గోదారి పరుగుకు పునరావాసం అడ్డు | Kondapochamma Reservoir Rehabilitation Process Become A Hindrance | Sakshi
Sakshi News home page

గోదారి పరుగుకు పునరావాసం అడ్డు

Published Thu, Dec 26 2019 3:52 AM | Last Updated on Thu, Dec 26 2019 3:58 AM

Kondapochamma Reservoir Rehabilitation Process Become A Hindrance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు మిడ్‌మానేరు దిగువకు వచ్చేందుకు పునరావాస ప్రక్రియ అడ్డుగోడగా మారింది. మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మసాగర్‌ వరకు గోదావరి జలాలను తరలించాలంటే నాలుగు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉండటం, అక్కడ పునరావాస ప్రక్రియ పూర్తయితే కానీ నీళ్లు దిగువకు పారే అవకాశం లేకపోవడం జాప్యానికి కారణమవుతోంది. ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో మరో నెలరోజులైతేకానీ మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యమయ్యేలా లేదు.  

సంక్రాంతి తర్వాతే దిగువకు గోదావరి 
కాళేశ్వరం పథకం ద్వారా ఇప్పటికే మిడ్‌మానేరు వరకు నీటిని తరలించే ప్రక్రియ పూర్తయింది. అవసరాన్ని బట్టి మోటార్లను నడుపుతూ మేడిగడ్డ నుంచి నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. మంగళవారం సైతం మిడ్‌మానేరులోకి 9,450 క్యూసెక్కుల మేర నీరు ఎగువ ప్యాకేజీ–6, 8ల ద్వారా పంపింగ్‌ చేశారు. 25.87 టీఎంసీ సామర్ధ్యం ఉన్న మిడ్‌మానేరులో ఇప్పటికే 23.09 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇక్కడి నుంచి నీటిని లోయర్‌మానేరు డ్యామ్‌కు తరలిస్తున్నారు. 

నిజానికి మిడ్‌మానేరు నుంచి దిగువన ఉన్న కాళేశ్వరం ప్యాకేజీలు–10, 11, 12ల ద్వారా అనంతగిరి మీదుగా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉన్నా పునరావాస ప్రక్రియ పూర్తిగాక, నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకపోవడంతో దిగువకు నీటి పంపింగ్‌ జరగడం లేదు. మిడ్‌మానేరు నుంచి నీటిని తోడే పంప్‌హౌస్‌లో 4 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఆసియాలోనే పెద్దదైన 0.2 టీఎంసీ నిల్వ సామర్ధ్యం ఉన్న ఓపెన్‌ సర్జ్‌పూల్‌ను సైతం నీటితో నింపి పెట్టారు. అయితే మోటార్లు నడిపి అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీళ్లు ఎత్తిపోసేందుకు మాత్రం పునరావాస ప్రక్రియ అడ్డు వస్తోంది. 

అనంతగిరి కింద ముంపు గ్రామంగా ఉన్న అనంతగిరి గ్రామం ఇంతవరకు ఖాళీ కాలేదు. ఇటీవలే నిర్వాసితుల పునరావాసానికి రూ.50 కోట్లు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటే న్యాయపరమైన అంశాలు అడ్డుగా ఉన్నాయి. ఈ గ్రామాన్ని ఖాళీ చేసేవరకు పంపులు నడిపే ఆస్కారమే లేదు. ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు మరో నెల రోజులైనా పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి నుంచి నీటిని తరలించి 15 టీఎంసీల సామర్ధ్యం ఉన్న కొండపోచమ్మసాగర్‌లో నిల్వ చేయాలన్నా దీనికింద మూడు గ్రామాల పునరావాస ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. 

ఈ మూడు గ్రామాల్లోని 900లకు పైగా నిర్వాసిత కుటుంబాలకు తుంకిబొళ్లారం పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం చేసిచ్చినా, వివిధ కారణాలతో నిర్వాసితులు అక్కడికి వెళ్లలేదు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ పరిహారంలో ఇటీవలే రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్వాసితులకు చెల్లించే ప్రక్రియ ఇప్పుడిప్పుడే పుంజుకుంది. ఈ ప్రక్రియ పూర్తయి, నిర్వాసితులు ఖాళీ చేయాలన్నా నెల రోజులు పట్టడం ఖాయంగా ఉంది. దీంతో కొండపోచమ్మ సాగర్‌లో నీటిని నిల్వ చేయాలంటే సంక్రాంతి తర్వాత కానీ సాధ్యపడేలా లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement