Tribal Cooperative Corporation
-
ఏపీ గిరిజన సంక్షేమ శాఖకు 5 జాతీయ అవార్డులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖకు 5 జాతీయ అవార్డులు దక్కాయి. దాంతో పాటు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ) దేశంలోనే మూడు నంబర్‌వన్ అవార్డులు సాధించింది. వన్ ధన్ యోజన, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను కల్పించడంలోనూ, సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ జీసీసీ.. జాతీయ స్థాయిలో దేశంలోనే మొదటి ర్యాంకులను సాధించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. జీసీసీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు ట్రైఫెడ్ ఈ అవార్డులను ఇవ్వనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు. వన్ ధన్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలోనూ, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ఇప్పించడంలోనూ ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకును కేటాయించిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు మొదటి ర్యాంకును ఇచ్చారని పుష్ప శ్రీవాణి వివరించారు. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4.50 కోట్ల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు జీసీసీకి దక్కిందని తెలిపారు. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి తీసుకున్న చర్యలు, పటిష్టమైన పర్యవేక్షణ కారణంగానే ఇది సాధ్యమైయిందని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే జీసీసీ అధికార సిబ్బందికి పుష్ప శ్రీవాణి అభినందనలు తెలిపారు. సీఎం జగన్ మార్గదర్శనంతోనే జీసీసీ ఉత్తమంగా పనిచేస్తోందనడానికి జాతీయ స్థాయిలో వచ్చిన 5 అవార్డులే నిదర్శమన్నారు. -
జీసీసీలో అక్రమాలు నిజమే
సాక్షి, హైదరాబాద్: గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ)లో అక్రమాలు నిజమేనని ప్రాథమిక విచారణలో బహిర్గతమైంది. దీంతో శాఖలో ఆర్థిక అక్రమాలకు కారణమైన జీసీసీ ఉన్నతాధికారిపై వేటుకు గిరిజన సంక్షేమ శాఖ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అభియోగాల నమోదుతో పాటు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు ఉపక్రమించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లటంతో నోటీసులు జారీ చేయాలని భావించిన అధికారులు ఆ చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ అధికారి వచ్చిన తర్వాతే షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశముందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జీసీసీలో జరిగిన ఆర్థిక అక్రమాలపై అధ్యయనం చేసేందుకు కోఆపరేటివ్ శాఖకు చెందిన రిజిస్ట్రార్‌ను గిరిజన సంక్షేమ శాఖ నియమించింది. విచారణాధికారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన నిధులను ఓ ప్రైవేటు బ్యాంకులో జమచేయడంతో పాటు ఆర్థిక లావాదేవీల్లో అక్రమాల వ్యవహారం తొలిసారిగా శాఖాపరమైన ఆడిటింగ్‌లో వెలుగు చూసింది. -
‘బఫర్’ భద్రమేనా..?
భద్రాచలం : గోదావరి వరదల సమయంలో బాధితులకు చేపట్టాల్సిన పునరావాస చర్యలపై జిల్లా యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకూ గోదావరి నదికి పూర్తిస్థాయిలో వరదలు రానప్పటికీ గత అనుభవాల దృష్ట్యా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది 30 అడుగులకు పైగానే ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే ఒక్కసారిగా గోదావరి ఉప్పొంగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే డివిజన్ కేంద్రమైన భద్రాచలం నుంచి అటు వాజేడు, ఇటు కూనవరం రహదారులకు దారులు మూసుకుపోతాయి. రహదారుల జలదిగ్బంధంతో ఎటూ వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఏటా మూడు నెలల పాటు గోదావరి వరదలు పరీవాహక ప్రాంతంలోని 14 మండలాలపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లోని ప్రజానీకానికి ఎలాంటి ఆహార కొరత లేకుండా సహాయక చర్యలు అందించేందుకు సరిపడా నిత్యావసర సరుకులను నిల్వ చేస్తారు. బఫర్ స్టాక్ పాయింట్ల పేరుతో గుర్తించిన ప్రదేశాల్లో ముంపు ప్రాంత ప్రజానీకం అవసరాలకు అనుగుణంగా వస్తువులు నిల్వ ఉంచుతారు. ముందస్తు చర్యల్లో భాగంగా వరద ప్రభావిత బాధితులకు పునరావాసం కోసం 14,500 క్వింటాళ్ల బియ్యం, 50 వేల లీటర్ల కిరోసిన్ బఫర్ స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. గిరిజన సహకార సంస్థ గోదాముల (ఎంఎల్ఎస్ పాయింట్) నుంచి మండలాల్లోని ఆయా బఫర్ స్టాక్ పాయింట్లకు ఇప్పటికే సరుకులను తరలించారు. కానీ ఆయా స్టాక్ పాయింట్లలో అధికారుల చెబుతున్న లెక్కల ప్రకారం నిల్వలు ఉన్నాయా.. మాయమయ్యాయా..? అనే దానిపై ఇప్పటి వరకూ ఏ ఒక్క అధికారి కూడా పరిశీలన చేయకపోవడం గమనార్హం. భద్రాచలం గిరిజన సహకార సొసైటీ పరిధిలో 5, 500 క్వింటాళ్లను సరఫరా చేసినట్లుగా గోదాం నిర్వహణ అధికారులు చెబుతున్నారు. కూనవరంలో ఉన్న బఫర్ స్టాక్ పాయింట్లో 2,500 క్వింటాళ్లు భద్రాచలం మండలంలోని తోటపల్లిలో ఆరొందలు, నల్లకుంటలో 275, భద్రాచలంలో ఎనిమిదొందలు, దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో 275, లక్ష్మీనగరంలో తొమ్మిదొందల క్వింటాళ్లు నిల్వ ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే విధంగా వెంకటాపురం సొసైటీ పరిధిలోని మండలాల్లో పరిధిలో ఐదు వేల క్వింటాళ్లు, చింతూరు పరిధిలో రెండు వేలు, కుక్కునూరు పరిధిలో 2,200 క్వింటాళ్ల బియ్యం నిల్వ చే సినట్లుగా అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని చోట్ల అధికారులు చెబుతున్న విధంగా నిల్వలు లేకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తోటపల్లిలో ఆరొందల క్వింటాళ్లు ఉన్నాయని చెబుతున్నప్పటికీ చిన్నపాటి పెంకిటింట్లో 12 వందల బస్తాలు పట్టే అవకాశం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాక్ పాయింట్లకు నో సెక్యూరిటీ ఆమా ప్రాంతాల్లోని బఫర్ స్టాక్పాయింట్లలో ఉన్న బియ్యం నిల్వలకు ఎలాంటి భద్రత లేదని గ్రామస్తులు చెబుతున్నారు. స్టాక్ పాయింట్లకు వాచ్మన్లను నియమించుకునే అవకాశం ఉంది. అయితే... అలా చేయకుండానే ఆయా గ్రామాల్లోని డీలర్‌కు కాపలా బాధ్యత అప్పగించినట్లుగా తెలిసింది. భద్రాచలం మండలంలోని తోటపల్లిలో పెంకుల ఇంట్లో బియ్యం నిల్వ చేయగా, దానిలోనే గేదెలు క డుతున్నారు. ఆ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంది. అదే విధంగా వర్షం వస్తే బియ్యం బస్తాలు తడిస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. వాస్తవంగా వీటిని రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చే యాల్సి ఉన్నప్పటికీ, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా వెంకటాపురం సొసైటీ పరిధిలో జీసీసీ సేల్స్ డిపోల్లోనే బఫర్ స్టాక్ పెట్టడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. బఫర్ స్టాక్‌నే వినియోగదారులకు నెలసరి రేషన్‌గా సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చేరని కిరోసిన్ గోదావరి వరదల సమయంలో కిరోసిన్ అవసరం ఎంతో ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ మండలాలకు కిరోసిన్ చేరలేదు. 50 వేల లీటర్ల కిరోసిన్ సరఫరాకు అలాట్మెంట్ వచ్చినప్పటికీ, దానిని మండలాలకు ఎందుకు చేర్చలేదనేదే ప్రశ్నార్థకం. వరదల సమయంలో తూతూమంత్రంగా సరఫరా చేసి మిగతా కిరోసిన్‌ను పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు బఫ ర్ స్టాక్ నిల్వలపై దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
20 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సీతంపేట, న్యూస్‌లైన్: గిరిజన సహకార సంస్థ(జీసీసీ)ఆధ్వర్యంలో 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో కె.సునీల్ రాజ్‌కుమార్ ఆదేశిం చారు. జీసీసీ సేల్స్‌మెన్‌తో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆయన మాట్లాడారు. సీతంపేట, భామిని, హిరమండలం, పాతపట్నం తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి డీఆర్‌డిపో పరిధిలో నెలకు రూ.లక్ష వ్యాపారం చేయాలన్నారు. ఈ ఏడాది మూడున్నర కోట్ల వ్యాపార లక్ష్యాన్ని పూర్తి చేయాలని, సంతల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కుశిమి, సీతంపేట, దోనుబాయి, పొల్ల, మర్రిపాడు సంతల్లో మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వీరఘట్టం సంతకు ఇద్దరు సేల్స్మేన్లను కేటాయించాలని ఆదేశించారు. అమ్మహస్తం పథకం ద్వారా 9 రకాల సరుకులను డీఆర్‌డిపోల్లో ఉండాలన్నారు. రానున్న క్రిస్మస్, సంక్రాంతి సీజన్లలో వీటికి బాగా డిమాండ్ ఉంటుందన్నారు. సంతల్లో నాసిరకం వస్తువులు విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇందుకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు జీసీసీ అధికారులు కూడా దాడులు చేయాలని సూచించారు. అలాగే కొండచీపుర్లు కొనుగోలు చేయాలన్నారు. సీతంపేటలో ఉన్న కోల్డ్‌స్టోరేజీని తీసుకుని, అటవీ ఫలసాయాలు అందులో నిల్వ ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డివిజినల్ మేనేజర్ ఎన్.విజయ్‌కుమార్, సీతంపేట బ్రాంచి మేనేజర్ శాంతారాం తదితరులు పాల్గొన్నారు.