
కోలీవుడ్ సీనియర్ నటి, దర్శక నిర్మాత జయదేవి (65) చైన్నెలో కన్నుమూశారు. తొలుత డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన జయదేవి ఆ తరువాత నటిగా ఇదయ మలర్, సాయ్‌ందాడమ్మా సాయ్‌ందాడు,వాళ నినైత్తాళ్ వాళలామ్,సరిమాన జోడీ, రజనీకాంత్‌తో గాయత్రీ అనే చిత్రంలోనూ నటించారు. ఆ తరువాత నిర్మాతగా మారి మట్రవై నేరిల్, వా ఇంద పక్కమ్, నండ్రీ మీండుమ్ వరుగై తదితర చిత్రాలను నిర్మించారు.
వా ఇంద పక్కమ్ చిత్రం ద్వారా పీసీ శ్రీరామ్‌ను ఛాయాగ్రహకుడిగా పరిచయం చేసిన ఘనత ఈమెదే. ఆ తరువాత నలమ్ నలమాగియ ఆవల్, విలాంగు మీన్, పాశం ఒరు వేషం వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు వేలు ప్రభాకరన్‌ను పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత విడిపోయారు.
స్థానిక పోరూర్‌లోని సమయపురత్తిల్ వీధిలో నివశిస్తున్న జయదేవి కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిశారు. జయదేవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.