పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సాధికార సభకు పోటెత్తిన అశేష జనసందోహంలో ఓ భాగం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంత దశను మార్చేలా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గిరిజనం జై కొట్టారు. విద్య, వైద్య రంగాలను సమూలంగా మార్చడమే గాక ప్రభుత్వ సేవలను తమ ఆవాసాలకే చేర్చినందుకు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. భారీఎత్తున భూ పంపిణీతో బతుకులు మార్చిన జగనన్నకు జేజేలంటూ పాటలు పాడారు. గిరిజన పక్షపాతికి సుదూర గిరిశిఖర గ్రామాల నుంచీ తరలివచ్చి ధన్యవాదాలు చెప్పారు.
బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర దృశ్యమిది. గిరిజన చైతన్యానికి ఈ యాత్ర అద్దంపట్టింది. తొలుత కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామం నుంచి వందలాది యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా బయల్దేరారు. 11 గ్రామాల మీదుగా 12 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ ర్యాలీకి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జై జై జగన్ నినాదాలతో హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును ప్రజాప్రతినిధులు వివరిస్తుంటే ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
ప్రత్యేక జిల్లాతో గిరిజనులకు గుర్తింపు: ఎంపీ గొడ్డేటి మాధవి
సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసి 45 లక్షల మంది గిరిజనులకు గుర్తింపు ఇచ్చారని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి చెప్పారు. ప్రజలంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
సీఎం జగన్ దేశానికే స్ఫూర్తి: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, చెప్పని పథకాలను ఎన్నింటినో అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి, సాధికారత కల్పించిన సీఎం ఒక్క జగన్ మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్లే 2014 ఎన్నికల్లో గెలిపించిన ప్రజలనూ మోసం చేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ మాయమాటలు చెప్పడానికి చంద్రబాబు సహా టీడీపీ మోసగాళ్లు మళ్లీ ప్రజల ముందుకొస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు.
గిరిజన బిడ్డలకు పెద్దపీట: ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చి అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా తీర్చిదిద్దుతున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు ఏనాడూ గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. బాబుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ గిరిబిడ్డలను అనేక పథకాలతో ఆదరిస్తున్నారని, మంచి విద్య, అధునాతన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు.
గిరిజనులకు అందుబాటులో విద్య: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు పార్వతీపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా గిరిజనులకు ఉన్నత విద్యను సీఎం వైఎస్ జగన్ అందుబాటులోకి తెస్తున్నారని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్ వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నిలవాలని, లేదంటే నష్టపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స
సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment