
‘ప్రాణహిత’ కోసం భూసేకరణ
- జిల్లాలో 448 ఎకరాల అటవీ భూమి సేకరణ
- డీఎఫ్‌ఓ సోనీబాల
వెల్దుర్తి: ప్రాణహిత చేవెళ్ల కాల్వల నిర్మాణం కోసం జిల్లాలో 448 ఎకరాల అటవీ భూములను సేకరిస్తున్నట్లు డిఎఫ్‌వో సోనీబాల తెలిపారు. బుధవారం మండలంలోని మంగళపర్తి, యశ్వంతరావుపేట తదితర అటవీ ప్రాంతంలో జీపీయస్ సిస్టమ్ ద్వారా మ్యాపుల ఆధారంగా ముమ్మరంగా పర్యటించి హద్దులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల కాల్వల నిర్మాణానికి పిల్లుట్ల, వెల్దుర్తి, మంగళపర్తి, హస్తాల్‌పూర్‌ల రిజర్వ్ ఫారెస్టులోని ప్యాకేజీ 18లో 182 హెక్టార్లు, ప్యాకేజీ 14లోని దౌల్తాబాద్ రిజర్వ్ ఫారెస్టులో 4 హెక్టార్లు, ప్యాకేజీ 15లోని జగదేవ్‌పూర్ రిజర్వ్ ఫారెస్టులో 7 హెక్టార్ల అటవీ భూముల్లో కాల్వల నిర్మాణం కోసం స్థలం సేకరిస్తున్నామన్నారు. అలాగే కాల్వల నిర్మాణం వల్ల ఎన్ని చెట్లు కోల్పోతున్నామో వాటి వివరాలను సేకరిస్తున్నామన్నారు.
జిల్లాలోని తమ అటవీ భూములు ఎంత కోల్పోతున్నామో అంత భూమిని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. అటవీ భూములను ఎవరైనా కబ్జాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని హస్తాల్‌పూర్ అటవీ ప్రాంతంలో దాదాపు 15 ఎకరాలలో విలువైన చెట్లను నరికివేసి కొందరు కబ్జా చేశారు. పంటలు సాగు చేస్తున్నారని విలేకర్లు ఆమె దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించారు. చర్యలు తీసుకొని అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని మెదక్ రేంజ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. డీఎఫ్‌వో వెంట ప్రాణహిత చేవేళ్ల ఇంజనీర్, సర్వేయర్లు, మెదక్‌రేంజ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.