అవుకు సొరంగం వద్ద అసంపూర్తిగా పనులు
కర్నూలు, కోవెలకుంట్ల/పాణ్యం: రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అవుకు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు, వరదకాలువ, గాలేరు–నగరి పనులు చేపట్టారు. ఆయన హయాంలోనే ఈ పనులు 80 శాతం పూర్తయ్యాయి. వైఎస్సార్ మరణం తర్వాత మిగిలిన పనులను రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు కూడా పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపలేదు. నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇంకా పనులుమిగిలి ఉన్నాయి. అదనంగా నిధులు కేటాయించినప్పటికీ పూర్తి కాలేదు. అవుకు వద్ద రెండు సొరంగాలు పూర్తి చేయాల్సి ఉండగా.. అతికష్టం మీద ఒకటి మాత్రమే పూర్తి చేశారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా అవుకు టన్నెల్, గోరుకల్లు రిజర్వాయర్లను జాతికి అంకితం చేయనున్నారు. పనులు మిగిలివుండగానే ఆయన ప్రారంభోత్సవానికి వస్తుండడం పట్ల రైతులు, ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఇది ప్రచార ఆర్భాటమేనని విమర్శిస్తున్నారు.
అప్పుడు చకచకా..ఇప్పుడు నత్తనడక
2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. రాయలసీమ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో జలయజ్ఞంలో భాగంగా పలు పనులు చేపట్టారు. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌ను రూ.70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ 2005 నవంబర్‌లో పనులకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అలాగే గాలేరు– నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) కాలువ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాలను తరలించి చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20లక్షల మందికి తాగునీరు అందించేందుకు రూ.790 కోట్లు కేటాయించారు. 29 ప్యాకేజీ కింద వరద కాలవ, 47వ ప్యాకేజీ కింద జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ నిర్మాణం, శ్రీశైలం జలాశయం నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ.401 కోట్లతో 12 కిలోమీటర్ల మేర రెండు సొరంగమార్గాలను నిర్మించాల్సి ఉంది. ఒక్కో సొరంగంలో పదివేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు వీలుగా నిర్మాణం చేపట్టాలి. వీటి ద్వారా శ్రీశైలం నుంచి 20వేల క్యూసెక్కుల వరద జలాలను అవుకు రిజర్వాయర్‌లో నింపాల్సి ఉంటుంది. ఈ మొత్తం పనుల్లో దాదాపు 80 శాతం వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయి. ఆయన మరణం తర్వాత మిగిలిన పనులను తర్వాతి ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. వాస్తవానికి 2010 నాటికే ఒక సొరంగం పూర్తి చేసి వైఎస్‌ఆర్ జిల్లా గండికోటకు నీటిని విడుదల చేయాల్సి ఉండేది. అయితే.. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు జలయజ్ఞం పనులను నిర్లక్ష్యం చేయడంతో పాటు తర్వాత వచ్చిన టీడీపీ సర్కారు కూడా కాలయాపన చేసిందన్న విమర్శలున్నాయి. ఫాల్ట్‌జోన్ (మట్టి ఊడిపడడం) ఉన్న కారణంగా ఒక సొరంగంలో బైపాస్ టన్నెల్ ఏర్పాటు చేసి దీని గుండా పదివేల క్యూసెక్కుల నీటి విడుదలకు డిజైన్ చేశారు. మరో సొరంగం ఆడిట్ నుంచి ఎగ్జిట్ వరకు పూర్తి కాగా.. ఫాల్ట్‌జోన్ పేరుతో ఎంట్రీ నుంచి ఆడిట్ వరకు పెండింగ్‌లో ఉంది. ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కన్పించడం లేదు.
ఎక్కడి పనులు అక్కడే
గాలేరు–నగరి కాలువ పనులు కూడా కొలిక్కి రాలేదు. పాణ్యం మండం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కాలువకు పలు అడ్డంకులు ఉన్నాయి. అయినా సీఎం మెప్పు కోసం ఓ ఉన్నతాధికారి నీటి తరలింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాలువ విస్తీరణం కూడా కుదించారు. కాలువకు ఔటర్ రెగ్యులేటర్, డ్రాప్‌కం రెగ్యులేటర్, యూటీ (అండర్‌టన్నెల్), రైల్వేలైన్ వద్ద బ్రిడ్జి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎత్తుపల్లాలు అధికంగా ఉన్నాయి. పైగా గాలేరు–నగరి కాలువను గత ఏడాది నవంబర్ 6వ తేదీ కలెక్టర్ సత్యనారాయణ, సీఈ నారాయణరెడ్డి ప్రారంభించారు. అదే రోజు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ప్రారంభించిన అనంతరం ఈ కాలువ ద్వారా గండికోటకు 20 టీఎంసీల నీటిని పంపించారు. మళ్లీ శనివారం ఇదే కాలువను సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనుండడం గమనార్హం.
గోరుకల్లు నుంచి వెళ్లని నీరు
గోరుకల్లు రిజర్వాయర్ నుంచి గాలేరు– నగరి కాలువ ద్వారా నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించి.. అక్కడి నుంచి గేట్లు ఎత్తి గండికోటకు పంపాల్సి ఉంది. అయితే.. ఎస్సార్బీసీ కాలువ ద్వారా అవుకుకు నీటిని తెచ్చి అక్కడి నుంచి గండికోటకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. గాలేరు–నగరి పనులు పూర్తి కాకపోవడం, అనుకున్న సమయానికి గోరుకల్లుకు నీరు వచ్చి చేరకపోవడంతో ఇలా చేస్తున్నారు. సీఎం వద్ద గొప్పలు చెప్పుకునేందుకు ఓ అ«ధికారి అవుకు రిజర్వాయర్‌లో ఉన్న మూడు టీఎంసీల నీటినే తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఈ మూడు టీఎంసీలు వారం పది రోజుల్లో ఖాళీ అవుతాయి. తరువాత పరిస్థితి ఏమిటో అధికారులే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment