
సాక్షి, అమరావతి: అటవీ భూములపై హక్కు పత్రాలు పొందిన గిరిజనులకు 2 విడతల రైతు భరోసాను ఒకేసారి చెల్లించడం ద్వారా సీఎం జగన్ గిరిజన పక్షపాతి అనే విషయాన్ని మరోసారి నిరూపించారని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కొనియాడారు. ఒక్కో గిరిజన రైతుకు రూ.11,500 చొప్పున ఒకేసారి ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 2న సీఎం జగన్ రాష్ట్రంలోని 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమిని పట్టాలుగా పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
వారందరికీ కూడా రైతు భరోసా అందిస్తామని సీఎం అప్పట్లో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ మాట ప్రకారం.. నేడు రెండు విడతల రైతు భరోసా మొత్తాలను ఒకేసారి గిరిజనుల ఖాతాల్లో జమ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా గిరిజనులు ఆ భూముల ద్వారా ఉపాధి పొందడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారని పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే అమలు చేసిన రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహన మిత్ర, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాల ద్వారా గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment