నాటి నుంచి రాయలసీమ ప్రాజెక్టుల పట్ల చంద్రబాబుకు అంతులేని నిర్లక్ష్యం
జీఎన్‌ఎస్‌ఎస్‌కు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్సార్– వైఎస్ జగన్ ప్రభుత్వాలే
2014–19లో చంద్రబాబు సర్కార్ నామమాత్రపు వెచ్చింపు
గండికోటకు రెండు సార్లు శిలాఫలకాలు వేసిన ఘనత బాబుదే
వైఎస్ జగన్ హయాంలో 27 టీఎంసీల నీటితో కళకళలాడిన గండికోట
‘వినేవారు లోకువైతే చెప్పేవారు చంద్రబాబు’ అనే నానుడి ఉంది. విపక్షంలో ఓ మాట..అధికారంలో మరోమాట మాట్లాడడం ఆయనకే చెల్లు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను చెప్పుకోవచ్చు. అధికారంలో ఉంటే విస్మరించడం.. లేకపోతే ప్రాజెక్టుల సందర్శనంటూ హంగామా చేయడం జిల్లా వాసులకు ఎరుకే.
గండికోట ప్రాజెక్టు నిర్మాణానికి 1996, 1999 ఎన్నికలకు ముందు రెండుసార్లు శంకుస్థాపన చేయడం మినహా, ఆ ప్రాజెక్టు నిర్మాణం పట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యమే ప్రదర్శించింది. రాయలసీమలో తమకు ఓట్లు, సీట్లు ఇవ్వరని, అందుకే అభివృద్ధి చేయలేదని ప్రకటించడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, కడప: నిర్దిష్ట అభివృద్ధి సాధించే అవకాశం ఉన్నా సాగునీటి ప్రాజెక్టు పట్ల ఇదివరకు టీడీపీ సర్కార్ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ మారైనా చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టుల ప్రయోజనాలు కాంక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995–2004, విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014–19లో నారా చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులంటే మండిపడేవారు. నిన్నమొన్నటి వరకు 25 టీఎంసీల నిల్వకు కారణమైన గండికోట ప్రాజెక్టును ఉమ్మడి ఏపీలో నాన్ ప్రియారిటీ జాబితాలోకి చేర్చిన చరిత్రను కూడా చంద్రబాబునాయుడు మూట గట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీరు చేరాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ఒక్కటే మార్గమని తలచారు.
అలా చేస్తేనే కాస్తో, కూస్తో రాయలసీమ ప్రాంతానికి నీరు చేరుతుందని మనస్ఫూర్తిగా నమ్మారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ సర్కార్ పెంచుతుంటే, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరావు ద్వారా అడ్డుకునే ప్రయత్నం కూడా చేపట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఈ ప్రాంత ఉన్నతికి కృషి చేస్తారంటే ఐదేళ్ల కాలం ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టారని పలువురు గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబు శంకుస్థాపనతో సరి...
గండికోట ప్రాజెక్టుకు 1996 ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శెట్టివారిపల్లె సమీపంలో శంకుస్థాపన చేశారు. వామికొండ వద్ద మరోమారు 1999 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ ప్రాజెక్టు పట్ల ఏమాత్రం శ్రద్ధాసక్తులు చూపలేదు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3213 కోట్లు వెచ్చిస్తే, తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేవలం రూ.804 కోట్లు మాత్రమే వెచ్చించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) పరిధిలో రూ.4256 కోట్లు వ్యయం చేశారు. మరో రూ.454 కోట్లు నిర్వాసితులకు చెల్లించారు. పైగా 26.85 టీఎంసీల నీరు నిల్వ చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌కే దక్కిందని పలువురు వివరిస్తున్నారు.
కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళిక
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాయలసీమ కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. జీఎన్‌ఎస్‌ఎస్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అనుసంధానం ప్రక్రియను ప్రారంభించి వేగవంతంగా పనులు చేపట్టుతోంది. 12టీఎంసీ నీరు జీఎన్‌ఎస్‌ఎస్ ద్వారా లిఫ్ట్ చేసి చిత్తూరు అన్నయమ్య జిల్లాల్లో కరువు నివారణకు శ్రీకారం చుట్టింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలో జంగందేవరపల్లె వద్ద నీరు కలపడం ద్వారా పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, రాయచోటి నియోజకవర్గాలను సస్యశామలం చేసేందుకు అనువుగా మారింది.
ఇలాంటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌పై ఉంది. మరోవైపు జలాశయాలు ఉన్నా, వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో దక్కలేదు. డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. సీఎం చంద్రబాబు కోరినట్లుగా జిల్లాలో సీట్లు, ఓట్లు కూడా లభించాయి. ఈమారైనా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment