![Ap Nandyal Avuku Reservoir Boat Accident - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/15/knl.jpg.webp?itok=rmB9wTrI)
అవుకు/నంద్యాల: నంద్యాల జిల్లా అవుకు గ్రామంలోని జలాశయంలో ఆదివారం బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి సహా ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో యువతిగల్లంతైంది. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు చిన్నారులకు ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోవెలకుంట్లకు చెందిన హసియా (23), నూర్జహాన్ (37) మృతి చెందగా.. సాజిదా (20) గల్లంతైంది. ప్రమాదం నుంచి బయటపడిన చశ్విక్ (3), హనీ (1) అనే చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో హనీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన డి.రసూల్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో తన సమీప బంధువు ఇంటిలో జరిగిన వివాహ వేడుకకు రసూల్, అతని భార్య మహేశ్వరి, కుమార్తెలు సైదా, సాజిదా (20), రసూల్ అన్న దస్తగిరి, అతని భార్య కాశీంబి, కూతుళ్లు హసీనాభాను, హసియా (23), మనవడు చశ్విక్ , మనవరాలు హనీ, తమ్ముడి కుటుంబం మహబూబ్ బాషా, అతడి భార్య హుసేబీ, మరో తమ్ముడి కుటుంబం బషీర్ బాషా, అతని భార్య నూర్జహాన్(37) హాజరయ్యారు.
బోటులో జలవిహారానికి వెళ్లగా..
అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వీరంతా ఆదివారం ఉదయం జలాశయం వద్దకు చేరుకున్నారు. ఇద్దరు చిన్నారులు సహా 14 మంది కలిసి బోటులో జల విహారానికి బయల్దేరారు. రిజర్వాయర్ మధ్యకు వెళ్లగానే బోటులోకి నీళ్లు రావటం చూసి బోట్‌ను నడుపుతున్న వ్యక్తి వెంటనే నీళ్లలోకి దూకేశాడు. బోటు తిరగబడటంతో అందులోని వారంతా ఒక్కసారిగా నీటిలోకి పడిపోయారు.
స్థానికుల సాయంతో నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీయగా.. బోటుకింద చిక్కుకున్న హసియా (23) అప్పటికే మృతి చెందింది. మరో మహిళ నూర్జహాన్ (37), చిన్నారులు చశ్విక్, హనీ పరిస్థితి విషమంగా ఉండటంతో బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూర్జహాన్ మృతి చెందింది. ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో వెంకటరెడ్డి, ఆరోగ్య శాఖ, టూరిజం, అగ్నిమాపక శాఖల అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాగా, ప్రమాదానికి గురైన బోటు పర్యాటక శాఖది కాదని జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోటు నిర్వాహకులు లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.
చదవండి: ‘నా చావుకు నేనే కారణం...’
Comments
Please login to add a commentAdd a comment