సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో (2014–15 నుంచి 2016–17 వరకు) దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ 3,343 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి 8వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలసి ఈ మూడేళ్లలో 93,400 హెక్టార్లలోనే అడవులను పెంచడం గమనార్హం. జాతీయ అటవీ విధానం ప్రకా రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి. ఆ మేరకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా–2015 నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 21.60 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 18.80 శాతమే. ఏపీలో 24.42 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 15.25 శాతమే. ఇటీవల కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2013 నుంచి 2015 మధ్య 168 చదరపు కి.మీ. మేర (16,800 హెక్టార్ల మేర)అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment