సాక్షి, హైదరాబాద్: పోడు భూములు, అడవుల పరిరక్షణ, హరితహారం అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారుల బృందం శుక్రవారం నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశాలపై సీఎం ఓఎస్‌డీ భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూలతో కూడిన బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతోంది. ఇందుకు సంబంధించి 13 జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ, ఎస్టీ సంక్షేమం, పీఆర్, పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ అంతా శుక్రవారంతోనే ముగియనుంది. తమ క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాలు, సమీక్షల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు అందజేసిన వివరాలు, సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రికల్లా ముఖ్యమంత్రికి నివేదిక సమరి్పంచనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
ఎలా ముందుకెళ్లాలి?
పోడు సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన బహుముఖ వ్యూహం, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్‌వోఎఫ్‌ఆర్), పోడు చేస్తున్న వారిని మరో చోటికి తరలింపు, పునరావాస చర్యలు, అటవీ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఇంకా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు నివేదికలో పొందుపరచనున్నారు. అలాగే ఇకముందు ఆక్రమణలు జరగకుండా ఏమి చేయాలి? హరితహారంలో భాగంగా అడవుల పునరుజ్జీవం, పట్టణ అటవీ పార్కుల తీరుతెన్నులు, రిజర్వ్ ఫారెస్ట్ వెలుపల మొక్కలు, చెట్ల పెంపకానికి చేపట్టాల్సిన కార్యాచరణను వివరించనున్నారు.
పోడు, ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఉన్నతస్థాయి బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ఉదయం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పోడు భూములపై సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే పోడు పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పాటు ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.
అటవీ అంచున కేటాయింపు!
అడవుల మధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున వారికి భూమి కేటాయింపు, తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వసతులు కల్పించడం, రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అటవీ భూముల రక్షణ నిమిత్తం అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా అటవీశాఖే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడతారు. సమావేశం ముగిశాక పోడు భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టి, వాటిల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
3,31,070 ఎకరాలు ..లక్ష మందికి
రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 3,31,070 ఎకరాల పోడు భూములను దాదాపు లక్ష మంది వరకు గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు పంపిణీ చేయాల్సి ఉన్నట్టుగా అటవీశాఖ ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీహక్కుల గుర్తింపు చట్టం తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఈ భూములకు సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు ఇవ్వాలి.
2017 ఆఖరుకు మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులందాయి. 6,30,714 ఎకరాలకు సంబంధించి హక్కులు కల్పించాలంటూ 1,83,107 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4,70,605 ఎకరాలకు సంబంధించి 3,427 సా మూహికంగా క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులు అందాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత క్లెయిమ్స్ కింద 3 లక్షల ఎకరాలకు సంబంధించి 93,494 మందికి హక్కుపత్రాలు ఇచ్చారు. సామూహికంగా 721 క్లెయిమ్స్‌లో భాగంగా 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment