వికారాబాద్/అనంతగిరి, న్యూస్‌లైన్: మానవజాతి మనుగడ కోసం అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి అన్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో అనంతగిరి లాంటి చక్కని అటవీ ప్రాంతం ఉండడం చాలా సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్ట అటవీ ప్రాంతంలో ఆదివారం అటవీశాఖ ఆధ్వర్యంలో 5 కృష్ణ జింకలు, 12 చారల జింకలను సీఎస్ మహంతి, డీజీ పీ ప్రసాదరావు, రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బీఎస్‌ఎస్ రెడ్డిలు వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ.. ఆఫ్రికా ఖండంలో ఉన్న సవన్నా గడ్డి భూములు, అక్కడి వాతావరణం అనంతగిరి గుట్టలో గోచరిస్తోందని, జింకల ఎదుగుదలకు ఇక్కడి వాతావరణం తోడ్పడుతుందన్నారు. జంతువులు ఉండటానికి కేవలం దట్టమైన అడవులే అవసరం లేదని.. ఇక్కడ ఆ రెండూ కలిసి ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. ప్రకృతిలో సమతుల్యత లోపిస్తే ఇటు మానవ మనుగడకు, అటు జంతు జాలానికీ ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పర్యావరణాన్ని అభివృద్ధిపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అనంతగిరి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. హైదరాబాద్‌కు చేరువలో అటవీ ప్రాంతం ఉండటం సంతోషకరమన్నారు. ప్రస్తుతం వదిలిపెడుతున్న జింకలు ఇంతకుముందున్న జంతు ప్రదర్శనశాలలో కన్నా ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తాయని.. వాటికి స్వేచ్ఛ మనకు పుణ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మానవ జాతి మనుగడకు అటవీశాఖ అభివృద్ధి చాలా అవసరమని స్పష్టంచేశారు. డీజీపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. జింకలు విహరించడానికి అనంతగిరి అడవుల్లో మంచి వాతావరణం ఉందన్నారు.
అనంతగిరి అటవీ ప్రాంతంలోప్రస్తుతం 80లోపు వన్యప్రాణులు ఉన్నాయని, మరిన్ని వన్య ప్రాణులను సంరక్షించేందుకు అవకాశముందన్నారు. అడవుల పరిరక్షణకై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందని చెప్పారు. రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఎస్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు అటవీ సిబ్బంది ఉన్నారని, స్థానిక గ్రామాలకు చెందిన మరో ఐదుగురిని నియమించి వన్యప్రాణులను పరిరక్షిస్తామన్నారు. మనుషులు పరిసరాల్లోని వన్యప్రాణులపై దాడి చేయడం వల్ల అవి గ్రామాల్లోకి వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు.
అనంతగిరి అడవుల్లోని ప్రశాంత వాతావరణం అటవీ జంతువుల మనుగడకు చాలా అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. అనంతగిరి అడవిలో ప్రస్తుతం వివిధ రకాల వన్యప్రాణులు 100 వరకే ఉన్నాయని, ఇంకా వదిలిపెట్టడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ జోసెఫ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాష్ట్ర ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చీఫ్ రాజేష్ మిట్టల్, హైదరాబాద్ రేంజ్ కన్జర్‌వేటివ్ అధికారి రమణారెడ్డి, సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎస్పీ బి.రాజకుమారి, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎఫ్‌ఓ నాగభూషణం, సబ్ డీఎఫ్‌ఓ మాధవరావు, ఎఫ్‌ఆర్‌ఓ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
కాగా సీఎస్ మహంతి, డీజీపీ ప్రసాదరావు,లు అడవిలో జింకలు వదిలిపెట్టిన అనంతరం అడవిలో నడుచుకుంటూ అనంతపద్మనాభస్వామి ఆలయానికి వెళ్లారు. వీరిని ప్రధాన అర్చకుడు శేషగిరిశర్మ సాదరంగా ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.
అడవుల రక్షణఅందరి బాధ్యత
Published Sun, Jan 19 2014 11:48 PM | Last Updated on Thu, Oct 4 2018 6:07 PM
Advertisement
Advertisement