పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
మిరుదొడ్డి: హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విధిగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. శనివారం మిరుదొడ్డి, చెప్యాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను హరితహారం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మొక్కలను నాటి సంరక్షిస్తేనే మానవ మనుగడ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంజాల కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు లింగాల జయమ్మ, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి, వైస్ చైర్మన్ వంజరి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు గొట్టం భైరయ్య, ధార స్వామి, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అలసత్వం వహిస్తే సహించేది లేదు
ఇంకుడు గుంతల నిర్మాణంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో మండల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యపు ధోరణి వీడి ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేయాలన్నారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.