Self-help associations
-
అవినీతిపరులపై వేటు తప్పదు
- డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు సత్తుపల్లి టౌన్: స్వయం సహాయక సంఘాల రుణాల విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే వేటు తప్పదని డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ) మురళీధర్‌రావు హెచ్చరించారు. సత్తుపల్లి ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఆరు మండలాల స్థాయిలో జరిగిన క్లస్టర్ సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి రుణాల లబ్ధిదారులకు సక్రమంగా అందించాలన్నారు. బ్యాంకు రుణాలు నూరుశాతం వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు రవాణా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు బిల్లులు వెంటనే రావటం కోసం సివిల్ సప్లైకి బిల్లులు పంపించాలన్నారు. ధాన్యం కొనుగోలు, నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్నారు. ప్రతి సభ్యురాలి ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్‌లను ఆన్లైన్ చేయాలన్నారు. 2014-15 సంవత్సరానికి ఆమ్ ఆద్మీ, అభయహస్తం, జనశ్రీ బీమా యోజనకు సంబంధించిన ఉపకార వేతనాలు అందించేందుకు 8, 9, 10, ఇంటర్ విద్యార్థుల స్టడీ సర్టిఫికెట్లను ఈ నెల 25వ తేదీలోపు సేకరించాలని సీసీలను ఆదేశించారు. మండలాలవారీగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సీఐఎఫ్ సంఘాల సమావేశాలు, బుక్ నిర్వహణ, మార్కెటింగ్ సెంటర్ల నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయం అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఏరియా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, స్త్రీ నిధి ఏజీఎం వనిత, ఏపీఎంలు కిరణ్‌రాయ్, రాంబాబు, సత్యనారాయణ, బెనర్జీ, సత్యనారాయణరాజు, సుబ్బారావు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఆరు మండలాల క్లస్టర్ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
బ్యాంకింగ్ @ ‘స్వయం’ సంఘాలు
చిత్తూరు (అగ్రికల్చర్): స్వయం సహా యక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాం చ్లెస్ బ్యాంకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలను ‘వన్ స్టాప్ షాప్’ పేరుతో ఆయా గ్రామాలకు చెందిన ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కేంద్రాల కార్యకలాపాలను వరల్డ్ బ్యాంకు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ కింద స్త్రీనిధి బ్యాంకు ఆధీనంలో బ్రాంచ్‌లెస్ బ్యాంకింగ్‌గా నడుపనున్నారు. జిల్లాలో మొదటి విడతగా 12 మండలాల్లో ఏర్పాటుకు చర్యలుతీసుకోవాలని సెర్ఫ్నుంచి డీఆర్డీఏ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. వన్‌స్టాప్ షాప్‌లద్వారా బ్యాంకు లావాదేవీలు, ఇన్సూరెన్స్, ఉపాధికూలీల పేమెంట్ , సా మాజిక పింఛన్లపంపిణీ తదితరసేవలను నిర్వహిస్తారు. కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వన్ స్టాప్ షాప్‌లను పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు డీఆర్డీఏ, స్త్రీనిధి అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. జనాభా ప్రాతికపదికన 1500 మందికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాలను పూర్తిగా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు కస్టమర్ సర్వీస్ కమిటీల సభ్యులుగా మహిళలను నియమిస్తారు. ఆయా గ్రామ సమాఖ్యలు కస్టమర్ సర్వీస్ పాయింట్లుగా, సంఘాల్లోని మహిళలు విలేజ్ లెవల్ ఎంటర్ప్రైజర్లుగా కేంద్రాలను నిర్వహించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అనువైన ప్రదేశాలను గుర్తించి జనవరి రెండో వారంలో సెర్ఫ్ అధికారులకు పంపించనున్నారు. మొదటి విడత ఏర్పాటుచేయనున్న మండలాలు ఇవే వన్ స్టాప్ షాప్‌ల పేరుతో నిర్వహించనున్న బ్రాంచిలెస్ బ్యాంకింగ్ సేవల కేంద్రాలను మొదటి విడతగా తవణంపల్లి, బంగారుపాళ్యం, బెరైడ్డిపల్లి, చౌడేపల్లి, పెద్దమండ్యం, తంబళ్లపల్లి, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, చిన్నగొట్టిగల్లు, కేవీ పల్లి, ములకలచెరువు, ఎర్రావారిపాళెం మండలాల్లో ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. బ్యాంకింగ్ సేవలు చేరువ చేయడానికి.. గ్రామీణ ప్రాంతంలోని సంఘాల మహిళలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేయాలనే తలంపుతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రాల ద్వారా సంఘాల్లోని మహిళలకే కాకుండా సామాజిక పింఛనుదారులు, ఉపాధి కూలీలకు పేమెంట్లు, వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ల జారీ తదితర ప్రభుత్వ సేవలు కూడా అనుసంధానం చేయనున్నాం. మొదటి విడతగా 12 మండలాల్లో అనువైన ప్రదేశాల ఎంపిక ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేసి జాబితాలను సెర్ఫ్‌కు పంపిస్తాం. -జి.వెంకటప్రకాష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్త్రీనిధి బ్యాంక్ -
ఇంకెప్పుడో..!
ఒక్క పాఠశాలకూ అందని యూనిఫాం జిల్లాకు రూ. 6 కోట్లు కేటాయింపు మూడు కోట్లు ఆప్కోకు విడుదల 20 మండలాలకు సిద్ధం చేస్తున్న మెప్మా మహిళలు మరో 30 మండలాల విద్యార్థులకు ఎప్పుడో సాక్షి, కడప : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో మూడు నెలల వరకూ యూనిఫాం అందే అవకాశం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం మాత్రం అందలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. మొత్తం యూనిఫాం పూర్తికావాలంటే మరొక మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,684 పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు యూనిఫాంను సర్వశిక్షా అభియాన్ పథకం(ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లాలోని దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయాలి. ఈ దుస్తులకు సంబంధించి వస్త్రాలను పంపిణీ చేసే బాధ్యతను ఆప్కో సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీని కోసం ఆ సంస్థకు ఇప్పటి వరకు రూ. 3 కోట్లు అందజేసినట్లు తెలుస్తోంది. దుస్తుల కోసం రెండు నెలల క్రితం ఎస్ఎస్ఏకు దాదాపు రూ. 6కోట్లు మంజూరు కాగా ఇందులో 50 శాతం నిధులను విడుదల చేసినట్లు తెలిసింది. కుట్టేదెప్పుడు... కట్టేదెప్పుడు విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్ఎస్ఏ అధికారులు స్కూలు మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించారు. వీటిని కేవలం మెప్మా వారి ద్వారానే కుట్టించుకోవాలని మెలిక పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా కుట్టే కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు 4 లక్షల దుస్తులు ఎప్పుడు కుడతారో.. పాఠశాలలకు ఎప్పుడు అందజేస్తారో తెలియని పరిస్థితి. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ‘సారీ’ ఇదే వరుస... విద్యార్థుల యూనిఫాం విషయంలో ప్రభుత్వాలు ప్రతిసారీ ఇదే విధానం అమలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారినా విధానాల్లో మార్పులు రావడం లేదు. ఏటా పాఠశాలల పునఃప్రారంభ సమయంలో విద్యార్థుల సంక్షేమం పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాలకు యూనిఫాం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. యూనిఫాం జనవరి నాటికి ఇచ్చినా మరో నాలుగు నెలలు మాత్రమే విద్యార్థులు వాడుకునే అవకాశం ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్మాసంలోనే అందజేస్తే ప్రయోజనం ఉంటుందని పరిశీలకు అంటున్నారు. స్కూల్ కమిటీలకు అందజేశాం జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు ఇంతవరకు యూనిఫాం అందని విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఆర్వీఎం ఇన్‌ఛార్జి పీఓ ప్రతిభా భారతిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆప్కో ద్వారా వస్త్రాలను అన్ని స్కూలు కమిటీలకు అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని మండలాలకు మెప్మా మహిళలతో యూనిఫాం కుట్టించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. మిగతా మండలాల వారికి కూడా ఒకట్రెండు రోజుల్లో యూనిఫాంను కుట్టించే కార్యక్రమాన్ని ప్రారంభించి త్వరలోనే విద్యార్థులకు అందజేస్తామన్నారు. -
స్వావలంబనకు విజయపతాకం
పెళ్లి, కాపురం, పిల్లలు... ప్రతి మహిళా కోరుకునే అదృష్టాలు. జయాదేవికి అవి కోరుకోకుండానే దక్కాయి. అయినా వాటితో సంతృప్తి పడిపోలేదామె. ఒక స్త్రీగా మాత్రమే ఆలోచించి ఉండిపోలేదు. సమాజంలో ఓ బాధ్యత గల పౌరురాలిగా ఆలోచించింది. పదిమందికీ ఉపయోగపడటంలోనే అసలైన ఆనందం ఉందని అనుకుంది. అందుకే ఆమె నేడు కొన్ని వందల కుటుంబాలకు పెద్ద దిక్కయ్యింది. కొన్ని వేల మందిని వెనకుండి నడిపిస్తోంది. కొన్ని లక్షల మందిలో స్ఫూర్తిని నింపుతోంది! ఒకరి వెంట నడవడం తేలికే. కానీ పది మందిని వెంట నడిపించుకోవడం అంత తేలిక కాదు. అలా చూస్తే జయాదేవిని గొప్ప నాయకురాలని అనాలి. ఎందుకంటే ఆమె వెంట కొన్ని ఊళ్లే నడుస్తున్నాయి. ఆమె అడుగుల్లో అడుగులు వేస్తూ తమ రూపురేఖల్ని అందంగా మార్చుకుంటున్నాయి. బీహార్‌లోని చాలా ఊళ్లలో జయాదేవి పేరు మారు మోగుతూ ఉంటుంది. ఆవిడ ఎవరు అని అడిగితే... అందరి కంఠాలూ ఒకేసారి పలుకుతాయి... మా అమ్మాయి అని! అందరూ ఆమెను తమ ఇంటి బిడ్డే అనుకుంటారు. తమ కుటుంబాలను నిలబెట్టిన దేవతగా కొలుస్తారు. జీవితాలనే మార్చేసింది... బీహార్ రాష్ట్రంలోని ‘సారథి’ అనే గ్రామంలో పుట్టింది జయాదేవి. అభివృద్ధి అన్న మాటకు ఆమడదూరంలో ఉండే ఊరది. ఆడపిల్లలకు పెళ్లే జీవితం అనే నమ్మకం అక్కడి వారిది. అందుకే ఐదో తరగతితోనే జయాదేవి చదువుకు ఫుల్స్టాప్ పడింది. పన్నెండో యేటనే ఆమె మెడలో తాళిబొట్టు పడింది. కాపురం అంటే ఏమిటో తెలియని వయసులోనే అత్తవారింటికి పయనమయ్యింది. తన పసితనం పూర్తిగా పోకముందే ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఇంటిని చక్కబెట్టుకోలేక చాలా అవస్థ పడేది. భర్త రోజు కూలీ. అతడి సంపాదనతో పాటు రెండు ఆవుల మీద వచ్చే ఆదాయంతో నలుగురు మనుషులు బతకాలి. చాలా ఇబ్బంది అనిపించేది. సరిగ్గా అప్పుడే నోట్రడామ్ హెల్త్ సెంటర్ నుంచి కొందరు నన్స వచ్చారు. వారి ద్వారా స్వయం సహాయక సంఘాల గురించి తెలిసింది జయాదేవికి. వెంటనే తన కష్టాలు గుర్తు రాలేదామెకి. తన ఊరు, చుట్టుపక్కల ఊళ్లలోని వారి కష్టాలు గుర్తొచ్చాయి. తన కుటుంబంతో పాటు వారందరి కుటుంబాలనూ చక్క దిద్దాలనే ఆలోచన వచ్చింది. వెంటనే కార్యాచరణ మొదలు పెట్టింది. తన స్వస్థలంతో మొదలుపెట్టి ఊరూరా తిరిగింది. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు గురించి అందరికీ వివరించింది. ఒక్కచోట మొదలుపెట్టి పలు గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసింది. అలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నలభై అయిదు గ్రామాల్లో 285 సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలో సఫలీకృతురాలయ్యింది. రెండువేల మంది మహిళలను సభ్యులను చేసింది. ఆర్థిక స్వావలంబన కలిగించింది. వారంద రి పిల్లలనూ బడిబాట పట్టించింది. ఈ అందరి ఆకలి మంటలను చల్లార్చింది. ప్రతి ఇంటా ఆనందాన్ని నింపింది. ఆమె అంతటితో ఆగిపోలేదు. ఆ గ్రామాల్లో నక్సలైట్ల దాడుల కారణంగా జరుగుతోన్న దారుణాల మీద దృష్టి పెట్టింది. వారికి భయపడే తండ్రి తనను బడి మాన్పించి పెళ్లి చేసి పంపేయడం, అందంగా ఉంటుందన్న కారణంగా తన చెల్లెలిని దూరంగా వేరేవాళ్ల ఇంట్లో ఉంచడం వంటివన్నీ ఆమెను ఎంతో బాధించాయి. ఆ పరిస్థితి ఏ ఆడపిల్లకూ రాకూడదని తపించింది. నక్సల్ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తింది. పోలీసు వ్యవస్థను జాగృతం చేసింది. నక్సలైట్ల నీడ ఊళ్లమీద పడకుండా చేసింది. ఆపైన ఆమె సాధించిన మరో విజయం... వ్యవసాయ అభివృద్ధి. