నర్సాపూర్,న్యూస్‌లైన్: పద్ధెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడితే వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వి. సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గతంలో దరఖాస్తు చేయకపోవడంతో కొందరు స్కాలర్‌షిప్పుకు అర్హత పొందలేదని, అలాంటి వారికి ప్రత్యేకంగా కృషి చేసి స్కాలర్ షిప్‌లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
కాగా 18 సంవత్సరాలు నిండిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే వడ్డీలేని రుణాలు పొందవచ్చని చెప్పారు. అంతేకాకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంటు కార్యక్రమం కింద సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 4400మంది సభ్యులకు గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 365మందికి చెక్కులను పంపిణీ చేశారు.
గెలుపుకోసం కృషి చేయాలి
క్రీడల్లో ఓడిన వారు గెలుపు కోసం కృషి చేయాలని, ఓటమి చెందినంత మాత్రాన నిరుత్సాహ పడవద్దని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గత వారం రోజులుగా నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగిన హన్మంతు రామయ్య స్మారక నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ క్రీడలతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుడ్యం, స్నేహభావం పెంపొందుతాయన్నారు.
క్రీడల నిర్వహణ అభినందనీయమని ఆమె నిర్వాహకులను అభినందించారు. కాగా నర్సాపూర్‌కు చెందిన హనుమాన్ జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా మండలంలోని జక్కపల్లికి చెందిన బంజారా జట్టు ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. అనంతరం క్రీడాకారులకు షీల్డులు, వ్యకిగత బహుమతులు, నగదు బహుమతులను మంత్రి అందచేశారు. అలాగే హన్మంతు సరస్వతి స్మారకార్థం నెల 24న నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, మాజీ సర్పంచ్‌లు నర్సింగ్‌రావు, సంజీవరావు, కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్యంగౌడ్, అంజనేయులుగౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అళ్వారయ్య, అనిల్‌గౌడ్, చందన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, భరత్‌గౌడ్, నర్సింగరావు పాల్గొన్నారు.
గ్రూపులుగా ఏర్పడితే వడ్డీలేని రుణాలు
Published Mon, Jan 27 2014 12:11 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement