పా‘పాల’ ధూళిపాళ్ల..‘అవినీతి అనకొండ’ | TDP leader Dhulipalla Narendra corruption in Andhra pradesh | Sakshi
Sakshi News home page

పా‘పాల’ ధూళిపాళ్ల..‘అవినీతి అనకొండ’

Published Tue, Apr 16 2024 1:55 AM | Last Updated on Tue, Apr 16 2024 1:59 AM

TDP leader Dhulipalla Narendra corruption in Andhra pradesh - Sakshi

దౌర్జన్యాలకు కేరాఫ్‌.. ధూళిపాళ్ల నరేంద్ర 

గ్రావెల్, ఇసుక తవ్వకాలతో అడ్డగోలుగా దోపిడీ  

సంగం డెయిరీనీ సొంత ఆస్తిగా మార్చేసిన నేత 

దాని ప్రాంగణంలో తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణం 

దేవదాయ భూముల్నీ వదల్లేదు 

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంలో దిట్ట  

సుద్దపల్లి చెరువును క్వారీగా మార్చేందుకు యత్నం 

తిరగబడిన స్థానికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 

ఆయన కబ్జాలకు గజగజలాడిన పొన్నూరు నియోజకవర్గం   

ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్‌ దేన్నీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. 

సాక్షి ప్రతినిధి, గుంటూరు:
నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్‌ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500 కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్‌ కోసం అనుమతులు తీసుకుంటే ఆయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటా దక్కించుకున్నారు.

తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్నీ కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్నీ కబళించారు.  గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్‌ వర్క్‌ పనులకు గ్రావెల్‌ తరలించే కాంట్రాక్టు దక్కించుకుని చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్‌ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు.  

సంగం ఆస్తులు స్వాహా.. 
► పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మించారు.  

► చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలో కొనసాగింది. తరువాత 1995లో  చంద్రబాబు హయాంలో మ్యాక్స్‌ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిïÙలో ఉండేది.  

► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. 

విలువైన భూములూ హాంఫట్‌... 
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజి్రస్టేషన్‌ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే ఏం చేయాలో పాలుపోక ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.   

కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట
పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. ఆ సమయంలో నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండప నిర్మాణానికి వారి ఎంపీ నిధులు కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా నిర్మించిన ఏ నిర్మాణాలైనా పంచాయతీ, మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉండాలి. కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి చైర్మన్‌గా వ్యవహరిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు.  

ఏసీబీ కేసులో అరెస్ట్‌
► సంగం డెయిరీలో జరిగిన అవకతవకలపై క్రైం నెంబర్‌– 02/ ఖఇౖ– ఎNఖీ– అఇఆ/2021తో  408, 409, 418, 420, 465, 471, 120–బి రెడ్‌విత్‌ 34 ఐపీసీ,  సెక్షన్‌ 13 (1) ( ఛి)( ఛీ) ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ ప్రకారం ఏసీబీ కేసు నమోదు చేసింది. పొన్నూరు నియోజకవర్గ చింతలపూడి గ్రామంలో ఆయన స్వగృహంలో ఉండగా ఏసీబీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేసింది.                   
► సంగం డెయిరీలో పాలవిక్రయాలపై 14% బోనస్‌ చెల్లించాలని కోరిన పాడి రైతులపై దాడి చేసినందుకు చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌లో 15–11–2023న ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 286/2023తో ధూళిపాళ్లపై 143,147,148, 427,324,384,506,109,307 ట/ఠీ149 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. దీనిలో ఆయన 14వ ముద్దాయిగా ఉన్నారు.  

► పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈఓ కార్యాలయం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా వచ్చి ఆందోళనలకు దిగారని ఈవో ధూళిపాళ్ల నరేంద్రపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.              
► కర్ఫ్యూ, కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి సంగం డెయిరీకి చెందిన 20 మందితో కలిసి హోటల్లో మీటింగ్‌ నిర్వహించినందుకు గుంటూరు ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement