స్వావలంబనకు విజయపతాకం
పెళ్లి, కాపురం, పిల్లలు... ప్రతి మహిళా కోరుకునే అదృష్టాలు. జయాదేవికి అవి కోరుకోకుండానే దక్కాయి. అయినా వాటితో సంతృప్తి పడిపోలేదామె. ఒక స్త్రీగా మాత్రమే ఆలోచించి ఉండిపోలేదు. సమాజంలో ఓ బాధ్యత గల పౌరురాలిగా ఆలోచించింది. పదిమందికీ ఉపయోగపడటంలోనే అసలైన ఆనందం ఉందని అనుకుంది. అందుకే ఆమె నేడు కొన్ని వందల కుటుంబాలకు పెద్ద దిక్కయ్యింది. కొన్ని వేల మందిని వెనకుండి నడిపిస్తోంది. కొన్ని లక్షల మందిలో స్ఫూర్తిని నింపుతోంది!
ఒకరి వెంట నడవడం తేలికే. కానీ పది మందిని వెంట నడిపించుకోవడం అంత తేలిక కాదు. అలా చూస్తే జయాదేవిని గొప్ప నాయకురాలని అనాలి. ఎందుకంటే ఆమె వెంట కొన్ని ఊళ్లే నడుస్తున్నాయి. ఆమె అడుగుల్లో అడుగులు వేస్తూ తమ రూపురేఖల్ని అందంగా మార్చుకుంటున్నాయి.
బీహార్‌లోని చాలా ఊళ్లలో జయాదేవి పేరు మారు మోగుతూ ఉంటుంది. ఆవిడ ఎవరు అని అడిగితే... అందరి కంఠాలూ ఒకేసారి పలుకుతాయి... మా అమ్మాయి అని! అందరూ ఆమెను తమ ఇంటి బిడ్డే అనుకుంటారు. తమ కుటుంబాలను నిలబెట్టిన దేవతగా కొలుస్తారు.
జీవితాలనే మార్చేసింది...
బీహార్ రాష్ట్రంలోని ‘సారథి’ అనే గ్రామంలో పుట్టింది జయాదేవి. అభివృద్ధి అన్న మాటకు ఆమడదూరంలో ఉండే ఊరది. ఆడపిల్లలకు పెళ్లే జీవితం అనే నమ్మకం అక్కడి వారిది. అందుకే ఐదో తరగతితోనే జయాదేవి చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. పన్నెండో యేటనే ఆమె మెడలో తాళిబొట్టు పడింది. కాపురం అంటే ఏమిటో తెలియని వయసులోనే అత్తవారింటికి పయనమయ్యింది. తన పసితనం పూర్తిగా పోకముందే ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఇంటిని చక్కబెట్టుకోలేక చాలా అవస్థ పడేది. భర్త రోజు కూలీ. అతడి సంపాదనతో పాటు రెండు ఆవుల మీద వచ్చే ఆదాయంతో నలుగురు మనుషులు బతకాలి. చాలా ఇబ్బంది అనిపించేది.
సరిగ్గా అప్పుడే నోట్రడామ్ హెల్త్ సెంటర్ నుంచి కొందరు నన్‌స వచ్చారు. వారి ద్వారా స్వయం సహాయక సంఘాల గురించి తెలిసింది జయాదేవికి. వెంటనే తన కష్టాలు గుర్తు రాలేదామెకి. తన ఊరు, చుట్టుపక్కల ఊళ్లలోని వారి కష్టాలు గుర్తొచ్చాయి. తన కుటుంబంతో పాటు వారందరి కుటుంబాలనూ చక్క దిద్దాలనే ఆలోచన వచ్చింది. వెంటనే కార్యాచరణ మొదలు పెట్టింది. తన స్వస్థలంతో మొదలుపెట్టి ఊరూరా తిరిగింది. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు గురించి అందరికీ వివరించింది. ఒక్కచోట మొదలుపెట్టి పలు గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసింది. అలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నలభై అయిదు గ్రామాల్లో 285 సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలో సఫలీకృతురాలయ్యింది. రెండువేల మంది మహిళలను సభ్యులను చేసింది. ఆర్థిక స్వావలంబన కలిగించింది. వారంద రి పిల్లలనూ బడిబాట పట్టించింది. ఈ అందరి ఆకలి మంటలను చల్లార్చింది. ప్రతి ఇంటా ఆనందాన్ని నింపింది.
ఆమె అంతటితో ఆగిపోలేదు. ఆ గ్రామాల్లో నక్సలైట్ల దాడుల కారణంగా జరుగుతోన్న దారుణాల మీద దృష్టి పెట్టింది. వారికి భయపడే తండ్రి తనను బడి మాన్పించి పెళ్లి చేసి పంపేయడం, అందంగా ఉంటుందన్న కారణంగా తన చెల్లెలిని దూరంగా వేరేవాళ్ల ఇంట్లో ఉంచడం వంటివన్నీ ఆమెను ఎంతో బాధించాయి. ఆ పరిస్థితి ఏ ఆడపిల్లకూ రాకూడదని తపించింది. నక్సల్ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తింది. పోలీసు వ్యవస్థను జాగృతం చేసింది. నక్సలైట్ల నీడ ఊళ్లమీద పడకుండా చేసింది.
ఆపైన ఆమె సాధించిన మరో విజయం... వ్యవసాయ అభివృద్ధి. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా నీటి పారుదలను మెరుగుపర్చింది. వ్యవసాయంలో కొత్త పద్ధతులను అక్కడి రైతులకు పరిచయం చేసింది. దాంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ పాటు పడటం మొదలుపెట్టింది. వేల సంఖ్యలో మొక్కలను నాటి గ్రామాలన్నింటికీ పచ్చరంగు పూసేసింది. ఎన్నో అవార్డులను, రివార్డులనూ అందుకుంది.
ఒక్క మహిళ ఇన్ని సాధించడం మాటలు కాదు అని ఎవరైనా అంటే... ‘ఇది నా ఒక్కదాని వల్లా కాలేదు, అందరూ సహకరించడం వల్లే సాధ్యపడింది’ అంటుంది జయాదేవి వినమ్రంగా. ఇంత సాధించినా ఇప్పటికీ విశ్రమించదలచు కోలేదామె. ఇంకా ఇంకా ఏదైనా చేయాలని తపిస్తోంది. అసలు మా రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోని ప్రతి గ్రామమూ ఇలా మారిపోవాలి అంటోంది. రాష్ట్రానికో జయాదేవి ఉంటే అది అసాధ్యమేమీ కాదు. కనీసం మనలో కొందరైనా ఆమె స్ఫూర్తితో అడుగులేస్తే ఆమె అన్నది జరగక మానదు!