భద్రాచలం : గోదావరి వరదల సమయంలో బాధితులకు చేపట్టాల్సిన పునరావాస చర్యలపై జిల్లా యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకూ గోదావరి నదికి పూర్తిస్థాయిలో వరదలు రానప్పటికీ గత అనుభవాల దృష్ట్యా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది 30 అడుగులకు పైగానే ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే ఒక్కసారిగా గోదావరి ఉప్పొంగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే డివిజన్ కేంద్రమైన భద్రాచలం నుంచి అటు వాజేడు, ఇటు కూనవరం రహదారులకు దారులు మూసుకుపోతాయి. రహదారుల జలదిగ్బంధంతో ఎటూ వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఏటా మూడు నెలల పాటు గోదావరి వరదలు పరీవాహక ప్రాంతంలోని 14 మండలాలపై ప్రభావం చూపుతాయి.
ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లోని ప్రజానీకానికి ఎలాంటి ఆహార కొరత లేకుండా సహాయక చర్యలు అందించేందుకు సరిపడా నిత్యావసర సరుకులను నిల్వ చేస్తారు. బఫర్ స్టాక్ పాయింట్ల పేరుతో గుర్తించిన ప్రదేశాల్లో ముంపు ప్రాంత ప్రజానీకం అవసరాలకు అనుగుణంగా వస్తువులు నిల్వ ఉంచుతారు. ముందస్తు చర్యల్లో భాగంగా వరద ప్రభావిత బాధితులకు పునరావాసం కోసం 14,500 క్వింటాళ్ల బియ్యం, 50 వేల లీటర్ల కిరోసిన్ బఫర్ స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి.
గిరిజన సహకార సంస్థ గోదాముల (ఎంఎల్‌ఎస్ పాయింట్) నుంచి మండలాల్లోని ఆయా బఫర్ స్టాక్ పాయింట్లకు ఇప్పటికే సరుకులను తరలించారు. కానీ ఆయా స్టాక్ పాయింట్లలో అధికారుల చెబుతున్న లెక్కల ప్రకారం నిల్వలు ఉన్నాయా.. మాయమయ్యాయా..? అనే దానిపై ఇప్పటి వరకూ ఏ ఒక్క అధికారి కూడా పరిశీలన చేయకపోవడం గమనార్హం. భద్రాచలం గిరిజన సహకార సొసైటీ పరిధిలో 5, 500 క్వింటాళ్లను సరఫరా చేసినట్లుగా గోదాం నిర్వహణ అధికారులు చెబుతున్నారు.
కూనవరంలో ఉన్న బఫర్ స్టాక్ పాయింట్‌లో 2,500 క్వింటాళ్లు భద్రాచలం మండలంలోని తోటపల్లిలో ఆరొందలు, నల్లకుంటలో 275, భద్రాచలంలో ఎనిమిదొందలు, దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో 275, లక్ష్మీనగరంలో తొమ్మిదొందల క్వింటాళ్లు నిల్వ ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే విధంగా వెంకటాపురం సొసైటీ పరిధిలోని మండలాల్లో పరిధిలో ఐదు వేల క్వింటాళ్లు, చింతూరు పరిధిలో రెండు వేలు, కుక్కునూరు పరిధిలో 2,200 క్వింటాళ్ల బియ్యం నిల్వ చే సినట్లుగా అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని చోట్ల అధికారులు చెబుతున్న విధంగా నిల్వలు లేకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తోటపల్లిలో ఆరొందల క్వింటాళ్లు ఉన్నాయని చెబుతున్నప్పటికీ చిన్నపాటి పెంకిటింట్లో 12 వందల బస్తాలు పట్టే అవకాశం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్టాక్ పాయింట్లకు నో సెక్యూరిటీ
ఆమా ప్రాంతాల్లోని బఫర్ స్టాక్‌పాయింట్లలో ఉన్న బియ్యం నిల్వలకు ఎలాంటి భద్రత లేదని గ్రామస్తులు చెబుతున్నారు. స్టాక్ పాయింట్లకు వాచ్‌మన్లను నియమించుకునే అవకాశం ఉంది. అయితే... అలా చేయకుండానే ఆయా గ్రామాల్లోని డీలర్‌కు కాపలా బాధ్యత అప్పగించినట్లుగా తెలిసింది. భద్రాచలం మండలంలోని తోటపల్లిలో పెంకుల ఇంట్లో బియ్యం నిల్వ చేయగా, దానిలోనే గేదెలు క డుతున్నారు.
ఆ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంది. అదే విధంగా వర్షం వస్తే బియ్యం బస్తాలు తడిస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. వాస్తవంగా వీటిని రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చే యాల్సి ఉన్నప్పటికీ, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా వెంకటాపురం సొసైటీ పరిధిలో జీసీసీ సేల్స్ డిపోల్లోనే బఫర్ స్టాక్ పెట్టడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. బఫర్ స్టాక్‌నే వినియోగదారులకు నెలసరి రేషన్‌గా సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
చేరని కిరోసిన్
గోదావరి వరదల సమయంలో కిరోసిన్ అవసరం ఎంతో ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ మండలాలకు కిరోసిన్ చేరలేదు. 50 వేల లీటర్ల కిరోసిన్ సరఫరాకు అలాట్‌మెంట్ వచ్చినప్పటికీ, దానిని మండలాలకు ఎందుకు చేర్చలేదనేదే ప్రశ్నార్థకం. వరదల సమయంలో తూతూమంత్రంగా సరఫరా చేసి మిగతా కిరోసిన్‌ను పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు బఫ ర్ స్టాక్ నిల్వలపై దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
‘బఫర్’ భద్రమేనా..?
Published Mon, Jul 28 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement