ఫైల్ ఫోటో
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖకు 5 జాతీయ అవార్డులు దక్కాయి. దాంతో పాటు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ) దేశంలోనే మూడు నంబర్‌వన్ అవార్డులు సాధించింది. వన్ ధన్ యోజన, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను కల్పించడంలోనూ, సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ జీసీసీ.. జాతీయ స్థాయిలో దేశంలోనే మొదటి ర్యాంకులను సాధించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. జీసీసీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు ట్రైఫెడ్ ఈ అవార్డులను ఇవ్వనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు.
వన్ ధన్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలోనూ, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ఇప్పించడంలోనూ ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకును కేటాయించిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు మొదటి ర్యాంకును ఇచ్చారని పుష్ప శ్రీవాణి వివరించారు. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4.50 కోట్ల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు జీసీసీకి దక్కిందని తెలిపారు.
తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి తీసుకున్న చర్యలు, పటిష్టమైన పర్యవేక్షణ కారణంగానే ఇది సాధ్యమైయిందని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే జీసీసీ అధికార సిబ్బందికి పుష్ప శ్రీవాణి అభినందనలు తెలిపారు. సీఎం జగన్ మార్గదర్శనంతోనే జీసీసీ ఉత్తమంగా పనిచేస్తోందనడానికి జాతీయ స్థాయిలో వచ్చిన 5 అవార్డులే నిదర్శమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment