ponnur constituency
-
పా‘పాల’ ధూళిపాళ్ల..‘అవినీతి అనకొండ’
ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్ దేన్నీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500 కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే ఆయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటా దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్నీ కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్నీ కబళించారు. గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ వర్క్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్టు దక్కించుకుని చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. సంగం ఆస్తులు స్వాహా.. ► పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. ► చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలో కొనసాగింది. తరువాత 1995లో చంద్రబాబు హయాంలో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిïÙలో ఉండేది. ► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. విలువైన భూములూ హాంఫట్... అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజి్రస్టేషన్ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే ఏం చేయాలో పాలుపోక ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. ఆ సమయంలో నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండప నిర్మాణానికి వారి ఎంపీ నిధులు కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా నిర్మించిన ఏ నిర్మాణాలైనా పంచాయతీ, మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉండాలి. కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి చైర్మన్‌గా వ్యవహరిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఏసీబీ కేసులో అరెస్ట్ ► సంగం డెయిరీలో జరిగిన అవకతవకలపై క్రైం నెంబర్– 02/ ఖఇౖ– ఎNఖీ– అఇఆ/2021తో 408, 409, 418, 420, 465, 471, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ, సెక్షన్ 13 (1) ( ఛి)( ఛీ) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఏసీబీ కేసు నమోదు చేసింది. పొన్నూరు నియోజకవర్గ చింతలపూడి గ్రామంలో ఆయన స్వగృహంలో ఉండగా ఏసీబీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసింది. ► సంగం డెయిరీలో పాలవిక్రయాలపై 14% బోనస్ చెల్లించాలని కోరిన పాడి రైతులపై దాడి చేసినందుకు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో 15–11–2023న ఎఫ్ఐఆర్ నెంబర్ 286/2023తో ధూళిపాళ్లపై 143,147,148, 427,324,384,506,109,307 ట/ఠీ149 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. దీనిలో ఆయన 14వ ముద్దాయిగా ఉన్నారు. ► పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈఓ కార్యాలయం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా వచ్చి ఆందోళనలకు దిగారని ఈవో ధూళిపాళ్ల నరేంద్రపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ► కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సంగం డెయిరీకి చెందిన 20 మందితో కలిసి హోటల్లో మీటింగ్ నిర్వహించినందుకు గుంటూరు ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!
తెలుగుదేశం పార్టీలో ఎన్ఆర్ఐల హవా ఎక్కువైంది. అమెరికాలో బాగా సంపాదించి ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. నియోజకవర్గం నేతలకు టెన్షన్ పెడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఐదుసార్లు గెలిచిన ఓ నేతను ఎన్ఆర్ఐ వెంటాడుతున్నాడు. గత ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన ఆ నేత ఎప్పటికీ ఆ సీటు తనదే అనుకుంటున్నారు. ఇంతలో ఎన్ఆర్ఐ రంగ ప్రవేశంతో కంగారుపడుతున్నారట. ధూళిపాళ్లకు ఎన్నారై సెగ ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో పొన్నూరు ఓటర్లు ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా పొన్నూరు ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉందో మొన్నటివరకూ అలాగే ఉంది. ధూళిపాళ్ల నరేంద్ర, అతని తమ్ముడు సురేంద్రలు నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల ద్వారా వందల కోట్లు సంపాదించారు. సెకండ్ లెవెల్ క్యాడర్ ను ఎక్కడా ఎదగనివ్వలేదు. దీంతో ధూళిపాళ్లపై నియోజకవర్గంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. కానీ నరేంద్ర మాత్రం పొన్నూరు సీటు తనకు కాదని మరెవరికీ ఇవ్వరనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే పార్టీలోని నరేంద్ర వ్యతిరేకులు ఆయనకు సీటు ఇవ్వొద్దని చంద్రబాబు వద్ద కుండబద్దలు కొట్టారట. తెనాలి దత్త పార్టీకి నరేంద్రకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపధ్యంలోనే ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఉయ్యూరు శ్రీనివాసరావు గుంటూరు వెస్ట్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఉయ్యూరు శ్రీనివాస్ మంచి దోస్తులు. స్నేహాన్ని ఆసరాగా చేసుకుని ఆలపాటి తనకు నష్టం జరగకుండా వ్యూహం పన్నారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఆలపాటి రాజా ఇన్ ఛార్జిగా ఉన్న తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆలపాటి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారట. ఈ ఆలోచనతోనే స్నేహితుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావుకు నువ్వు పొన్నూరులో పోటీ చేస్తే బెటర్ అని కన్విన్స్ చేశారట. ఆలపాటి రాజా ఎన్నారైకి ఈ సలహా ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్ ఉందంటున్నారు. టీడీపీలో కీలక నేతలుగా ఉన్న ధూళిపాళ్ల, ఆలపాటికి మొదటినుంచి ఒకరంటే ఒకరికి గిట్టదు. సంగం డైరి కొట్టెయ్యాలని ఆలపాటి భావిస్తే నరేంద్ర హస్తగతం చేసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది పరిస్థితి. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోంది. చదవండి: (టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం) గుంటూరు తొక్కిసలాట పాపం బాబు ఆలపాటి రాజా తన వ్యూహంలో భాగంగానే ఉయ్యూరు శ్రీనివాసరావును ధూళిపాళ్ల నరేంద్రపైకి వదిలారు. ఆలపాటి సలహాతో శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు చెప్పారట. ధూళిపాళ్ల నరేంద్ర ఖర్చు పెట్టేదానికంటే రెండింతలు ఎక్కువ ఖర్చుపెడతానని, ఈసారి పొన్నూరు సీటు మాత్రం తనకు ఇవ్వాల్సిందేనని ఎన్నారై విభాగం ద్వారా చంద్రబాబుపై వత్తిడి తీసుకొస్తున్నారు. వీరికి ఆలపాటి రాజా కూడా తోడయ్యాడు. అందులో భాగంగానే జనవరి 1న ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుక సభను నిర్వహించారు. ఈ సభకు చంద్రబాబును చీఫ్ గెస్ట్ గా పిలవడం వెనుక కూడా అసలు స్కెచ్ పొన్నూరు సీటేనని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సభ వ్యవహారాలన్నీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి చూసుకున్నారట. ఉయ్యూరు శ్రీనివాసరావు ఆలపాటి రాజా మినహా మరే ఇతర టీడీపీ నేతకు ప్రాధాన్యత ఇవ్వలేదట. పొన్నూరు ఉయ్యూరుకేనా? పొన్నూరు సీటు ఉయ్యూరు శ్రీనివాసరావుకు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండడంతో నరేంద్రకు టెన్షన్ పట్టుకుంది. పొన్నూరు సీటు తనకు కేటాయిస్తే లోకేష్ పాదయాత్రకు భారీస్థాయిలో స్పాన్సర్ చేస్తానని కూడా చంద్రబాబుకు ఉయ్యూరు శ్రీనివాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్. ఇలా ఖర్చు భరిస్తానంటే చంద్రబాబుకు కూడా సంతోషమే కదా? ఎగురుకుంటూ వచ్చిన వారికే పచ్చ పార్టీలో సీటు అనే ప్రచారం మరోచోట కూడా నిజం కాబోతోందని టాక్. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొన్నూరులో ధూళిపాళ్ల దందా
సాక్షి, పొన్నూరు : ధూళిపాళ్ల నరేంద్రను పొన్నూరు ప్రజలు ఐదుసార్లు ఆశీర్వదించారు.. అయినా నియోజకవర్గంపై ఆయనకు కొంచెమైనా ఆపేక్ష ఉండదు.. అభివృద్ధి ఆనవాళ్లు కనిపించకపోయినా అవినీతి ఆగడాలకు కొదవలేదు. సంగం డెయిరీని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు అడ్డూ అదుపూ లేదు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసుల దందాకు అడ్టుకట్ట లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా నీరు–చెట్టు పేరుతో సాగించిన దోపిడీకి అంతే లేదు. ఎమ్మెల్యే అండతో, అధికార అహంకారంతో టీడీపీ నేతల అక్రమార్జనకు ఆనకట్ట లేదు. ప్రతి పనిలో కమీషన్లకు తెగబడిన ఎమ్మెల్యే తీరుపై ప్రశ్నించని గొంతు లేదు. ఐదేళ్ల పాలనలో కోట్ల రూపాయల దండుకున్న ఎమ్మెల్యే అవినీతిపై భగ్గుమనని ఊరూవాడా లేదు. 3.89 ఎకరాలు.. రూ.5కోట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోల్కత్తా – చెన్నై జాతీయ రహదారి సమీపంలోని పెదకాకాని మండలం నంబూరులోని సర్వే నంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని కబ్జా చేశారు. తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మారినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640 లలో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొదటగా పుల్లయ్య కుమారుడు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్‌కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీ) రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్లు పుట్టించారు. ఆ తరువాత ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవరపుల్లయ్య విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బీ6, బీ7, బీ8 సబ్ డివిజన్లుగా విభజించి దేవరపుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ ధర సుమారు రూ. 5 కోట్ల వరకు పలుకుతుంది. దీనికి తోడు పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారు. 10 ఎకరాలు 1994లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. పది ఎకరాల సంగం డెయిరీ భూమిని ఎమ్మెల్యే ట్రస్ట్‌కు అక్రమంగా తరలించారు. చట్ట ప్రకారం డెయిరీ ఆస్తులను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత అక్కడ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టు ఆసుపత్రి నిర్మించారు. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని 2016లో 9 మంది పాడి రైతులు జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో పాల ఉత్పత్తిదారుల కోసం ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఆస్పత్రి సేవలను వినియోగిస్తామని యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ, ఆసుపత్రికి ఎమ్మెల్యే నరేంద్ర సతీమణి జ్యోతిర్మయిని ఎండీగా వ్యవహరించడం గమనార్హం. చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి గ్రామంలో 25 ఎకరాల పెద్ద చెరువును ఎమ్మెల్యే క్వారీగా మార్చే యత్నాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు రావి వెంకట రమణ అడ్డుకున్నారు. వైఎస్ జగన్‌ను ఆ ప్రాంతానికి తీసుకురావడంతో తవ్వకాలు నిలిపేశారు. తాడేపల్లి రూరల్ కొలనుకొండలో అటవీ శాఖ భూమిలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకున్న వ్యక్తిని సురేంద్ర బెదిరించి క్వారీ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న వారిని కూడా భయపెట్టారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ రూ.కోట్ల దోచేశారు. చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాల ద్వారా రూ.10 కోట్లు దండుకున్నారు. పొన్నూరు మండలంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. చింతలపూడి పరిధిలోపాడి రైతులు తమ సంఘం నిధులతో 30 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. అందులో నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరు మీద కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండపానికి ఎంపీ ల్యాడ్స్ కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. కానీ ఆ కల్యాణ మండపం ప్రభుత్వ ఆధీనంలో లేదు. కానీ, నరేంద్రకుమార్ తల్లి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి సుమారు 150 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కో కార్యక్రమానికి రూ. 70 వేలు నుంచి రూ. లక్ష వరకు అద్దె వసూలు చేస్తారు. వెనిగండ్లలోని ప్రభుత్వ భూమిలో ప్రజలలు విరాళాలతో నిర్మించుకున్న కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే మూయించారు. -
మనసు కలచివేస్తోంది..: వైఎస్ జగన్
* ఆమె నా సోదరి లాంటిది * శోభానాగిరెడ్డి మృతిపై వైఎస్ జగన్ ఆవేదన * నా కోసం ప్రతి అడుగులో అడుగు వేసింది.. * ప్రతి కష్టంలోనూ మా కుటుంబానికి అండగా నిలిచింది.. * పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసింది.. * కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని పరామర్శకు బయలుదేరుతున్నా.. * బరువెక్కిన హృదయంతో పొన్నూరు ప్రజల వద్ద సెలవు తీసుకున్న జగన్ ‘వైఎస్సార్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘శోభమ్మ నాకు సోదరిలాంటిది. నా కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసింది. అలాంటి శోభమ్మ ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచీ నా మనసుకు ఎంతో కష్టంగా ఉంది. నా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని శోభమ్మను పరామర్శించడానికి వెళుతున్నా’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గురువారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ప్రజల వద్ద సెలవు తీసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్రెడ్డి ఈ నెల 21న సోమవారం రాత్రి గుంటూరు జిల్లాలో ప్రవేశించారు. ఆయన మంగళ, బుధవారాల్లో జిల్లాలోని తెనాలి, మంగళగిరి, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటించి పలు సభల్లో ప్రసంగించారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయే సమయానికి పొన్నూరు చేరుకున్నారు. ఆ సమయానికే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ శోభానాగిరెడ్డిని నంద్యాల ఆస్పత్రిలో చేర్పించారన్న వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం గురువారం ఉదయం హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారన్న వార్త తెలిసినప్పటి నుంచి జగన్‌లో ఆందోళన ఎక్కువయ్యింది. కేర్ ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పరిస్థితి తెలుసుకుంటూ వచ్చారు. గురువారం ఉదయానికే జగన్ సభ కోసం పొన్నూరు నియోజకవర్గ కేంద్రానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ పొన్నూరు ప్రజలనుద్దేశించి చాలా క్లుప్తంగా నాలుగు నిముషాలు ప్రసంగించి హైదరాబాద్ బయలు దేరారు. ‘‘మీకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నా సోదరి శోభమ్మకు ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆమె పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందట. నా మనసంతా కలతగా ఉంది. అందుకే నా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆమెను పరామర్శించడానికి వెళుతున్నా. శోభమ్మ నా సోదరి లాంటిది. నా కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసి నడిచింది. ప్రతి కష్టంలోనూ మా కుటుంబానికి అండగా నిలిచింది. పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేసింది. అందుకే నేను వెంటనే బయలు దేరి వెళ్లాల్సి ఉంది. జగన్ వచ్చాడు. రెండే నిమిషాలు మాట్లాడి వెళ్లి పోయాడని ఎవ్వరూ మరోలా భావించవద్దు. జగన్ మనవాడు. మనం అర్థం చేసుకోలేక పోతే ఎవరు అర్థం చేసుకుంటారన్న పెద్ద మనసుతో నన్ను దీవించి పంపండి. మీకందరికీ ఒక విజ్ఞప్తి. మరణించి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి గుండెలోనూ గూడు కట్టుకుని ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో మనమంతా ఒక్కటైతేనే మళ్లీ ఆ సువర్ణయుగాన్ని సాధించుకోవడం సాధ్యమవుతుంది. పార్టీ తరఫున పొన్నూరు ఎమ్మెల్యేగా రావి వెంకటరమణను, గుంటూరు పార్లమెంటు స్థానానికి బాలశౌరిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించి జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. చెమర్చిన కళ్లతో అభిమానులను పలకరించిన జగన్ నందిగామ, న్యూస్‌లైన్: శోభానాగిరెడ్డి మృతి వార్త తెలిసి హైదరాబాద్ వెళుతున్న జగన్మోహన్రెడ్డిని నందిగామ 65వ నంబర్ జాతీయ రహదారిపై చందాపురం బైపాస్ వద్ద పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఆపారు. ఆయన క్షణంపాటు ఆగి, శోభానాగిరెడ్డి ఇక లేరని చెమర్చిన కళ్లతో అభిమానులను ఓదార్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు శోభానాగిరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ కార్యాలయ ఇన్చార్జి మొండితోక అరుణ్‌కుమార్, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీశైల వాసు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మహ్మద్ మస్తాన్ తదితరులున్నారు.