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా నీటి పారుదలను మెరుగుపర్చింది. వ్యవసాయంలో కొత్త పద్ధతులను అక్కడి రైతులకు పరిచయం చేసింది. దాంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ పాటు పడటం మొదలుపెట్టింది. వేల సంఖ్యలో మొక్కలను నాటి గ్రామాలన్నింటికీ పచ్చరంగు పూసేసింది. ఎన్నో అవార్డులను, రివార్డులనూ అందుకుంది. ఒక్క మహిళ ఇన్ని సాధించడం మాటలు కాదు అని ఎవరైనా అంటే... ‘ఇది నా ఒక్కదాని వల్లా కాలేదు, అందరూ సహకరించడం వల్లే సాధ్యపడింది’ అంటుంది జయాదేవి వినమ్రంగా. ఇంత సాధించినా ఇప్పటికీ విశ్రమించదలచు కోలేదామె. ఇంకా ఇంకా ఏదైనా చేయాలని తపిస్తోంది. అసలు మా రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోని ప్రతి గ్రామమూ ఇలా మారిపోవాలి అంటోంది. రాష్ట్రానికో జయాదేవి ఉంటే అది అసాధ్యమేమీ కాదు. కనీసం మనలో కొందరైనా ఆమె స్ఫూర్తితో అడుగులేస్తే ఆమె అన్నది జరగక మానదు! -
గ్రూపులుగా ఏర్పడితే వడ్డీలేని రుణాలు
నర్సాపూర్,న్యూస్‌లైన్: పద్ధెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడితే వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వి. సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గతంలో దరఖాస్తు చేయకపోవడంతో కొందరు స్కాలర్‌షిప్పుకు అర్హత పొందలేదని, అలాంటి వారికి ప్రత్యేకంగా కృషి చేసి స్కాలర్ షిప్‌లు మంజూరు చేయించినట్లు తెలిపారు. కాగా 18 సంవత్సరాలు నిండిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే వడ్డీలేని రుణాలు పొందవచ్చని చెప్పారు. అంతేకాకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంటు కార్యక్రమం కింద సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 4400మంది సభ్యులకు గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 365మందికి చెక్కులను పంపిణీ చేశారు. గెలుపుకోసం కృషి చేయాలి క్రీడల్లో ఓడిన వారు గెలుపు కోసం కృషి చేయాలని, ఓటమి చెందినంత మాత్రాన నిరుత్సాహ పడవద్దని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గత వారం రోజులుగా నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగిన హన్మంతు రామయ్య స్మారక నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ క్రీడలతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుడ్యం, స్నేహభావం పెంపొందుతాయన్నారు. క్రీడల నిర్వహణ అభినందనీయమని ఆమె నిర్వాహకులను అభినందించారు. కాగా నర్సాపూర్‌కు చెందిన హనుమాన్ జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా మండలంలోని జక్కపల్లికి చెందిన బంజారా జట్టు ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. అనంతరం క్రీడాకారులకు షీల్డులు, వ్యకిగత బహుమతులు, నగదు బహుమతులను మంత్రి అందచేశారు. అలాగే హన్మంతు సరస్వతి స్మారకార్థం నెల 24న నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, మాజీ సర్పంచ్‌లు నర్సింగ్‌రావు, సంజీవరావు, కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్యంగౌడ్, అంజనేయులుగౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అళ్వారయ్య, అనిల్‌గౌడ్, చందన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, భరత్‌గౌడ్, నర్సింగరావు పాల్గొన్నారు.