నరసరావుపేట రూరల్:‘ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందుకోసం తప్పనిసరిగా మొక్కలు నాటాలి. వాటిని నిబద్ధతతో సంరక్షించుకోవాలి’ అంటూ పర్యావరణ వేత్తలు, పాలకులు నెత్తీనోరు మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయి సిబ్బంది చెవికి అవేమీ ఎక్కడంలేదు. ‘నీరు-చెట్టు’ అంటూ సర్కారు ఒకవైపు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటే దీనికి ఆదర్శంగా ఉండాల్సిన అటవీశాఖ అధికారులు పూర్తిగా నీరుగారుస్తున్నారు.
దీంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ము మట్టిపాలుకానుంది. ఇందుకు తాజా ఉదాహరణే కోటప్పకొండలో నాటిన మొక్కల దుస్థితి. వినుకొండ జోన్ పరిధిలోని కోటప్పకొండ అటవీ ప్రాంతంలో శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు ఎర్రచందనం మొక్కలను నాటారు. గత ఏడాది ఆగస్టులో ఆయన స్వయంగా మొక్కలు నాటారు.
పెట్లూరివారిపాలెం వైపు వెళ్ళే రహదారిలో కొండ దిగువన ఐదు హెక్టార్లలో మొక్కలు సాగుచేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.15 లక్షల ఖర్చుచేసి పిచ్చిమొక్కలు తొలగించి, నేలను చదును చేసి రెండువేల ఎర్రచందనం మొక్కలు నాటారు. కానీ వాటి సంరక్షణను మరిచారు. మొక్కలకు నీరు కూడా సక్రమంగా అందించకపోవడంతో ప్రస్తుతం కొన్ని మొక్కలు ఎండిపోగా మరికొన్ని ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను పెంచుతున్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఎండిపోయిన గడ్డితో నిండిపోయింది. అటవీ శాఖాధికారులు ఎంత నిబద్ధతతో మొక్కల పెంపకాన్ని చేపట్టారో దీనిని చూస్తే అర్థమవుతోంది. వేసవి రాకముందే మొక్కలు ఎండిపోతే రానున్న రోజుల్లో ఎండలు పెరిగితే మిగిలిన మొక్కల సంరక్షణ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
వాటర్ ట్యాంకర్లతో మొక్కలకు నీటిని అందిస్తాం
కోటప్పకొండ అటవీప్రాంతంలో పెంచుతున్న ఎర్రచందనం మొక్కల సంరక్షణకు వేసవిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి మొక్కలకు అందిస్తాం. ఇప్పటికైతే మొక్కల పరిస్థితి బాగానే ఉంది.
- బద్దునాయక్, ఫారెస్ట్‌సెక్షన్ ఆఫీసర్, కోటప్పకొండ