
పర్యావరణ మిత్రుడు
‘‘ఆఖరి చెట్టును కూడా కొట్టేసిన తర్వాత, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేశాక... చిట్ట చివరి చేపను కూడా పట్టేశాక... అప్పుడు గుర్తిస్తావు నువ్వు... డబ్బును తినలేమని!’’ ఆదిమ రెడ్ ఇండియన్ల సామెత ఇది. ఈ సామెత ఆ యువకుడి ఆలోచనలను ప్రభావితం చేసింది. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోయాక, ప్రపంచమే కలుషితమైపోయాక ఎంత సంపాదించినా సుఖంగా జీవించలేమన్న విషయాన్ని బోధపడేలా చేసింది. ‘నెక్ట్స్ జెన్ సొల్యూషన్’ స్థాపనవైపు అతడిని నడిపించింది.
ముంబైకి చెందిన అభిషేక్ హంబద్ (26) బిట్స్ పిలానీలో చదివాడు. అక్కడ హాస్టల్ రూముల్లో... తన స్నేహితులతో జరిపిన చర్చల్లో... పలుమార్లు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రస్తావన వచ్చింది. పర్యావరణానికీ, మనిషి జీవనానికీ ఉన్న ముడిని అప్పుడే అర్థం చేసుకున్నాడు అభిషేక్. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే, భవిష్యత్తులో మనల్ని మనం కాపాడుకోలేమన్న ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. అలాగని కేవలం పర్యావరణ పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేయాలనీ అనుకోలేదు. ముందు ఉపాధిని కల్పించుకోవాలి. ఆ ఉపాధి ద్వారానే తాను అనుకున్నది సాధించాలి. అలా జీవనభృతికి, జీవిత లక్ష్యానికీ ముడిపెట్టాడు. నెక్ట్స్‌జెన్ సొల్యూషన్ సంస్థను స్థాపించాడు. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో అనేక కార్పొరేట్ కంపెనీలకు మార్గదర్శకుడయ్యాడు. కోట్ల టర్నోవర్‌తో యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సమాజహితం కోరుతూనే...
నెక్ట్స్‌జెన్ సంస్థ... పెద్ద పెద్ద ఇండస్ట్రీలతోనూ, కంపెనీలతోనూ కలిసి పని చేస్తుంది. ఇంధన వృథాను అరికడుతూ, వాటి నుంచి వెలువడే భయంకరమైన ఉద్గారాలను నియంత్రించడమే దాని పని. ప్రత్యేకించి తమ పని విధానం పర్యావరణానికి ప్రమాదకరం కాకూడదు అని భావించే కంపెనీలతో అభిషేక్ బృందం పనిచేస్తున్నారు. ఇంధన నియంత్రణ, పునరుద్ధరింపదగ్గ వనరులను ఉపయోగించడం వంటి అంశాల గురించి అధ్యయనం చేసి, ఆయా కంపెనీలకు సలహాదారులుగా ఉంటున్నారు. ఫలితంగా పరిశ్రమలకు నిర్వహణ ఖర్చు తగ్గుతోంది. వ్యర్థాలు తగ్గుతున్నాయి. తద్వారా ఉద్గారాల నియంత్రణతో పర్యావరణానికి ఎంతో కొంత మేలు జరుగుతోంది.
‘‘నేను చేసే వ్యాపారం ఉపాధి మార్గంగానే కాకుండా పదిమందికి ఉపయోగపడేలా, సమాజాన్ని ప్రభావితం చేసేదిగా ఉండాలని కలలు కనేవాడిని, అందుకు తగ్గట్టుగా పిలానీలోని బిట్స్ క్యాంపస్ లో చదివిన ఇంజనీరింగ్ నా ఆలోచన తీరుకు ఒక ఆకారాన్ని ఇచ్చింది’’ అంటాడు అభిషేక్. పర్యావరణ కాలుష్యం గురించి అనునిత్యం అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్న ఆందోళనలను గమనించి, ఇంధనవృథా వల్ల తలెత్తబోయే పరిస్థితుల గురించి తెలుసుకొన్నప్పుడు అతడి మనసులో ఒక విధమైన ఆందోళన నిండిపోయేది. అది తన ఒక్కడి సమస్య కాకపోయినా, భవిష్యత్తు తరాల గురించి తలుచుకొంటే భయమేసేది. అందుకే తానేం చేయగలడా అని ఆలోచించేవాడు.
ఆ మేధోమథనం గురించి చెబుతూ... ‘‘నేను ఒక సాధారణ బీటెక్ గ్రాడ్యుయేట్‌గానే కనిపించేవాడిని. చదువు పూర్తి చేయడం, మంచి ఉద్యోగం తెచ్చుకోవడం, ఒక కారు కొని దానికి ‘సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా’ అంటూ ఒక స్టిక్కర్ అతికించుకోవడం... అదే నేను పర్యావరణ పరిరక్షణకై చేసే పెద్ద ఉపకారంగా భావించేవాడిని. ఈ సమయంలో స్నేహితులందరిలోనూ మొదలైన చైతన్యం ‘నెక్ట్స్‌జెన్’కు ఊపిరి పోసింది. 2009లో ఈ కంపెనీ ప్రారంభం అయ్యింది’’ అంటూ తన సుదీర్ఘప్రయాణం గురించి వివరిస్తాడు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా 360 కంపెనీలకు ఇంధన వనరుల నిర్వహణ, నియంత్రణ వంటి విషయాల్లో గైడ్‌గా మారింది నెక్ట్స్‌జెన్. కంపెనీలతో మమేకం కావడంలోనే దాని విజయం దాగివుంది. ‘ఫార్చ్యూన్ 500’ కంపెనీస్ జాబితాలోని పది కంపెనీలతో నెక్ట్స్‌జెన్ కలిసి పనిచేస్తోంది. దాని వ్యవస్థాపకుడిగా అభిషేక్‌కు ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అనేక అవార్డులను తెచ్చిపెట్టింది!
నేడు ప్రపంచ వ్యాప్తంగా 360 కంపెనీలకు ఇంధన వనరుల నిర్వహణ, నియంత్రణ వంటి విషయాల్లో గైడ్‌గా మారింది నెక్స్ట్‌జెన్. కంపెనీలతో మమేకం కావడంలోనే దాని విజయం దాగివుంది. ‘ఫార్చ్యూన్ 500’ కంపెనీస్ జాబితాలోని
పది కంపెనీలతో నెక్ట్స్‌జెన్ కలిసి పనిచేస్తోంది.