
వచ్చారు.. వెళ్లారు..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం నగర శివారు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. శివార్లలోని కూడళ్లు, రహదారులు, అటవీ ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. వాస్తవానికి శనివారమే ఈ పర్యటన ఉన్నప్పటికీ సమయాభావం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఏరియల్ సర్వేతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ నేలపైకి దిగలేదు. దీంతో ఏరియల్ సర్వే మాత్రం పూర్తి చేసుకుని తిరుగుపయనమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
అటవీ భూములను పరిశీలించి..
ఏరియల్ సర్వేలో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ జిల్లాలోని అటవీ భూములను పరిశీలించారు. ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో సర్వే చేసి క్షేత్ర పరిశీలన చేయాల్సి ఉంది. ఇందుకోసం హయత్‌నగర్‌లోని డీఆర్ పార్క్, ఘట్‌కేసర్ మండలం నారపల్లి రిజర్వ్ ఫారెస్ట్, మేడ్చల్ మండలం కండ్లకోయ ఫారెస్ట్‌లలో జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేసింది.
అయితే సాంకేతిక సమస్యతో ఈ మూడుచోట్ల హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. కేవలం అటవీ భూములను పరిశీలించి సీఎం నగరానికి వెళ్లిపోయారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి స్పష్టమైన సమాచారం జిల్లా యంత్రాంగానికి సైతం తెలియదని జిల్లా రెవెన్యూ శాఖలోని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.