లోకకల్యాణం కోసమే అప్తోర్యామం
కర్నూలు(జిల్లా పరిషత్): అప్తోర్యామం, మహాసౌర యాగాలతో పర్యావరణ పరిరక్షణతో పాటు లోక కల్యాణం సిద్ధిస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం స్థానిక గాయత్రి ఎస్టేట్స్‌లోని పుష్పక్ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మహాయాగాన్ని విజయవంతం చేయాలన్నారు. యాగంలో పాల్గొనాలని ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించామన్నారు.
కృష్ణదేవరాయల కాలం నుంచే రాయలసీమ ప్రాంతంలో యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారన్నారు. యాగం మహా యోగమని.. కులమతాలకు అతీతంగా ఇలాంటి యాగాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న యాగానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలన్నారు.
కరువు కాటకాలతో అల్లాడే ఈ ప్రాంతంలో యాగ నిర్వహణ వల్ల సస్యశ్యామలం అవుతుందన్నారు. మాజీ మంత్రి కె.ఈ.ప్రభాకర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికి కర్నూలు రాధాని కాలేకపోయినా.. యజ్ఞయాగాలకు రాజధాని అవడం శుభపరిణామమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పరంగా యాగానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హోమ పర్యవేక్షకులు బ్రహ్మశ్రీ కేసా ప్రగడ హరిహరనాథశర్మ మాట్లాడుతూ 90 ఏళ్ల క్రితం రెంటచింతల యాజులు ఈ యాగాన్ని రాష్ట్రంలో నిర్వహించారన్నారు. అప్తోర్యామం-శ్రౌతయాగం-మహాయాగం-స్మార్త యాగం ఏకకాలంలో ఒకే స్థలంలో, రెండు విడివిడి యాగశాలల్లో, రెండు విడి బృందాలుగా చేపట్టడం విశేషమన్నారు.
జీవకోటి ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ, దీక్షతో నిర్వహించే ఇలాంటి మహాయాగాలు అరుదన్నారు. సమావేశంలో ప్రజాహిత సేవా సమితి ట్రస్ట్ బ్రహ్మశ్రీ కేసా ప్రగడ ఫణిరాజశేఖరశర్మ, యాగ పీఆర్‌వో వెంకటాచలం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ ధనారెడ్డి, పబ్లిక్‌హెల్త్ రిటైర్డ్ ఎస్‌ఈ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ, ఎమ్మెల్యే ఐజయ్య, రాయలసీమ,
Environmental conservation, MLA ijayya, Rayalaseema