అవుకు రిజర్వాయర్‌లో దూకిన కుటుంబం
ఐదుగురి మృతి.. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు
ఆర్థిక ఇబ్బందులే కారణం...
కోవెలకుంట్ల: అప్పులభారాన్ని తట్టుకోలేని ఓ కుటుంబం కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్‌లో దూకిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఐదుగురు మరణించగా.. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన సముద్రాల రామయ్యకు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ కుమారులు. వీరిద్దరూ కోవెలకుంట్ల బస్టాండ్ ఎదుట కిరాణాషాపుతోపాటు శనగల వ్యాపారం చేస్తున్నారు. రామయ్య కుమారులు, కోడళ్లు, మనమలతో కలసి మంగళవారం సాయంత్రం అవుకు మండలం ఉప్పలపాడుకు వెళ్లే రహదారిలో ఉన్న స్పిల్‌వే గేట్ల వద్ద రిజర్వాయర్‌లో దూకారు.
ఈ ఘటనలో సముద్రాల వెంకటేశ్వర్లు(45), ఆయన భార్య రుక్మిణిదేవి(38), వీరి కుమారుడు భ విస్(7), కుమార్తె సాహితీ(3)తోపాటు సముద్రాల లక్ష్మీనారాయణ కుమారుడు మణిదీప్ చనిపోయారు. సముద్రాల రామయ్య, ఆయన చిన్న కుమారుడు లక్ష్మీనారాయణ, అతని భార్య భారతి ప్రాణాలతో బయటపడ్డారు. వీరు ముగ్గురూ రిజర్వాయర్‌లో ఒడ్డును పట్టుకుని ఉండటంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి రక్షించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అందరూ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై అవుకు ఎస్‌ఐ వెంకట్రామిరెడ్డి విచారణ జరుపుతున్నారు.