నల్లమల అందాల అల
నల్లమల.. ఆ పేరు వింటేనే అభయారణ్యంతో పాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతమే నేడు పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోబోతుంది. పోటీ ప్రపంచంతో కుస్తీపట్టి విసిగిపోయి.. అలసిపోయిన పట్టణజనం సెలవుదినాల్లో ఈ ప్రాంతంలో గడపడానికి అత్యంత మక్కువ చూపుతున్నారు. ఇక్కడ జలజల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రాగాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు.. నాటి శిల్పకళను తెలియజేసే ఎంతో సుందరమైన కట్టడాలు ఆధ్యాత్మికను నింపుతాయి. కనుచూపుమేర పచ్చదనం.. నింగిని తాకుతున్నట్లుగా కనిపించే అరుదైన వృక్షాలు ఆహ్లాదపరుస్తాయి. అడవిని చీల్చుతూ ముందుకుసాగే రోడ్డు వెంట ఎన్నో మరెన్నో అందాలు చూడొచ్చు.
మన్ననూర్: నల్లమల ముఖద్వారమైన మన్ననూర్ నుంచి ప్రారంభమయ్యే అభయారణ్యంలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అటవీశాఖ చెక్‌పోస్టు వద్దే వనమాలిక ఉంది. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి హంగులతో, పచ్చని చెట్ల నడుమ విడిది కేంద్రాలు ఉన్నాయి. ఎన్నో వన్యప్రాణులు తలదాచుకుంటూ తమ సంతతిని వృద్ధిచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అటవీశాఖ నల్లమలను పర్యాటక ప్రాంతంగా, ప్రశా ంత వాతావరణానికి కేంద్రంగా తీర్చిదిద్దాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
శ్రీశైల ఉత్తర ముఖద్వారంగాఉమామహేశ్వరం
శ్రీశైల ఉత్తర ముఖద్వారంగా విరాజిల్లుతు న్న శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికంతోపాటు నల్లమల ఊటీగా పిలుస్తారు. మండుటెండలో కూడా ఈ ప్రాంతంలో చల్లగా ఉండటంతో ఈ ప్రాంతవాసులందరు ఉమామహేశ్వర క్షేత్రాన్ని తరచూ సందర్శిస్తుంటారు. అలాగే శ్రీశైలం వెళ్లే ప్రతీ యాత్రికుడు సైతం ఇక్కడికి వచ్చే శ్రీశైలానికి వెళ్లే సంప్రదాయం అలవాటు పడింది.
వ్యూ పాయింట్ ప్రత్యేకం..
నల్లమల ద్వారం ఫర్హాబాద్ చౌరస్తానుంచి 8 కి.మీ దూరంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న వ్యూ పాయింట్ ఇక్కడ ప్రత్యేకం. సుదూరప్రాంతం, అనేక గ్రామాలు, ఎల్లవేళలా మంచుదుప్పటితో కప్పివేసిన దృశ్యాలను చూసేందుకు చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఆ అందాలు చూడాలంటే రెండు కళ్లూ చాలవు.
సఫారీ ప్రయాణం
నల్లమల అందాలను చూడటానికి అటవీశాఖ సఫారీ వాహనంలో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసింది. అటవీజంతువులను దగ్గరనుంచి చూసేందుకు ఈ వాహనాలెందో ఉపకరిస్తాయి. లోతట్టే ప్రాంతం నుంచి అడవిబిడ్డల గూడేలు, వారి జీవన స్థితిగతులతోపాటు ఎత్తయిన కొండ అందాలను ఈ ప్రయాణంలో చూడొచ్చు. వాచ్‌టవర్, రకరకాల చెట్లు, ఔషధ మూలికలు, అడవిలో స్వేచ్ఛగా సంచరి ంచే వన్యప్రాణులను తిలకించే మంచి అవకాశం కల్పించారు.
జాలువారే జలపాతం
వటువర్లపల్లి గ్రామానికి 10 కి.మీ దూరంలోని మల్లెలతీర్థం ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈకో డెవలప్‌మెంట్ భాగస్వామ్యంతో అటవీశాఖ ఇక్కడ పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పక్కనే శివలింగం ఉండటంతో మునులు, అడవిబిడ్డలు ఆ ప్రాంతంలో తరచూ పూజలుచేస్తుంటారు. అలాగే రోడ్డు వెంట ఉండే ఎన్నో సుందర దృశ్యాలు శ్రీశైలం వెళ్లే యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.