వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒక్కటే అన్నట్లుగా సాగింది గతంలో అమరరాజా వ్యవహారం. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆడిందే ఆట, పాడిందే పాటగా అటవీ శాఖ భూముల్లో పాగావేసింది. అనుమతి తీసుకున్న భూమిని కాదని.. పక్కనున్న స్థలాన్నీ కలిపేసుకుంది. ఎంచక్కా గోడ కట్టేసినా.. పెద్దలతో వ్యవహారంతో కావడంతో అధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఈ బాగోతం కాస్తా బట్టబయలు కావడంతో అధికారుల్లోనూ చలనం వచ్చింది. చర్యలకు సిద్ధమైన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు అనధికార ప్రహరీని కూల్చేసి.. ఆక్రమిత స్థలాన్ని స్వాదీనం చేసుకోవడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో ‘అమరరాజా’ యాజమాన్యం 2000 సంవత్సరంలో తమ ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సమీప అటవీ శాఖ(ఫారెస్ట్ పోరంబోకు) భూమిని భూ మార్పిడి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఆ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో 4.4 హెక్టార్ల అటవీభూమిని కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమరరాజాకు కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం 4.4 హెక్టార్లకు అనుమతిస్తే.. ఫ్యాక్టరీ యాజమాన్యం మరో 3.04 హెక్టార్లను ఆక్రమించేసింది.
ఏకంగా ఆ అటవీ భూముల్లోనే ప్రహరీ కట్టేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 766 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే దాదాపు ఏడున్నర ఎకరాలకు పైగా భూమిని అడ్డగోలుగా ఆక్రమించేసింది. ఇలా సుమారు రెండు దశాబ్దాలుగా అటవీభూమిని ఆక్రమించుకున్నా ఎవ్వరూ సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. అమరరాజా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విష కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం, కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చిన పరిణామాలతో అమరరాజా వివాదాల తుట్టె ఈ మధ్యకాలంలో కదలడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత జూలై 20న ‘సాక్షి’లో ‘అటవీభూముల్లో అమరరాజా’ శీర్షికన వచ్చిన కథనంపై అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తొలుత ఆయా భూముల్లో ఆక్రమిత గోడను తొలగించాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందితో వెళ్లి అక్రమిత భూమిలోని ప్రహరీని కూల్చేశారు. అమరరాజా కలిపేసుకున్న ఆ మూడు హెక్టార్ల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నామని తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌వో) పవన్ కుమార్ స్పష్టం చేశారు.
ఆ 18 ఎకరాలూ అటవీభూములే..
అమరరాజా భూ ఆక్రమణలకు సంబంధించి తాజాగా అటవీశాఖ అధికారులు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీస్‌కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ పరిధిలో 18 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. నోటిఫైడ్ గెజిట్ ప్రకారం అవి కచ్చితంగా అటవీ శాఖ భూములేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో 2015–16 మధ్య కాలంలో కరకంబాడి పంచాయతీ పరిధిలోనే 21 ఎకరాల భూములను అమరరాజా యాజమాన్యం కొనుగోలు చేసింది. 1982లో పేదల కోసం అసైన్ చేసిన ఆ భూములను అడిగిందే తడవుగా ఆరేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం అలినేషన్ పేరిట అమరరాజాకు విక్రయించింది.
అయితే ఈ 21 ఎకరాల భూముల్లో 18 ఎకరాలు అటవీ భూములేనని, 1979లో నోటిఫై చేసిన అటవీ భూములను రెవెన్యూ అధికారులు ఎలా విక్రయిస్తారని అటవీశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు భూముల పూర్తి వివరాలతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. వాస్తవానికి గతంలో అవి అటవీ భూములేనని, అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ నేపథ్యంలో డీనోటిఫైగా చూపిస్తున్నాయనేది రెవెన్యూ అధికారుల వాదన. అయితే ఆ భూమి ఎప్పుడు, ఎందుకు డీనోటిఫై చేశారో వివరాలు అందుబాటులో లేవని చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఆ సర్వేతోనైనా 18 ఎకరాల అటవీ భూముల అసలు ‘కథ’ బయటికొస్తుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment