సాక్షి ప్రతినిధి కడప: గండికోట ప్రాజెక్టు వరుసగా రెండో ఏడాదీ నిండుకుండలా మారనుంది. గతేడాదిలాగే ఈ ఏడాదీ ప్రాజెక్టులో 26.85 టీఎంసీల పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 23.390 టీఎంసీల నీరుంది. శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్ నుంచి గండికోటకు అధికారులు నీటిని విడుదల చేశారు. శనివారం ఉదయానికి నాలుగు వేల క్యూసెక్కులు చేరాయి. ముందుగా 3,000 క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు.. ఆదివారం నుంచి 5,000 క్యూసెక్కులకు పెంచనున్నారు. వారం, పది రోజుల్లోపే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టాలన్నది లక్ష్యం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీటిని నిల్వ పెట్టగా, రెండో ఏడాది పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు నిల్వపెట్టింది. ఇప్పుడు మూడో ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నింపేందుకు సిద్ధమైంది.
2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు
ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరుంటే దాని పరిధిలోని పైడిపాలెం, చిత్రావతి, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం జలాశయాలను నింపేందుకు వీలుంటుంది. 6.500 టీఎంసీల సామర్థ్యం గల మైలవరంలో ప్రస్తుతం 1.910 టీఎంసీల నీరుంది. 1.658 టీఎంసీల సామర్థ్యం గల వామికొండలో 1.377 టీంఎసీలు, 3.060 టీంఎంసీల సామర్థ్యం గల సర్వరాయసాగర్‌లో 0.638 టీఎంసీలు, 10.29 టీఎంసీల సామర్థ్యం గల చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 8.807 టీఎంసీలు, 6 టీఎంసీల సామర్థ్యం కలిగిన పైడిపాలెంలో 5.622 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వీటిని పూర్తి స్థాయిలో నింపితే వీటి పరిధిలోని రెండు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది.
80 శాతానికిపైగా పునరావాస పనులు పూర్తి
ఎర్రగుడి, చామలూరు, తాళ్ల ప్రొద్దుటూరు తదితర ముంపు గ్రామాల పునరావాస పనులు వేగంగా జరిగాయి. కోవిడ్ తీవ్రత కారణంగా ఇటీవల కాలంలో పనుల వేగం తగ్గింది. అయినా 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. మొత్తం రూ.82 కోట్లతో ఈ పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.24.50 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం కాంట్రాక్టర్లు రూ.32 కోట్ల మేర బిల్లులు పెట్టారు. అధికారుల వద్ద రూ.24 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. సీఎఫ్‌ఎంఎస్(కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం) సాంకేతిక సమస్యతో నగదు విడుదల తాత్కాలికంగా నిలిచింది. ఈ మొత్తం పనులకు సంబంధించి ఇంకా రూ.52 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది.
బాబు హయాంలో అరకొర నిధులు, నీళ్లకు కరువు
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం గండికోటకు సంబంధించి రూ.578 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. 2013లో మూడు టీఎంసీల నీటిని మాత్రమే ప్రాజెక్టులో నిల్వ పెట్టింది. 2014–15లో చుక్క నీరు రాలేదు. 2016లో 5, 2017లో 8, 2018లో 12 టీఎంసీల నీటిని నిల్వ పెట్టారు.
లక్షలాది ఎకరాలకు నీరందించాం
గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం గతేడాది గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ పెట్టింది. దాని పరి«ధిలోని అన్ని సాగునీటి వనరులనూ నీటితో నింపి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాం. మళ్లీ తాజాగా జలాశయానికి కృష్ణా నీటిని విడుదల చేశాం.
– మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈ, జీఎన్‌ఎస్‌ఎస్
వైఎస్సార్ హయాంలోనే నిర్మాణం
గండికోట ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్సార్ 22.10.2004న శంకుస్థాపన చేశారు. తొలుత 11 టీఎంసీల సామర్థ్యంతోనే రూ.250 కోట్లతో నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత 26.85 టీఎంసీలకు సామర్థ్యాన్ని పెంచి రూ.375 కోట్లతో నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఆ తర్వాత వైఎస్ అకాల మరణంతో పునరావాసంతో పాటు పరిహార పంపిణీ నిలిచిపోయింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఫేజ్–2 కింద కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి పరిధిలోని 7,047 పీడీఎఫ్(పర్సన్ డిస్పేస్డ్ ఫ్యామిలీస్.. నిర్వాసిత కుటుంబాలు)కు సంబంధించి రూ.668.79 కోట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు హయాంలో అరకొరగా డబ్బులిచ్చిన బాధితులకు సైతం పూర్తి స్థాయిలో పరిహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది.
క్యాష్ బెనిఫిట్ కోరిన వారికి పూర్తి స్థాయిలో డబ్బులిచ్చి పంపగా, మిగిలిన వారికి పునరావాసం సైతం కల్పించింది. ఫేజ్–3 కింద ఏటూరు, రేగడిపల్లె, కె.సుగుమంచిపల్లె, పి.అనంతపురం పరిధిలో 1666 పీడీఎఫ్‌లకు సంబంధించి రూ.157 కోట్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈ పీడీఎఫ్‌లకు సంబంధించి చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడటంతో ఓనర్‌షిప్‌పై స్పష్టత లేదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నడుస్తోంది. విచారణ పూర్తవగానే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా పైగ్రామాల ప్రజలు గండికోట పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి 100 మీటర్ల దూరంలో ఉన్నారు. గ్రామ శివార్లలోకి గండికోట జలాలు రావడంతో
వీరికీ పరిహారం ఇచ్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment