అడవి.. ఆగమాగం! | The Extent Of Forest In Telangana Is Decreasing | Sakshi
Sakshi News home page

అడవి.. ఆగమాగం!

Published Sun, Nov 3 2019 4:21 AM | Last Updated on Sun, Nov 3 2019 8:05 AM

The Extent Of Forest In Telangana Is Decreasing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యంత వేగంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు ఉటంకిస్తున్నా క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం సగం కంటే తక్కువగానే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో సాగుతున్న అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే పరిస్థితి నెలకొంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం హరితహారం కార్యక్రమం చేపడుతున్నా అడవుల ఆక్రమణల వల్ల ఆ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను అడ్డం పెట్టుకొని వారి బినామీలుగా ఆదివాసీ, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది. ఎస్టీలు, ఇతర బలహీనవర్గాల పేరుతో స్థానికంగా బలమైన సామాజికవర్గాలు, రాజకీయ అండదండలున్న వారి పెత్తనం పెరిగిపోయింది.  కింది స్థాయిలో అటవీ, రెవెన్యూశాఖలలో అవినీతి కూడా ఆక్రమణదారులకు కలసి వస్తోంది.

‘పోడు’ మారిపోయింది...
కొన్ని దశాబ్దాలుగా ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా కొనసాగుతోంది. చెట్లు లేని చోట వారు సాగు చేసుకొని ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటకు తరలిపోవడం వంటిది జరిగేది. పారలు, ఎడ్లు లేకుండా వారు వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. 1907లో ఆదివాసీలు అడవుల్లో ఈ విధమైన పోడు వ్యవసాయం చేసుకునేందుకు నిజాం నవాబు అనుమతించాడు.

1947 తర్వాత గిరిజనేతరులు అడవులపై పడటంతో పోడు అటవీ భూముల ఆక్రమణ మొదలైంది. ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కు కల్పించినా దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్రప్రభుత్వం అటవీహక్కుల చట్టం తీసుకురావడంతో ఈ భూములను సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు అందజేయాల్సి ఉంది.

అడవి మిగిలింది 13 శాతమే....
రాష్ట్రంలో 26.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి ఉంది. అందులో 2.94 లక్షల (11%) హెక్టార్లు అన్యాక్రాంతమైనట్టు అటవీశాఖ రికార్డుల్లో స్పష్టమైంది. వాస్తవానికి ఈ ఆక్రమణలు మరో 3% వరకు ఉంటాయని, ఇప్పుడు మనకు మిగిలింది 10–13% అడవులేన ని అటవీ అధికారులు చెబుతున్నారు.

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద...
అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌–ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) కింద 2017 చివరి నాటికి మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్‌ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు), సామూహికంగా 3,427 క్లెయిమ్స్‌ (4,70,605 ఎకరాలకు) క్లెయిమ్స్‌ రూపంలో దరఖాస్తులు అందాయి.

‘వ్యక్తిగత’లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. సామూహికంగా 721 క్లెయిమ్స్‌కు 4,54,055 ఎకరాల మేర హక్కు పత్రాలు అందజేశారు. మొత్తం 80,890 ‘వ్యక్తిగత’కు సంబంధించిన కేసులను 2,90,589 ఎకరాలకు, ‘సామూహిక’లో 11,988 ఎకరాలకు సంబంధించి 1,682 కేసులను తిరస్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement