పొన్నూరులో ధూళిపాళ్ల దందా | Illegal Activities Of Ponnur MLA Dulipalla Narendra In Five Years Increased | Sakshi
Sakshi News home page

పొన్నూరులో ధూళిపాళ్ల దందా

Published Mon, Apr 8 2019 10:00 AM | Last Updated on Mon, Apr 8 2019 10:00 AM

Illegal Activities Of Ponnur MLA Dulipalla Narendra In Five Years Increased - Sakshi

సాక్షి, పొన్నూరు : ధూళిపాళ్ల నరేంద్రను పొన్నూరు ప్రజలు ఐదుసార్లు ఆశీర్వదించారు.. అయినా నియోజకవర్గంపై ఆయనకు కొంచెమైనా ఆపేక్ష ఉండదు.. అభివృద్ధి ఆనవాళ్లు కనిపించకపోయినా అవినీతి ఆగడాలకు కొదవలేదు. సంగం డెయిరీని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు అడ్డూ అదుపూ లేదు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసుల దందాకు అడ్టుకట్ట లేదు.

నియోజకవర్గ వ్యాప్తంగా నీరు–చెట్టు పేరుతో సాగించిన దోపిడీకి అంతే లేదు. ఎమ్మెల్యే అండతో, అధికార అహంకారంతో టీడీపీ నేతల అక్రమార్జనకు ఆనకట్ట లేదు. ప్రతి పనిలో కమీషన్లకు తెగబడిన ఎమ్మెల్యే తీరుపై ప్రశ్నించని గొంతు లేదు. ఐదేళ్ల పాలనలో కోట్ల రూపాయల దండుకున్న ఎమ్మెల్యే అవినీతిపై భగ్గుమనని ఊరూవాడా లేదు. 

3.89 ఎకరాలు.. రూ.5కోట్లు
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోల్‌కత్తా – చెన్నై జాతీయ రహదారి సమీపంలోని పెదకాకాని మండలం నంబూరులోని  సర్వే నంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని కబ్జా చేశారు. తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మారినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640 లలో భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

మొదటగా పుల్లయ్య కుమారుడు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్‌కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీఏ (జనరల్‌ పవర్‌ ఆఫ్‌ ఆటార్నీ) రిజిస్ట్రేషన్‌లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్లు పుట్టించారు. ఆ తరువాత ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవరపుల్లయ్య విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు.

ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బీ6, బీ7, బీ8 సబ్‌ డివిజన్‌లుగా విభజించి దేవరపుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్‌ ధర సుమారు రూ. 5 కోట్ల వరకు పలుకుతుంది. దీనికి తోడు పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారు.  

10 ఎకరాలు
1994లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. పది ఎకరాల సంగం డెయిరీ భూమిని ఎమ్మెల్యే ట్రస్ట్‌కు అక్రమంగా తరలించారు. చట్ట ప్రకారం డెయిరీ ఆస్తులను ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత అక్కడ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టు ఆసుపత్రి నిర్మించారు. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని 2016లో 9 మంది పాడి రైతులు జిల్లా కోర్టులో పిల్‌ దాఖలు చేశారు.  అయితే హైకోర్టులో పాల ఉత్పత్తిదారుల కోసం ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఆస్పత్రి సేవలను వినియోగిస్తామని యాజమాన్యం అఫిడవిట్‌ దాఖలు చేశారు. కానీ, ఆసుపత్రికి ఎమ్మెల్యే నరేంద్ర సతీమణి జ్యోతిర్మయిని ఎండీగా వ్యవహరించడం గమనార్హం.

  • చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి గ్రామంలో 25 ఎకరాల పెద్ద చెరువును ఎమ్మెల్యే క్వారీగా మార్చే యత్నాన్ని వైఎస్సార్‌ సీపీ నాయకుడు రావి వెంకట రమణ అడ్డుకున్నారు. వైఎస్‌ జగన్‌ను ఆ ప్రాంతానికి తీసుకురావడంతో తవ్వకాలు నిలిపేశారు.   
  •  తాడేపల్లి రూరల్‌ కొలనుకొండలో అటవీ శాఖ భూమిలో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు తీసుకున్న వ్యక్తిని సురేంద్ర బెదిరించి క్వారీ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వుకుంటున్న వారిని కూడా భయపెట్టారు.
  • చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేస్తూ రూ.కోట్ల దోచేశారు. చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాల ద్వారా రూ.10 కోట్లు దండుకున్నారు.
  • పొన్నూరు మండలంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకున్నారు.
  • చింతలపూడి పరిధిలోపాడి రైతులు తమ సంఘం నిధులతో  30 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. అందులో నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరు మీద కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండపానికి ఎంపీ ల్యాడ్స్‌ కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. కానీ ఆ కల్యాణ మండపం ప్రభుత్వ ఆధీనంలో లేదు. కానీ, నరేంద్రకుమార్‌ తల్లి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.  ఏడాదికి సుమారు 150 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కో కార్యక్రమానికి రూ. 70 వేలు నుంచి రూ. లక్ష వరకు అద్దె వసూలు చేస్తారు. వెనిగండ్లలోని ప్రభుత్వ భూమిలో ప్రజలలు విరాళాలతో నిర్మించుకున్న కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే మూయించారు. 
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement