Jayadevi
-
ప్రముఖ నటి, దర్శక నిర్మాత కన్నుమూత
కోలీవుడ్ సీనియర్ నటి, దర్శక నిర్మాత జయదేవి (65) చైన్నెలో కన్నుమూశారు. తొలుత డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన జయదేవి ఆ తరువాత నటిగా ఇదయ మలర్, సాయ్ందాడమ్మా సాయ్ందాడు,వాళ నినైత్తాళ్ వాళలామ్,సరిమాన జోడీ, రజనీకాంత్‌తో గాయత్రీ అనే చిత్రంలోనూ నటించారు. ఆ తరువాత నిర్మాతగా మారి మట్రవై నేరిల్, వా ఇంద పక్కమ్, నండ్రీ మీండుమ్ వరుగై తదితర చిత్రాలను నిర్మించారు. వా ఇంద పక్కమ్ చిత్రం ద్వారా పీసీ శ్రీరామ్‌ను ఛాయాగ్రహకుడిగా పరిచయం చేసిన ఘనత ఈమెదే. ఆ తరువాత నలమ్ నలమాగియ ఆవల్, విలాంగు మీన్, పాశం ఒరు వేషం వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు వేలు ప్రభాకరన్‌ను పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత విడిపోయారు. స్థానిక పోరూర్‌లోని సమయపురత్తిల్ వీధిలో నివశిస్తున్న జయదేవి కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిశారు. జయదేవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
స్వావలంబనకు విజయపతాకం
పెళ్లి, కాపురం, పిల్లలు... ప్రతి మహిళా కోరుకునే అదృష్టాలు. జయాదేవికి అవి కోరుకోకుండానే దక్కాయి. అయినా వాటితో సంతృప్తి పడిపోలేదామె. ఒక స్త్రీగా మాత్రమే ఆలోచించి ఉండిపోలేదు. సమాజంలో ఓ బాధ్యత గల పౌరురాలిగా ఆలోచించింది. పదిమందికీ ఉపయోగపడటంలోనే అసలైన ఆనందం ఉందని అనుకుంది. అందుకే ఆమె నేడు కొన్ని వందల కుటుంబాలకు పెద్ద దిక్కయ్యింది. కొన్ని వేల మందిని వెనకుండి నడిపిస్తోంది. కొన్ని లక్షల మందిలో స్ఫూర్తిని నింపుతోంది! ఒకరి వెంట నడవడం తేలికే. కానీ పది మందిని వెంట నడిపించుకోవడం అంత తేలిక కాదు. అలా చూస్తే జయాదేవిని గొప్ప నాయకురాలని అనాలి. ఎందుకంటే ఆమె వెంట కొన్ని ఊళ్లే నడుస్తున్నాయి. ఆమె అడుగుల్లో అడుగులు వేస్తూ తమ రూపురేఖల్ని అందంగా మార్చుకుంటున్నాయి. బీహార్‌లోని చాలా ఊళ్లలో జయాదేవి పేరు మారు మోగుతూ ఉంటుంది. ఆవిడ ఎవరు అని అడిగితే... అందరి కంఠాలూ ఒకేసారి పలుకుతాయి... మా అమ్మాయి అని! అందరూ ఆమెను తమ ఇంటి బిడ్డే అనుకుంటారు. తమ కుటుంబాలను నిలబెట్టిన దేవతగా కొలుస్తారు. జీవితాలనే మార్చేసింది... బీహార్ రాష్ట్రంలోని ‘సారథి’ అనే గ్రామంలో పుట్టింది జయాదేవి. అభివృద్ధి అన్న మాటకు ఆమడదూరంలో ఉండే ఊరది. ఆడపిల్లలకు పెళ్లే జీవితం అనే నమ్మకం అక్కడి వారిది. అందుకే ఐదో తరగతితోనే జయాదేవి చదువుకు ఫుల్స్టాప్ పడింది. పన్నెండో యేటనే ఆమె మెడలో తాళిబొట్టు పడింది. కాపురం అంటే ఏమిటో తెలియని వయసులోనే అత్తవారింటికి పయనమయ్యింది. తన పసితనం పూర్తిగా పోకముందే ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఇంటిని చక్కబెట్టుకోలేక చాలా అవస్థ పడేది. భర్త రోజు కూలీ. అతడి సంపాదనతో పాటు రెండు ఆవుల మీద వచ్చే ఆదాయంతో నలుగురు మనుషులు బతకాలి. చాలా ఇబ్బంది అనిపించేది. సరిగ్గా అప్పుడే నోట్రడామ్ హెల్త్ సెంటర్ నుంచి కొందరు నన్స వచ్చారు. వారి ద్వారా స్వయం సహాయక సంఘాల గురించి తెలిసింది జయాదేవికి. వెంటనే తన కష్టాలు గుర్తు రాలేదామెకి. తన ఊరు, చుట్టుపక్కల ఊళ్లలోని వారి కష్టాలు గుర్తొచ్చాయి. తన కుటుంబంతో పాటు వారందరి కుటుంబాలనూ చక్క దిద్దాలనే ఆలోచన వచ్చింది. వెంటనే కార్యాచరణ మొదలు పెట్టింది. తన స్వస్థలంతో మొదలుపెట్టి ఊరూరా తిరిగింది. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు గురించి అందరికీ వివరించింది. ఒక్కచోట మొదలుపెట్టి పలు గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసింది. అలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నలభై అయిదు గ్రామాల్లో 285 సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలో సఫలీకృతురాలయ్యింది. రెండువేల మంది మహిళలను సభ్యులను చేసింది. ఆర్థిక స్వావలంబన కలిగించింది. వారంద రి పిల్లలనూ బడిబాట పట్టించింది. ఈ అందరి ఆకలి మంటలను చల్లార్చింది. ప్రతి ఇంటా ఆనందాన్ని నింపింది. ఆమె అంతటితో ఆగిపోలేదు. ఆ గ్రామాల్లో నక్సలైట్ల దాడుల కారణంగా జరుగుతోన్న దారుణాల మీద దృష్టి పెట్టింది. వారికి భయపడే తండ్రి తనను బడి మాన్పించి పెళ్లి చేసి పంపేయడం, అందంగా ఉంటుందన్న కారణంగా తన చెల్లెలిని దూరంగా వేరేవాళ్ల ఇంట్లో ఉంచడం వంటివన్నీ ఆమెను ఎంతో బాధించాయి. ఆ పరిస్థితి ఏ ఆడపిల్లకూ రాకూడదని తపించింది. నక్సల్ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తింది. పోలీసు వ్యవస్థను జాగృతం చేసింది. నక్సలైట్ల నీడ ఊళ్లమీద పడకుండా చేసింది. ఆపైన ఆమె సాధించిన మరో విజయం... వ్యవసాయ అభివృద్ధి. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా నీటి పారుదలను మెరుగుపర్చింది. వ్యవసాయంలో కొత్త పద్ధతులను అక్కడి రైతులకు పరిచయం చేసింది. దాంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ పాటు పడటం మొదలుపెట్టింది. వేల సంఖ్యలో మొక్కలను నాటి గ్రామాలన్నింటికీ పచ్చరంగు పూసేసింది. ఎన్నో అవార్డులను, రివార్డులనూ అందుకుంది. ఒక్క మహిళ ఇన్ని సాధించడం మాటలు కాదు అని ఎవరైనా అంటే... ‘ఇది నా ఒక్కదాని వల్లా కాలేదు, అందరూ సహకరించడం వల్లే సాధ్యపడింది’ అంటుంది జయాదేవి వినమ్రంగా. ఇంత సాధించినా ఇప్పటికీ విశ్రమించదలచు కోలేదామె. ఇంకా ఇంకా ఏదైనా చేయాలని తపిస్తోంది. అసలు మా రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోని ప్రతి గ్రామమూ ఇలా మారిపోవాలి అంటోంది. రాష్ట్రానికో జయాదేవి ఉంటే అది అసాధ్యమేమీ కాదు. కనీసం మనలో కొందరైనా ఆమె స్ఫూర్తితో అడుగులేస్తే ఆమె అన్నది జరగక మానదు! -
మెగాఫోన్‌పై పట్టు ఏదీ?
తమిళ సినిమా : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా ఎదుగుతున్నారు. అయితే సినిమా రంగంలో ప్రధాన శాఖ అయిన దర్శకత్వంలో మహిళ ప్రతిభ మెరుగు పడాల్సి ఉంది. మెగాఫోన్ పట్టడంలో ప్రతిభను కనబరచలేకపోతున్నారు. అయితే ఈ శాఖలో సాధించిన వారు కూడా కొందరు ఉన్నారు. ప్రఖ్యాత దివంగత నటీమణులు టి.పి.రాజ్యలక్ష్మి, అష్ఠావధాని పి.భానుమతి రామకృష్ణ, మహానటి సావిత్రి, గిన్నిస్ రికార్డు సాధించిన విజయ నిర్మల వంటి వారు దర్శకులుగా ఎంతగానో సాధించి నేటితరం మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఆ తరువాత తరం మహిళా దర్శకులు మాత్రం అంతగా రాణించలేకపోతున్నారు. సీనియర్ నటీమణులు లక్ష్మీ, శ్రీప్రియ, జయదేవి తదితరులు దర్శకత్వ రంగంలో సాధించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. కొందరు మాత్రం ఊహించిన విజయాలు అందకపోవడంతో మెగాఫోన్‌కు దూరమయ్యారు. మరి కొందరు మాత్రం అందులో సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారు. సీనియర్ నటీమణులు సుహాసిని ఇందిరా చిత్రంతో, రేవతి మిత్రామై ఫ్రెండ్‌తో, సుష్మా అహుజా ఉయిరుక్కు ఉయిరాగ చిత్రాలతో దర్శకత్వ రంగంలోకి ప్రవేశించినా ఆ చిత్రాలు అంతగా విజయం సాధించకపోవడంతో దర్శకత్వానికి స్వస్తి చెప్పారు. మరి కొందరు మహిళలు కూడా ఇలాంటి నిరాశకు గురయ్యారు. అనితా ఉదిప్ (కుళిర్ 100 డిగ్రీ), రేవతి ఆరు, (జూన్ ఆరు), జానకి విశ్వనాథన్ (కుట్టి), శారదా రామనాథన్ (సింగారం), ప్రియ.వి (కండనాళ్ ముదల్), మధుమిత (వల్లమైతారాయో), సుధ (ద్రోహి), అంజనా (వెప్పం), జె.ఎస్. నందిని (తిరు తిరు తురు తురు) వంటి దర్శకుల్లో చాలా మంది మరో ప్రయత్నం చెయ్యలేకపోయారు. కార ణం ఆ చిత్రాలు విజయాలకు చేరువకాలేకపోవడమే. శారదా విశ్వనాథన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పుదియ తిరుపుంగళ్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలం అయినా విడుదలకాలేదు. కన్నామూచ్చి ఏనడా చిత్రం తరువాత ప్రియ.వి, కొలకొలయా ముం దిరికా చిత్రం తరువాత మధుమిత తదుపరి ప్రయత్నం చెయ్యలేదు. అదే విధంగా తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ నాన్ ఎన్నుళ్ ఇల్లై చిత్రాన్ని తెరకెక్కించిన సీనియర్ నటి జయచిత్ర ఇప్పటి వరకు మరో చిత్రం చెయ్యలేదు. అలాగే నందకి చిత్ర దర్శకురాలు విజయ పద్మ, చట్టం ఒరు ఇరుట్టరై (రీమేక్) దర్శకురాలు స్నేహ ప్రింటో, చంద్ర చిత్ర దర్శకురాలు రూపా అయ్యర్ తొలి ప్రయత్నంతోనే సరిపెట్టుకున్నారు. మరో ప్రయత్నం కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీ రామకృష్ణన్ ఆరోహణం చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. ఆ చిత్రం పలువురి ప్రశంసలు పొందడంతో ప్రస్తుతం నెరింగి వా ముత్తమిడాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 3 చిత్రంతో మెగా ఫోన్ పట్టిన రజనీకాంత్ పెద్దకూతురు నటుడు ధనుష్ భార్య ఐశ్వర్య ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అనూహ్య ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం గౌతమ్ కార్తిక్ హీరోగా వై రాజా వై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆమె సోదరి సౌందర్య తన తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కోచ్చడయాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్లో రూపొందిన ఈచిత్రం సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తానంటున్నారామే. అలాగే యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్, భార్య కృతిక తొలి ప్రయత్నంగా వడ చెన్నై చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రం మంచి రిజల్ట్‌నే సాధించడంతో ఆమె మరో ప్రయత్నం చేయడానికి సిద్ధం అవుతున్నారు. నటి అంబికా కూడా మలయాళంలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడా చిత్రాన్ని నిళరు పేరుతో తమిళంలోకి అనువాదం చేస్తున్నారు. సక్సెస్ కోసం.. దర్శకురాలిగా అవతారమెత్తి సక్సెస్ కోసం వేచి ఉన్న నటీమణుల్లో నటి రోహిణి, బృందా దాస్, షకిల్ తదితరులు ఉన్నారు. నటి రోహిణి అప్పావిన్ మీసై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బృందాదాస్ హాయ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శృంగార తార షకీలా తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నృత్య దర్శకురాలు, నటుడు ప్రకాష్ రాజ్ భార్య అయిన బోనివర్మ, నటి ఐశ్వర్య, నటుడు విష్ణువిశాల్ అర్ధాంగి రజిని నటుడు పార్తిపన్ కూతురు కీర్తన, నటి సిమ్రాన్, బేబి షాలిని తదితరులు త్వరలో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు. ఇలా పలువురు మహిళలు దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్నా, సరైన సక్సెస్‌లను రాబట్టుకోలేకపోతున్నారు. అం దుకు కారణం ప్రస్తుతం సినిమా ఖర్చు కోట్లు దాటింది. అలా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలంటే కమర్షియల్ చిత్రాల వల్లే సాధ్యం అవుతుంది. అలాంటి ఫార్ములా చిత్రాలను మహిళా దర్శకత్వంలో సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోందని ఎవరయినా ఆ విధంగా చిత్రం చేసి విజయం సాధిస్తే మహిళా దర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.