ఇంకెప్పుడో..!
- ఒక్క పాఠశాలకూ అందని యూనిఫాం
- జిల్లాకు రూ. 6 కోట్లు కేటాయింపు
- మూడు కోట్లు ఆప్కోకు విడుదల
- 20 మండలాలకు సిద్ధం చేస్తున్న మెప్మా మహిళలు
- మరో 30 మండలాల విద్యార్థులకు ఎప్పుడో
సాక్షి, కడప : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో మూడు నెలల వరకూ యూనిఫాం అందే అవకాశం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం మాత్రం అందలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. మొత్తం యూనిఫాం పూర్తికావాలంటే మరొక మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,684 పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు యూనిఫాంను సర్వశిక్షా అభియాన్ పథకం(ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది.
ఈ పథకం ద్వారా జిల్లాలోని దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయాలి. ఈ దుస్తులకు సంబంధించి వస్త్రాలను పంపిణీ చేసే బాధ్యతను ఆప్కో సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీని కోసం ఆ సంస్థకు ఇప్పటి వరకు రూ. 3 కోట్లు అందజేసినట్లు తెలుస్తోంది. దుస్తుల కోసం రెండు నెలల క్రితం ఎస్‌ఎస్‌ఏకు దాదాపు రూ. 6కోట్లు మంజూరు కాగా ఇందులో 50 శాతం నిధులను విడుదల చేసినట్లు తెలిసింది.
కుట్టేదెప్పుడు... కట్టేదెప్పుడు
విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్‌ఎస్‌ఏ అధికారులు స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పగించారు. వీటిని కేవలం మెప్మా వారి ద్వారానే కుట్టించుకోవాలని మెలిక పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా కుట్టే కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు 4 లక్షల దుస్తులు ఎప్పుడు కుడతారో.. పాఠశాలలకు ఎప్పుడు అందజేస్తారో తెలియని పరిస్థితి. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి ‘సారీ’ ఇదే వరుస...
విద్యార్థుల యూనిఫాం విషయంలో ప్రభుత్వాలు ప్రతిసారీ ఇదే విధానం అమలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారినా విధానాల్లో మార్పులు రావడం లేదు. ఏటా పాఠశాలల పునఃప్రారంభ సమయంలో విద్యార్థుల సంక్షేమం పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాలకు యూనిఫాం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. యూనిఫాం జనవరి నాటికి ఇచ్చినా మరో నాలుగు నెలలు మాత్రమే విద్యార్థులు వాడుకునే అవకాశం ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌మాసంలోనే అందజేస్తే ప్రయోజనం ఉంటుందని పరిశీలకు అంటున్నారు.
స్కూల్ కమిటీలకు అందజేశాం
జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు ఇంతవరకు యూనిఫాం అందని విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఆర్వీఎం ఇన్‌ఛార్జి పీఓ ప్రతిభా భారతిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆప్కో ద్వారా వస్త్రాలను అన్ని స్కూలు కమిటీలకు అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని మండలాలకు మెప్మా మహిళలతో యూనిఫాం కుట్టించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. మిగతా మండలాల వారికి కూడా ఒకట్రెండు రోజుల్లో యూనిఫాంను కుట్టించే కార్యక్రమాన్ని ప్రారంభించి త్వరలోనే విద్యార్థులకు అందజేస్తామన్నారు.