* ఆమె నా సోదరి లాంటిది
* శోభానాగిరెడ్డి మృతిపై వైఎస్ జగన్ ఆవేదన
* నా కోసం ప్రతి అడుగులో అడుగు వేసింది..
* ప్రతి కష్టంలోనూ మా కుటుంబానికి అండగా నిలిచింది..
* పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసింది..
* కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని పరామర్శకు బయలుదేరుతున్నా..
* బరువెక్కిన హృదయంతో పొన్నూరు ప్రజల వద్ద సెలవు తీసుకున్న జగన్
‘వైఎస్సార్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘శోభమ్మ నాకు సోదరిలాంటిది. నా కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసింది. అలాంటి శోభమ్మ ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచీ నా మనసుకు ఎంతో కష్టంగా ఉంది. నా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని శోభమ్మను పరామర్శించడానికి వెళుతున్నా’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గురువారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ప్రజల వద్ద సెలవు తీసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21న సోమవారం రాత్రి గుంటూరు జిల్లాలో ప్రవేశించారు.
ఆయన మంగళ, బుధవారాల్లో జిల్లాలోని తెనాలి, మంగళగిరి, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటించి పలు సభల్లో ప్రసంగించారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయే సమయానికి పొన్నూరు చేరుకున్నారు. ఆ సమయానికే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ శోభానాగిరెడ్డిని నంద్యాల ఆస్పత్రిలో చేర్పించారన్న వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం గురువారం ఉదయం హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారన్న వార్త తెలిసినప్పటి నుంచి జగన్‌లో ఆందోళన ఎక్కువయ్యింది. కేర్ ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పరిస్థితి తెలుసుకుంటూ వచ్చారు. గురువారం ఉదయానికే జగన్ సభ కోసం పొన్నూరు నియోజకవర్గ కేంద్రానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ పొన్నూరు ప్రజలనుద్దేశించి చాలా క్లుప్తంగా నాలుగు నిముషాలు ప్రసంగించి హైదరాబాద్ బయలు దేరారు.
‘‘మీకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నా సోదరి శోభమ్మకు ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆమె పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందట. నా మనసంతా కలతగా ఉంది. అందుకే నా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆమెను పరామర్శించడానికి వెళుతున్నా. శోభమ్మ నా సోదరి లాంటిది. నా కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసి నడిచింది. ప్రతి కష్టంలోనూ మా కుటుంబానికి అండగా నిలిచింది. పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేసింది. అందుకే నేను వెంటనే బయలు దేరి వెళ్లాల్సి ఉంది. జగన్ వచ్చాడు. రెండే నిమిషాలు మాట్లాడి వెళ్లి పోయాడని ఎవ్వరూ మరోలా భావించవద్దు. జగన్ మనవాడు. మనం అర్థం చేసుకోలేక పోతే ఎవరు అర్థం చేసుకుంటారన్న పెద్ద మనసుతో నన్ను దీవించి పంపండి. మీకందరికీ ఒక విజ్ఞప్తి. మరణించి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి గుండెలోనూ గూడు కట్టుకుని ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో మనమంతా ఒక్కటైతేనే మళ్లీ ఆ సువర్ణయుగాన్ని సాధించుకోవడం సాధ్యమవుతుంది. పార్టీ తరఫున పొన్నూరు ఎమ్మెల్యేగా రావి వెంకటరమణను, గుంటూరు పార్లమెంటు స్థానానికి బాలశౌరిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించి జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
చెమర్చిన కళ్లతో అభిమానులను పలకరించిన జగన్
నందిగామ, న్యూస్‌లైన్: శోభానాగిరెడ్డి మృతి వార్త తెలిసి హైదరాబాద్ వెళుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని నందిగామ 65వ నంబర్ జాతీయ రహదారిపై చందాపురం బైపాస్ వద్ద పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఆపారు. ఆయన క్షణంపాటు ఆగి, శోభానాగిరెడ్డి ఇక లేరని చెమర్చిన కళ్లతో అభిమానులను ఓదార్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు శోభానాగిరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ కార్యాలయ ఇన్‌చార్జి మొండితోక అరుణ్‌కుమార్, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీశైల వాసు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మహ్మద్ మస్తాన్ తదితరులున్నారు.
మనసు కలచివేస్తోంది..: వైఎస్ జగన్
Published Fri, Apr 25 2014 2:05 AM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM
Advertisement