
పర్యావరణ సంరక్షణలో
భారతదేశానికి చెందిన పది సంవత్సరాల బాలుడు అబ్దుల్ ముఖీత్ యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తూ చిన్న వయస్సులోనే ఎంతోమందికి మార్గదర్శకుడయ్యాడు. ప్రతిరోజూ న్యూస్‌పేపర్లతో బ్యాగులు చేసి సూపర్ మార్కెట్లకు, కొన్ని షాపింగ్ సెంటర్లకు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
తండ్రి అతనికి ప్లాస్టిక్ కారణంగా కలిగే నష్టాలను వివరించడంతో ఎనిమిదేళ్ళ ప్రాయం నుంచే అబ్దుల్ ఈ బ్యాగులు తయారు చేసి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. అబ్దుల్ ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికో లేక టీవీ చూడడానికో ఇష్టపడతారు కానీ అబ్దుల్ దానికి భిన్నంగా పేపరు బ్యాగుల తయారీలో నిమగ్నమైపోతాడు. అబ్దుల్ ఇప్పటి వరకు దాదాపు 4,500 బ్యాగులు పంపిణీ చేశాడు.
అతన్ని స్కూల్‌లో అందరూ ‘అబ్దుల్ ముఖీత్ బ్యాగ్స్’ అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటారు. ఇంకా అబ్దుల్ ‘పేపర్ బ్యాగ్ బాయ్’గా కూడా ప్రసిద్ధి. అందరూ నన్ను అలా పిలుస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందని అబ్దుల్ చెబుతున్నాడు. ప్రస్తుతం అబ్దుల్ తన స్వస్థలంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిని తగ్గించడానికి కృషి చేస్తూ భూమాతను, పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. అతని కృషికి మెచ్చి కొన్ని సంస్థలు ప్రతిష్టాత్మకమైన అవార్డులతో, ప్రశంసా పత్రాలతో సత్కరించాయి.