరువు కసిగా కాటేస్తుండడంతో జనం కన్నవాళ్లను, ఉన్న ఊరిని వదిలేసి పొట్టచేతపట్టుకొని వలసబాట పడుతున్నారు. గ్రామాలు కళ తప్పుతున్నాయి.  ఇప్పటిదాకా తమ కన్నబిడ్డల్లా చూసుకుంటున్న మూగజీవాలను పోషించలేక రైతులు వాటిని సంతల్లో అయినకాడికి అమ్మేస్తున్న దృశ్యాలు నిత్యకృత్యం. రైతు బతుకు ఛిద్రమవుతున్నా పాలకులు చలించడం లేదు. సుప్రీంకోర్టు మందలించినా, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పాలకుల్లో ఉలుకూ పలుకూ లేకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 500కుపైగా మండలాల్లో కరువే
 దేశంలో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అధికారిక గణాంకాల ప్రకారం.. ఏపీలో ఏడు జిల్లాల్లో 359 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. రెండున్నర కోట్ల మందికిపైగా జనం కరువు బారినపడ్డారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలతోపాటు గుంటూరు జిల్లాలోని కొంతభాగం కరువుతో అతలాకుతలం అవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో 9 జిల్లాల్లోని 500కుపైగా మండలాల్లో కరువు తాండవిస్తోంది.

 పచ్చిక జాడే లేదు...
 ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి పుల్లలచెరువు వైపు వె ళ్లే ఏ మార్గం చూసినా కరువు చిత్రాలే. తాగడానికి నీళ్లు లేవు. పచ్చిక బయళ్ల జాడే లేదు.రోడుకిరువైపులా ఉన్న బత్తాయి, బొప్పాయి వంటి తోటలు నీటి తడి లేక ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఒక్కొక్క నీటి ట్యాంకర్ రూ.700కు కొనుగోలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గతంలో 22 వేల హెక్టార్లలో బత్తాయి తోటలు సాగయ్యేవి. కరువు వల్ల వీటి సాగు ఈ ఏడాది 2 వేల హెక్టార్లకు పడిపోయింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఇదే దుస్థితి.

 సేద్యంపై రైతన్నల అనాసక్తి
 ఏపీ ధాన్యాగారంగా భావించే ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం జనం మంచినీటి కోసం అల్లాడుతున్న దృశ్యాలు కోకొల్లలు. రాయలసీమలోని నాలుగు జిల్లా ల్లో ఉద్యానవన పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గోదావరి డెల్టాలో సగానికి సగం పంటలే పడగా, కృష్ణా డెల్టాలోనూ అదే పరిస్థితి. నాగార్జునసాగర్ కుడి కాలువ క్రింద ఆయకట్టు ఆనవాళ్లే లేకుండా పోయింది. రెండేళ్ల క్రిందటి వరకు రాష్ట్రంలో చాలాచోట్ల ఎరువుల వ్యాపారులు రూ.కోటిన్నర టర్నోవర్ చేసేవారు. ఈ ఏడాది రూ.50 లక్షలకు పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 కానరాని సుజల పథకం
 గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఎన్టీఆర్ సుజల పథకం కథ అర్ధంతరంగానే ముగిసినట్లు కనిపిస్తోంది. నీటి కోసం ప్రతి కుటుంబం ప్రతినెలా రూ.వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణ అవసరాల కోసం ట్యాంకర్ నీటిని రూ.700 నుంచి రూ.900 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
 
  ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి
 ‘‘బత్తాయి తోట వేసి నాలుగేళ్లు దాటిపోయింది. ఎండవల్ల చెట్లు వడలిపోతున్నాయి. చేతికి కాసిన్ని డబ్బులు వస్తాయన్న ఆశతో శక్తికి మించిన పనే అయినా ట్యాంకర్ల ద్వారా నీళ్లను కొని చెట్లకు పెడుతున్నాం. పంట చేతికి వస్తే నా అప్పులు తీరుతాయనే ఆశతో ఈ పని చేస్తున్నాం. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి’’
 - పుచ్చకాయల సుబ్బారావు,యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా
 
 ప్రభుత్వం చేస్తోందేమిటి?
 రాష్ట్రంలో వరుసగా రెండేళ్ల నుంచి కరువు పరిస్థితులు నెలకొన్నా... రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేయలేదు. ఇక అఖిలపక్ష సమావేశం మాటే మరిచిపోయింది. కరువును జాతీయ విపత్తుగా పరిగణించి, సహాయం చేయండని ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు అప్పడప్పుడు వెళ్తున్నా కరువు గురించి కనీసం ఒక్కసారైనా ప్రస్తావించలేదు. మరోవైపు వచ్చే రెండు మూడేళ్లలో కరవును శాశ్వతంగా పారద్రోలుతామంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. జనాన్ని మభ్యపెడుతోంది. ఇంకుడు గుంతలు, పంట సంజీవని వంటి పథకాల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటోంది. కరువు నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఇప్పటిదాకా పటిష్టమైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
 
  ప్రభుత్వం చేయాల్సిందేమిటి?
 ► రాష్ట్రాన్ని కబళిస్తున్న కరువును  ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రణాళిక రూపొందించాలి.అఖిలపక్ష ఏర్పాటు చేసి, చర్యలపై చర్చించాలి.
 ► తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలి. కరువు పీడిత గ్రామాల్లోని ప్రజలకు పాలపొడి, పౌష్టికాహారం అందజేయాలి.
 ► కరువు మండలాల్లో పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలి.తిరిగి పంటలు వేసుకునేందుకు రుణాలు మంజూరు చేయాలి. బకాయిలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 12 నుంచి 15 శాతం వడ్డీని పూర్తిగా రద్దు చేయాలి. పంటల బీమా కింద రావాల్సిన నిధులను తక్షణమే రైతులకు పంపిణీ చేయాలి.
 ►  రైతులు చెల్లించాల్సిన  బకాయిలను రద్దు చేయాలి.
 ► పశువుల మేత కోసం గడ్డి కేంద్రాలను నెలకొల్పాలి. ప్రతి ఊరిలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. గడ్డి తరలింపు వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. అటవీ ప్రాంతాల్లో పశువులను మేపుకునేందుకు అనుమతించాలి.
 ► అన్ని గ్రామాల్లో గంజి కేంద్రాలు, చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలి. ూ  వలసల నివారణకు ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. సాంప్రదాయక నీటి వనరులను ప్రోత్సహించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement