కర్నూలు రూరల్: శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తరలించాలనే లక్ష్యంతో గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద సీమ జిల్లాల్లో 2.6 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 38 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవచ్చు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాల్సి ఉంది. మొదటి దశ కింద ఎస్సార్బీసీ ప్రధాన కాలువ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ (12.44 టీఎంసీలు) కు నీటిని తీసుకెళ్లాలి. అక్కడి నుంచి 57.70 కి.మీ వరద కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్ (4.31 టీఎంసీ) ను నింపాలి. మళ్లీ ఇక్కడి నుంచి 58.125 కి.మీ దూరంలో ఉన్న మరో వరద కాలువ ద్వారా పెన్నా నదిపై కడుతున్న గండికోట రిజర్వాయర్‌కు నీటిని తరలించాలి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ గండికోట రిజర్వాయర్ నుంచి మొదలవుతుంది.
ఇవీ సమస్యలు..
అటవీ భూముల క్లియరెన్స్ తీసుకోకపోవడంతో ప్రాజెక్టు పనులకు ఆదిలో అడ్డంకులు ఏర్పడ్డాయి.
విడతల వారీగా ప్రతిపాదనలు పంపగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 254 ఎకరాలకు అనుమతులు ఇచ్చింది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం భూ సేకరణపై నూతన సంస్కరణలు తీసుకొస్తామని చెబుతోంది.
కేంద్రం ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు.
{పభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి.
కాంట్రాక్టును రద్దుచేయాలని, కొత్త ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని పెంచాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ ప్ర‘గతి’
ఎస్‌ఆర్‌బీసీ కాలువ పరిధిలో గోరకల్లు జలాశయం నిర్మాణానికి రూ.448.20 కోట్లు కేటాయించారు. దీని కోసం ఇప్పటివరకు రూ. 411 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులు 2008లో పూర్తి కావాల్సి ఉంది. అయితే 314 ఎకరాల అటవీ భూములకు అనుమతులు రావలసి ఉంది.
ఎస్‌ఆర్‌బీసీ కాలువ పరిధిలోని అవుకు జలాశయం సొరంగం పనులకు ప్యాకేజీ నంబర్ 30 కింద 401.12 కోట్లు కేటాయించారు. ఈ సొరంగం పనుల్లో నాణ్యతకు తిలోదకాలివ్వటంతో లోపలిభాగంలో సొరంగం పెచ్చులూడుతోంది. అవుకు సొరంగం పనులు పూర్తి కావటానికి ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉన్నా ఇప్పటివరకు అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పాటు అంచనా వ్యయం పెంచాలంటూ కాంట్రాక్టర్ పనులు సక్రమంగా చేయడం లేదు.
36వ ప్యాకేజీ పనుల కోసం రూ. 38.73 కోట్లు కేటాయించారు. ఈ ప్యాకేజీ కింద 13499 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక్కడ 70 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. ఈ పనులకు ఈ నెల చివరితో గడువు ముగుస్తుంది. వివిధ రకాల కారణాలు చూపుతూ కాంట్రాక్టర్ కాంట్రాక్టు క్లోజ్ చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు.
37వ ప్యాకేజీలో రూ.48.40 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.27.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక్కడ కూడా 63.67 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంపై ఎలాంటి స్పందన లేకపోవడంతో 2010లోనే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. చివరికి కాంట్రాక్టును రద్దు చేయాలని సదరు కాంట్రాక్టర్ ప్రభుత్వానికి తెలియజేశారు.
38వ ప్యాకేజీలో 7600 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు రూ.48.36 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.15.64 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 93.92 ఎకరాల భూసేకరణ చేయాల్సిన ఉన్నా రెవెన్యూ అధికారులు, అటు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పనులు రద్దు చేయాలంటూ 2010లోనే దరఖాస్తు చేసుకోవడంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటివరకు ఆ పనులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు.
గాలేరు గతి ఇంతేనా?
Published Thu, Jul 17 2014 2:06 AM | Last Updated on Thu, Oct 4 2018 6:07 PM
Advertisement
Advertisement