రూ.8 కోట్ల విలువైన ఖనిజం అక్రమరవాణా | Eight Crore Worth Of Ore Looted In Nellore District | Sakshi
Sakshi News home page

రూ.8 కోట్ల విలువైన ఖనిజం అక్రమరవాణా

Published Sun, Jan 5 2020 10:33 AM | Last Updated on Sun, Jan 5 2020 10:33 AM

Eight Crore Worth Of Ore Looted In Nellore District - Sakshi

అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌

పచ్చని చెట్లపై పక్షుల కిలకిల రావాలు.. పొదల మాటున జీవనం సాగించే వన్యప్రాణులు. విలువైన వృక్ష సంపద. అద్భుతమైన జీవ వైవిధ్యం.. అటవీ ప్రాంతం సొంతం. గత టీడీపీ హయాంలో నేతలు అడవినీ వదిలి పెట్టలేదు. అడవిలో విధ్వంసం సృష్టించి సహజ వనరులను కొల్లగొట్టారు. కొందరు అక్రమార్కులు తమ స్వార్థం కోసం అటవీ ప్రాంతంలో జెలిటిన్‌స్టిక్స్‌తో పేల్చుతూ వృక్ష, పక్షి జాతులతో పాటు వన్యప్రాణులను విలవిలల్లాడేలా చేశారు. ఇదంతా రిజర్వు ఫారెస్ట్‌లోనే విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టడానికే అని విజిలెన్స్‌ విచారణలో నిగ్గు తేలింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అక్రమార్కులు రూ.8 కోట్ల విలువైన సంపదను యథేచ్ఛగా అక్రమ రవాణా సాగించినా, అధికారులు నిలువరించలేకపోయారు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో అక్రమార్కులకు అధికారులు అండగా నిలిచారని సమాచారం

సాక్షి, నెల్లూరు: అధికారం మాటున అప్పటి మంత్రి అండదండలతో అక్రమార్కులు అడవిని ధ్వంసం చేశారు. రక్షకులమంటూ.. అడవిని భక్షించారు. నీతికి, నిజాయతీకి తామే బ్రాండ్‌ అంబాసిడర్లమంటూ నిత్యం నీతులు వల్లించే ఆ పార్టీ నేతలు మైనింగ్‌ నిర్వాహకులతో కలిసి అటవీ సహజ వనరులను దోచేశారు. పొదలకూరు మండలం నందివాయ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28లో 36.58 ఎకరాల భూమిని 1990లో ఉమామహేశ్వరీ మైన్‌ నిర్వాహకులకు మైనింగ్‌ అనుమతి ఇచ్చారు. ఆ సర్వే నంబరులో దాదాపు 214 ఎకరాల భూమి ఉంది. అందులో 70 ఎకరాల భూమి రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ భూములను మైనింగ్‌కు అనుమతులు తీసుకున్న నిర్వాహకులు మాత్రం రెవెన్యూ భూముల పరిధి దాటి రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూముల్లోకి చొరబడ్డారు. కొండలు, గుంటల భూములను ఇష్టానుసారంగా తవ్వేసి తెల్లరాయి, గ్రావెల్, మెటల్‌ను అక్రమంగా రవాణా చేశారు. 19 ఏళ్ల పాటు మైనింగ్‌ అనుమతులు పొందిన లీజుదారులు ఆయా భూములను పీల్చి పిప్పి చేసి కోట్లాది రూపాయల విలువైన సంపదను దోచేశారు. 2009 నాటికి మైనింగ్‌ అనుమతులు ముగిసినా కూడా నిర్వాహకులు రెన్యువల్‌ చేయించుకోలేదు. అయినా యథేచ్ఛగా మైనింగ్‌ను కొనసాగించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి అధికార పార్టీ నేత, మాజీమంత్రి అండతో దోపిడీని కొనసాగించారు.  

టీడీపీ హయాంలో..
టీడీపీ హయాంలో మైనింగ్‌ నిర్వాహకుడు జిల్లా మంత్రితో లోపాయి కారి ఒప్పందం చేసుకుని అనుమతులు లేకుండానే రెవెన్యూ భూములే కాకుండా నందివాయ రిజర్వ్‌ ఫారెస్ట్‌ను ఆక్రమించారు. ఫారెస్ట్‌ పరిధిలో ఉండే కొండలను జిలెటిన్‌స్టిక్‌ వంటి పేలుడు పదార్థాలతో పేల్చి తెల్లరాయి నుంచి గ్రావెల్, మెటల్‌ను అక్రమ రవాణా సాగించారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఫారెస్ట్‌ పరిధిలో సుమారు 20 ఎకరాల్లోకి చొచ్చుకుపోయి సహజ వనరులను కొల్లగొట్టుతున్నా అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో చర్యలు తీసుకొనేందుకు వెనకాడిన అధికారులు మైనింగ్‌ నిర్వాహకుడితో లాలూచీ పడి అక్రమ రవాణాకు సహకరించారు. అప్పట్లో అక్రమ మైనింగ్‌పై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2017లో  అటవీశాఖ, రెవెన్యూ శాఖ  సర్వే నిర్వహించి ఫారెస్ట్‌ భూముల్లో మైనింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో మైనింగ్‌ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కానీ అప్పటి అధికార పార్టీ మంత్రి అండదండలు ఉండడంతో సర్వే నివేదికను తొక్కి పెట్టారు. దీంతో మైనింగ్‌ నిర్వాహకుడు మాత్రం అక్రమ రవాణా దందా కొనసాగించాడు.  

జిల్లా అధికారుల దృష్టికి వెళ్లినా..
నందివాయ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌ వ్యవహారం విషయం జిల్లా స్థాయిలో అధికారులందరికీ తెలిందే. ఈ వ్యవహారంపై గత జిల్లా ఉన్నతాధికారి దృష్టికి అటవీశాఖ అధికారులు తీసుకెళ్లినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో కనీసం స్పందించలేదని తెలిసింది. జిల్లా అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రి ఈ అక్రమ మైనింగ్‌కు అండగా ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు కూడా వారికి సహకరించి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇటు రెవెన్యూ, అటు మైనింగ్‌ అధికారులు కూడా అక్రమ మైనింగ్‌కు పూర్తి స్థాయిలో అండదండలు అందించారు.

వన్యప్రాణులు విలవిల 
మైనింగ్‌ నిర్వాహకులు తమ స్వార్థం కోసం అడవినే ఆక్రమించి సంపదను కొల్లగొట్టే క్రమంలో విధ్వంసం సృష్టించి వన్యప్రాణులను, పక్షి జాతులను విలవిలాలాడేలా చేశారు. నందివాయ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో దాదాపు 40 రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు ఉన్నాయి. పచ్చని అడవిలో ప్రశాంతంగా ఉండే పక్షులు, వన్యప్రాణులకు పేలుళ్లతో నిద్ర లేకుండా చేశారు. కొండను తొలిచేందుకు నేపథ్యంలో జెలిటిన్‌స్టిక్, అమ్మెనియా వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించి రాత్రి వేళల్లో పేల్చేవారు. ఆ ప్రభావంతో వన్యప్రాణులు, పక్షులు విలవిలలాడాయి.  ఆ పేలుళ్ల ప్రభావం వల్ల నందివాయ గ్రామ పరిధిలో పంటలపై పడేది. పచ్చని పంటలపై దుమ్ము, ధూళి కణాలు పడి ఎదుగుదల లోపించేదని స్థానికులు ఆరోపించారు.

విచారణలో నిగ్గుతేలిన వాస్తవాలు 
నందివాయ రిజర్వు ఫారెస్ట్‌లో కొండలను తొలిచి ఏళ్ల కాలంగా అక్రమ మైనింగ్‌ నిర్వహిస్తున్న వైనంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడంతో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై కదలిక వచ్చింది. అధికారులు విచారణలో దాదాపు అడవిని కొల్లగొట్టి రూ.8 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా రవాణా సాగించినట్లు నిగ్గు తేలింది. 2010 నుంచి మైనింగ్‌కు అనుమతి లేకుండా నిర్వాహకులు మాత్రం మైకా, తెల్ల రాయిలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించి అటవీశాఖ ఉన్నతాధికారులకు  నివేదిక ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఇంత భారీగా అక్రమ మైనింగ్‌ జరిగినా అధికారులు స్పందించలేదని తేలడంతో అందుకు బాధ్యులైన ఇద్దరు బీట్‌ అధికారులపై వేటు వేశారు. ఇంకా ఈ అక్రమ మైనింగ్‌కు సహకరించిన అధికారులపై కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

ఒక్కరూ సహకరించలేదు
నేను రాపూరు రేంజర్‌గా జాయిన్‌ అయినప్పటి నుంచి అక్రమ మైనింగ్‌ను నిలువరించేందుకు పోరాటం చేస్తున్నా. ఏ ఒక్క అధికారి కూడా నాకు సపోర్ట్‌ చేయలేదు. రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అయితే అసలు చెవికెక్కించుకోలేదు. గతంలో అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మైనింగ్‌ నిర్వాహకుడిపై కేసు కూడా నమోదు చేశాను. కానీ ఎవరూ సహకరించకపోవడంతో ఏమి చేయలేకపోయాం. నిర్వాహకుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు. జాయింట్‌ సర్వే చేయమని కోర్టు ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోలేదు. – శ్రీదేవి, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిణి

జాయింట్‌ సర్వే నిర్వహిస్తాం
రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులందరిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయి. త్వరలోనే మైనింగ్‌పై జాయింట్‌ సర్వే నిర్వహిస్తాం. పూర్తి స్థాయి విచారణ కూడా జరుపుతాం. అక్రమ మైనింగ్‌కు సహకరించిన ఎవరిని వదలం. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులపై తాత్కాలిక చర్యలు చేపట్టాం. పూర్తిస్థాయి విచారణలో తప్పు చేశారని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. – శ్రీనివాసులు రెడ్డి, డీఎఫ్‌ఓ , నెల్లూరు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement