Avuku Reservoir
-
నంద్యాల అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు కన్నుమూత..
అవుకు/నంద్యాల: నంద్యాల జిల్లా అవుకు గ్రామంలోని జలాశయంలో ఆదివారం బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి సహా ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో యువతిగల్లంతైంది. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు చిన్నారులకు ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోవెలకుంట్లకు చెందిన హసియా (23), నూర్జహాన్ (37) మృతి చెందగా.. సాజిదా (20) గల్లంతైంది. ప్రమాదం నుంచి బయటపడిన చశ్విక్ (3), హనీ (1) అనే చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో హనీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన డి.రసూల్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో తన సమీప బంధువు ఇంటిలో జరిగిన వివాహ వేడుకకు రసూల్, అతని భార్య మహేశ్వరి, కుమార్తెలు సైదా, సాజిదా (20), రసూల్ అన్న దస్తగిరి, అతని భార్య కాశీంబి, కూతుళ్లు హసీనాభాను, హసియా (23), మనవడు చశ్విక్ , మనవరాలు హనీ, తమ్ముడి కుటుంబం మహబూబ్ బాషా, అతడి భార్య హుసేబీ, మరో తమ్ముడి కుటుంబం బషీర్ బాషా, అతని భార్య నూర్జహాన్(37) హాజరయ్యారు. బోటులో జలవిహారానికి వెళ్లగా.. అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వీరంతా ఆదివారం ఉదయం జలాశయం వద్దకు చేరుకున్నారు. ఇద్దరు చిన్నారులు సహా 14 మంది కలిసి బోటులో జల విహారానికి బయల్దేరారు. రిజర్వాయర్ మధ్యకు వెళ్లగానే బోటులోకి నీళ్లు రావటం చూసి బోట్‌ను నడుపుతున్న వ్యక్తి వెంటనే నీళ్లలోకి దూకేశాడు. బోటు తిరగబడటంతో అందులోని వారంతా ఒక్కసారిగా నీటిలోకి పడిపోయారు. స్థానికుల సాయంతో నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీయగా.. బోటుకింద చిక్కుకున్న హసియా (23) అప్పటికే మృతి చెందింది. మరో మహిళ నూర్జహాన్ (37), చిన్నారులు చశ్విక్, హనీ పరిస్థితి విషమంగా ఉండటంతో బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూర్జహాన్ మృతి చెందింది. ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో వెంకటరెడ్డి, ఆరోగ్య శాఖ, టూరిజం, అగ్నిమాపక శాఖల అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాగా, ప్రమాదానికి గురైన బోటు పర్యాటక శాఖది కాదని జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోటు నిర్వాహకులు లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. చదవండి: ‘నా చావుకు నేనే కారణం...’ -
తొణికిసలాడుతున్న జలాశయాలు
నంద్యాల: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా శ్రీశైలం ప్రాజెక్టు జూలై నెలలోనే నిండింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.70అడుగులు నీటిమట్టం ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 191.6512టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 50,927 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సగటున 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలడంతో వివిధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. రైతులు ఆలస్యం చేయకుండా ఖరీఫ్ పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. నంద్యాల జిల్లాలోని గోరుకల్లు, అవుకు, వెలుగోడు రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి లింకు ఛానల్ ద్వారా వెలుగోడు రిజర్వాయర్‌కు 14వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. వెలుగోడు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.418 టీఎంసీలు నీరు రిజర్వాయర్‌లోకి చేరింది. ఎస్సార్బీసీ చరిత్రలోనే ఇప్పటి వరకు జూలై నెలలో కాల్వలకు నీటిని విడుదల చేయలేదు. అయితే గోరుకల్లు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 10 టీఎంసీలు . ప్రస్తుతం 5 టీఎంసీలు పైగా నీరు నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చాక, గేట్లు ఎత్తిన తర్వాతనే ఎస్సార్బీసీ కాల్వలకు నీరు వదిలేవారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తకముందే రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో జూలై మొదటి వారంలోనే కాల్వలకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బానకచర్ల నుంచి గోరుకల్లు రిజర్వాయర్‌కు 9వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అవుకు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.184 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.184టీఎంసీల నీరు నిల్వ ఉంది. అవుకు రిజర్వాయర్ కింద అధికారికంగా, అనధికారికంగా 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లోకి వరద నీరు భారీగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీ కెనాల్, కుందూకు సమృద్ధిగా నీరు.. సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువకు నీరు వదులుతున్నారు. దీంతో కేసీ కెనాల్, కుందూనదిలో పుష్కలంగా సాగునీరు ప్రవహిస్తోంది. అధికారులు కేసీ కెనాల్ కు వారం క్రితం 14వేల క్యూసెక్కులు నీరు వదలగా ప్రస్తుతం 800 క్యూసెక్కులు నీరు వదులుతున్నారు. కుందూనదిలో ప్రస్తుతం 1250 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. (క్లిక్: ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు) సాగునీటికి ఇబ్బంది ఉండదు ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ పంటలకు సంవృద్ధిగా నీరు అందజేస్తాం. గత మూడు సంవత్సరాలుగా రైతులకు సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు జూలై నెలలోనే భారీగా వరద నీరు రావడంతో దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్లను నీటితో నింపుతున్నాం. ఖరీఫ్ పంటలు వేసే రైతులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పంటలు వేసుకోవాలి. ఈ ఏడాది సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – శేఖర్‌రెడ్డి, జలవనరుల శాఖ ఎస్ఈ, నంద్యాల -
రోడ్లపై చిరుతలు ఎలా పరుగెడుతున్నామో చూడండి
-
నిండుకుండ.. 'గండికోట'!
సాక్షి ప్రతినిధి కడప: గండికోట ప్రాజెక్టు వరుసగా రెండో ఏడాదీ నిండుకుండలా మారనుంది. గతేడాదిలాగే ఈ ఏడాదీ ప్రాజెక్టులో 26.85 టీఎంసీల పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 23.390 టీఎంసీల నీరుంది. శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్ నుంచి గండికోటకు అధికారులు నీటిని విడుదల చేశారు. శనివారం ఉదయానికి నాలుగు వేల క్యూసెక్కులు చేరాయి. ముందుగా 3,000 క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు.. ఆదివారం నుంచి 5,000 క్యూసెక్కులకు పెంచనున్నారు. వారం, పది రోజుల్లోపే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టాలన్నది లక్ష్యం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీటిని నిల్వ పెట్టగా, రెండో ఏడాది పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు నిల్వపెట్టింది. ఇప్పుడు మూడో ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నింపేందుకు సిద్ధమైంది. 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరుంటే దాని పరిధిలోని పైడిపాలెం, చిత్రావతి, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం జలాశయాలను నింపేందుకు వీలుంటుంది. 6.500 టీఎంసీల సామర్థ్యం గల మైలవరంలో ప్రస్తుతం 1.910 టీఎంసీల నీరుంది. 1.658 టీఎంసీల సామర్థ్యం గల వామికొండలో 1.377 టీంఎసీలు, 3.060 టీంఎంసీల సామర్థ్యం గల సర్వరాయసాగర్‌లో 0.638 టీఎంసీలు, 10.29 టీఎంసీల సామర్థ్యం గల చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 8.807 టీఎంసీలు, 6 టీఎంసీల సామర్థ్యం కలిగిన పైడిపాలెంలో 5.622 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వీటిని పూర్తి స్థాయిలో నింపితే వీటి పరిధిలోని రెండు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. 80 శాతానికిపైగా పునరావాస పనులు పూర్తి ఎర్రగుడి, చామలూరు, తాళ్ల ప్రొద్దుటూరు తదితర ముంపు గ్రామాల పునరావాస పనులు వేగంగా జరిగాయి. కోవిడ్ తీవ్రత కారణంగా ఇటీవల కాలంలో పనుల వేగం తగ్గింది. అయినా 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. మొత్తం రూ.82 కోట్లతో ఈ పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.24.50 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం కాంట్రాక్టర్లు రూ.32 కోట్ల మేర బిల్లులు పెట్టారు. అధికారుల వద్ద రూ.24 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్(కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం) సాంకేతిక సమస్యతో నగదు విడుదల తాత్కాలికంగా నిలిచింది. ఈ మొత్తం పనులకు సంబంధించి ఇంకా రూ.52 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. బాబు హయాంలో అరకొర నిధులు, నీళ్లకు కరువు ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం గండికోటకు సంబంధించి రూ.578 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. 2013లో మూడు టీఎంసీల నీటిని మాత్రమే ప్రాజెక్టులో నిల్వ పెట్టింది. 2014–15లో చుక్క నీరు రాలేదు. 2016లో 5, 2017లో 8, 2018లో 12 టీఎంసీల నీటిని నిల్వ పెట్టారు. లక్షలాది ఎకరాలకు నీరందించాం గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం గతేడాది గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ పెట్టింది. దాని పరి«ధిలోని అన్ని సాగునీటి వనరులనూ నీటితో నింపి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాం. మళ్లీ తాజాగా జలాశయానికి కృష్ణా నీటిని విడుదల చేశాం. – మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్ వైఎస్సార్ హయాంలోనే నిర్మాణం గండికోట ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్సార్ 22.10.2004న శంకుస్థాపన చేశారు. తొలుత 11 టీఎంసీల సామర్థ్యంతోనే రూ.250 కోట్లతో నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత 26.85 టీఎంసీలకు సామర్థ్యాన్ని పెంచి రూ.375 కోట్లతో నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఆ తర్వాత వైఎస్ అకాల మరణంతో పునరావాసంతో పాటు పరిహార పంపిణీ నిలిచిపోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఫేజ్–2 కింద కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి పరిధిలోని 7,047 పీడీఎఫ్(పర్సన్ డిస్పేస్డ్ ఫ్యామిలీస్.. నిర్వాసిత కుటుంబాలు)కు సంబంధించి రూ.668.79 కోట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు హయాంలో అరకొరగా డబ్బులిచ్చిన బాధితులకు సైతం పూర్తి స్థాయిలో పరిహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. క్యాష్ బెనిఫిట్ కోరిన వారికి పూర్తి స్థాయిలో డబ్బులిచ్చి పంపగా, మిగిలిన వారికి పునరావాసం సైతం కల్పించింది. ఫేజ్–3 కింద ఏటూరు, రేగడిపల్లె, కె.సుగుమంచిపల్లె, పి.అనంతపురం పరిధిలో 1666 పీడీఎఫ్‌లకు సంబంధించి రూ.157 కోట్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈ పీడీఎఫ్‌లకు సంబంధించి చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడటంతో ఓనర్‌షిప్‌పై స్పష్టత లేదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నడుస్తోంది. విచారణ పూర్తవగానే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా పైగ్రామాల ప్రజలు గండికోట పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి 100 మీటర్ల దూరంలో ఉన్నారు. గ్రామ శివార్లలోకి గండికోట జలాలు రావడంతో వీరికీ పరిహారం ఇచ్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. -
‘కొసరు’ పూర్తిలోనూ.. కొండంత నిర్లక్ష్యం
కర్నూలు, కోవెలకుంట్ల/పాణ్యం: రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అవుకు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు, వరదకాలువ, గాలేరు–నగరి పనులు చేపట్టారు. ఆయన హయాంలోనే ఈ పనులు 80 శాతం పూర్తయ్యాయి. వైఎస్సార్ మరణం తర్వాత మిగిలిన పనులను రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు కూడా పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపలేదు. నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇంకా పనులుమిగిలి ఉన్నాయి. అదనంగా నిధులు కేటాయించినప్పటికీ పూర్తి కాలేదు. అవుకు వద్ద రెండు సొరంగాలు పూర్తి చేయాల్సి ఉండగా.. అతికష్టం మీద ఒకటి మాత్రమే పూర్తి చేశారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా అవుకు టన్నెల్, గోరుకల్లు రిజర్వాయర్లను జాతికి అంకితం చేయనున్నారు. పనులు మిగిలివుండగానే ఆయన ప్రారంభోత్సవానికి వస్తుండడం పట్ల రైతులు, ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఇది ప్రచార ఆర్భాటమేనని విమర్శిస్తున్నారు. అప్పుడు చకచకా..ఇప్పుడు నత్తనడక 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. రాయలసీమ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో జలయజ్ఞంలో భాగంగా పలు పనులు చేపట్టారు. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌ను రూ.70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ 2005 నవంబర్‌లో పనులకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అలాగే గాలేరు– నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) కాలువ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాలను తరలించి చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20లక్షల మందికి తాగునీరు అందించేందుకు రూ.790 కోట్లు కేటాయించారు. 29 ప్యాకేజీ కింద వరద కాలవ, 47వ ప్యాకేజీ కింద జీఎన్ఎస్ఎస్ కాలువ నిర్మాణం, శ్రీశైలం జలాశయం నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ.401 కోట్లతో 12 కిలోమీటర్ల మేర రెండు సొరంగమార్గాలను నిర్మించాల్సి ఉంది. ఒక్కో సొరంగంలో పదివేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు వీలుగా నిర్మాణం చేపట్టాలి. వీటి ద్వారా శ్రీశైలం నుంచి 20వేల క్యూసెక్కుల వరద జలాలను అవుకు రిజర్వాయర్‌లో నింపాల్సి ఉంటుంది. ఈ మొత్తం పనుల్లో దాదాపు 80 శాతం వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయి. ఆయన మరణం తర్వాత మిగిలిన పనులను తర్వాతి ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. వాస్తవానికి 2010 నాటికే ఒక సొరంగం పూర్తి చేసి వైఎస్ఆర్ జిల్లా గండికోటకు నీటిని విడుదల చేయాల్సి ఉండేది. అయితే.. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు జలయజ్ఞం పనులను నిర్లక్ష్యం చేయడంతో పాటు తర్వాత వచ్చిన టీడీపీ సర్కారు కూడా కాలయాపన చేసిందన్న విమర్శలున్నాయి. ఫాల్ట్‌జోన్ (మట్టి ఊడిపడడం) ఉన్న కారణంగా ఒక సొరంగంలో బైపాస్ టన్నెల్ ఏర్పాటు చేసి దీని గుండా పదివేల క్యూసెక్కుల నీటి విడుదలకు డిజైన్ చేశారు. మరో సొరంగం ఆడిట్ నుంచి ఎగ్జిట్ వరకు పూర్తి కాగా.. ఫాల్ట్‌జోన్ పేరుతో ఎంట్రీ నుంచి ఆడిట్ వరకు పెండింగ్‌లో ఉంది. ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. ఎక్కడి పనులు అక్కడే గాలేరు–నగరి కాలువ పనులు కూడా కొలిక్కి రాలేదు. పాణ్యం మండం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కాలువకు పలు అడ్డంకులు ఉన్నాయి. అయినా సీఎం మెప్పు కోసం ఓ ఉన్నతాధికారి నీటి తరలింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాలువ విస్తీరణం కూడా కుదించారు. కాలువకు ఔటర్ రెగ్యులేటర్, డ్రాప్కం రెగ్యులేటర్, యూటీ (అండర్‌టన్నెల్), రైల్వేలైన్ వద్ద బ్రిడ్జి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎత్తుపల్లాలు అధికంగా ఉన్నాయి. పైగా గాలేరు–నగరి కాలువను గత ఏడాది నవంబర్ 6వ తేదీ కలెక్టర్ సత్యనారాయణ, సీఈ నారాయణరెడ్డి ప్రారంభించారు. అదే రోజు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ప్రారంభించిన అనంతరం ఈ కాలువ ద్వారా గండికోటకు 20 టీఎంసీల నీటిని పంపించారు. మళ్లీ శనివారం ఇదే కాలువను సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనుండడం గమనార్హం. గోరుకల్లు నుంచి వెళ్లని నీరు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి గాలేరు– నగరి కాలువ ద్వారా నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించి.. అక్కడి నుంచి గేట్లు ఎత్తి గండికోటకు పంపాల్సి ఉంది. అయితే.. ఎస్సార్బీసీ కాలువ ద్వారా అవుకుకు నీటిని తెచ్చి అక్కడి నుంచి గండికోటకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. గాలేరు–నగరి పనులు పూర్తి కాకపోవడం, అనుకున్న సమయానికి గోరుకల్లుకు నీరు వచ్చి చేరకపోవడంతో ఇలా చేస్తున్నారు. సీఎం వద్ద గొప్పలు చెప్పుకునేందుకు ఓ అ«ధికారి అవుకు రిజర్వాయర్‌లో ఉన్న మూడు టీఎంసీల నీటినే తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఈ మూడు టీఎంసీలు వారం పది రోజుల్లో ఖాళీ అవుతాయి. తరువాత పరిస్థితి ఏమిటో అధికారులే చెప్పాలి. -
రిజర్వాయర్‌లో దూకి ఐదుగురి మృతి
-
రిజర్వాయర్‌లో దూకి ఐదుగురి మృతి
అవుకు రిజర్వాయర్‌లో దూకిన కుటుంబం ఐదుగురి మృతి.. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు ఆర్థిక ఇబ్బందులే కారణం... కోవెలకుంట్ల: అప్పులభారాన్ని తట్టుకోలేని ఓ కుటుంబం కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్‌లో దూకిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఐదుగురు మరణించగా.. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన సముద్రాల రామయ్యకు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ కుమారులు. వీరిద్దరూ కోవెలకుంట్ల బస్టాండ్ ఎదుట కిరాణాషాపుతోపాటు శనగల వ్యాపారం చేస్తున్నారు. రామయ్య కుమారులు, కోడళ్లు, మనమలతో కలసి మంగళవారం సాయంత్రం అవుకు మండలం ఉప్పలపాడుకు వెళ్లే రహదారిలో ఉన్న స్పిల్‌వే గేట్ల వద్ద రిజర్వాయర్‌లో దూకారు. ఈ ఘటనలో సముద్రాల వెంకటేశ్వర్లు(45), ఆయన భార్య రుక్మిణిదేవి(38), వీరి కుమారుడు భ విస్(7), కుమార్తె సాహితీ(3)తోపాటు సముద్రాల లక్ష్మీనారాయణ కుమారుడు మణిదీప్ చనిపోయారు. సముద్రాల రామయ్య, ఆయన చిన్న కుమారుడు లక్ష్మీనారాయణ, అతని భార్య భారతి ప్రాణాలతో బయటపడ్డారు. వీరు ముగ్గురూ రిజర్వాయర్‌లో ఒడ్డును పట్టుకుని ఉండటంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి రక్షించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అందరూ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై అవుకు ఎస్ఐ వెంకట్రామిరెడ్డి విచారణ జరుపుతున్నారు. -
గాలేరు గతి ఇంతేనా?
కర్నూలు రూరల్: శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తరలించాలనే లక్ష్యంతో గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద సీమ జిల్లాల్లో 2.6 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 38 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవచ్చు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాల్సి ఉంది. మొదటి దశ కింద ఎస్సార్బీసీ ప్రధాన కాలువ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ (12.44 టీఎంసీలు) కు నీటిని తీసుకెళ్లాలి. అక్కడి నుంచి 57.70 కి.మీ వరద కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్ (4.31 టీఎంసీ) ను నింపాలి. మళ్లీ ఇక్కడి నుంచి 58.125 కి.మీ దూరంలో ఉన్న మరో వరద కాలువ ద్వారా పెన్నా నదిపై కడుతున్న గండికోట రిజర్వాయర్‌కు నీటిని తరలించాలి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ గండికోట రిజర్వాయర్ నుంచి మొదలవుతుంది. ఇవీ సమస్యలు.. అటవీ భూముల క్లియరెన్స్ తీసుకోకపోవడంతో ప్రాజెక్టు పనులకు ఆదిలో అడ్డంకులు ఏర్పడ్డాయి. విడతల వారీగా ప్రతిపాదనలు పంపగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 254 ఎకరాలకు అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం భూ సేకరణపై నూతన సంస్కరణలు తీసుకొస్తామని చెబుతోంది. కేంద్రం ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. {పభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టును రద్దుచేయాలని, కొత్త ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని పెంచాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ ప్ర‘గతి’ ఎస్ఆర్బీసీ కాలువ పరిధిలో గోరకల్లు జలాశయం నిర్మాణానికి రూ.448.20 కోట్లు కేటాయించారు. దీని కోసం ఇప్పటివరకు రూ. 411 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులు 2008లో పూర్తి కావాల్సి ఉంది. అయితే 314 ఎకరాల అటవీ భూములకు అనుమతులు రావలసి ఉంది. ఎస్ఆర్బీసీ కాలువ పరిధిలోని అవుకు జలాశయం సొరంగం పనులకు ప్యాకేజీ నంబర్ 30 కింద 401.12 కోట్లు కేటాయించారు. ఈ సొరంగం పనుల్లో నాణ్యతకు తిలోదకాలివ్వటంతో లోపలిభాగంలో సొరంగం పెచ్చులూడుతోంది. అవుకు సొరంగం పనులు పూర్తి కావటానికి ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉన్నా ఇప్పటివరకు అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పాటు అంచనా వ్యయం పెంచాలంటూ కాంట్రాక్టర్ పనులు సక్రమంగా చేయడం లేదు. 36వ ప్యాకేజీ పనుల కోసం రూ. 38.73 కోట్లు కేటాయించారు. ఈ ప్యాకేజీ కింద 13499 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక్కడ 70 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. ఈ పనులకు ఈ నెల చివరితో గడువు ముగుస్తుంది. వివిధ రకాల కారణాలు చూపుతూ కాంట్రాక్టర్ కాంట్రాక్టు క్లోజ్ చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. 37వ ప్యాకేజీలో రూ.48.40 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.27.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక్కడ కూడా 63.67 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంపై ఎలాంటి స్పందన లేకపోవడంతో 2010లోనే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. చివరికి కాంట్రాక్టును రద్దు చేయాలని సదరు కాంట్రాక్టర్ ప్రభుత్వానికి తెలియజేశారు. 38వ ప్యాకేజీలో 7600 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు రూ.48.36 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.15.64 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 93.92 ఎకరాల భూసేకరణ చేయాల్సిన ఉన్నా రెవెన్యూ అధికారులు, అటు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పనులు రద్దు చేయాలంటూ 2010లోనే దరఖాస్తు చేసుకోవడంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటివరకు ఆ పనులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు.