సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా తెలంగాణకు ఓ లేఖ రాసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే? కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదిత ప్రాజెక్టుసహా ఏడు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున వాటిపై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది. కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ ఎత్తిపోతల, జీఎల్‌ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజీ, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు తదితర ఏడు ప్రాజెక్టులకు గోదావరి నదీజలాల యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) నుంచి మదింపు కానంత వరకు ముందుకు వెళ్లరాదని తెలంగాణకు స్పష్టం చేసింది. నీటి వివాదాలపై అక్టోబర్ 2న పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాసిన లేఖకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులిస్తూ నాలుగు పేజీల సమాధానం పంపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో శుక్రవారం(డిసెంబర్ 11) జల్‌శక్తి మంత్రిని కలిసిన రోజే ఈ లేఖను పంపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.
1. ‘‘కృష్ణా, గోదావరి నదులలో నీటి వాటా, వినియోగానికి సంబంధించి మీరు అక్టోబర్ 2, 2020న రాసిన లేఖలోని అనేక అంశాలు అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే మీరు లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిగా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇంకా లేఖలో ఏ ఏ అంశాలున్నాయంటే..కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీపై..‘కృష్ణా నదీజలాల వాటా, నీటి వినియోగంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి మీరు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా కోసం మీరు చేసిన ప్రయత్నాలను వివరించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్ 3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2014, 2018లో కోరినప్పటికీ కేంద్రం ఏడేళ్లుగా నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని మీరు ఆరోపించారు. ఈ సెక్షన్ పరిధిలో కాకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ఆధారంగా పరిష్కరించాలని ట్రిబ్యునల్‌కు సూచించారని మీరు నివేదించారు. దీనివల్ల తెలంగాణ ఉపశమనం పొందలేదని మీరు చెప్పారు. అయితే ఈ విషయంలో మీరు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అది ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇది అక్కడ పరిష్కారమైతేనే కేంద్రం చర్య తీసుకోగలదు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. మీరు ఉపసంహరించుకుంటే న్యాయ సలహా తీసుకుని నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అభ్యర్థనను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. గోదావరి జలాల విషయంలో కూడా రెండు రాష్ట్రాలు ఈ సెక్షన్ పరిధిలో అభ్యర్థన ఇచ్చేందుకు సమ్మతించాయి. అభ్యర్థన రాగానే సానుకూల నిర్ణయం తీసుకుంటామని నాటి సమావేశంలో జల్‌శక్తి శాఖ అంగీకరించింది’
2. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణపై ..
‘మీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్, దాని విస్తరణ గురించి ప్రస్తావించారు. ఇది అనధికార విస్తరణ అని, దీని వల్ల తెలంగాణ హక్కులు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని మీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014(ఏపీఆర్‌ఏ) ప్రకారం కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను మూల్యాంకనం కోసం కేఆర్‌ఎంబీకి సమర్పించడానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. తదుపరి అపెక్స్ కౌన్సిల్ వాటిని అనుమతిస్తుంది. కృష్ణా నదీజలాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1)లో గానీ, ఏపీఆర్‌ఏలో గానీ ప్రస్తావించినవీ లేదా ప్రస్తావన లేనివీ అయినప్పటికీ.. సీడబ్ల్యూసీ ద్వారా సాంకేతిక, ఆర్థిక మదింపు జరగని పక్షంలో, జల వనరుల విభాగం సలహా కమిటీ ఆమోదం పొందని పక్షంలో అవి కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించినా, తరువాత ప్రతిపాదించినా ఈ షరతు మాత్రం సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్టు స్వభావంలో మార్పు చోటుచేసుకున్నా కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ మేరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీల సాంకేతిక మదింపు లభించనంతవరకు ముందుకు వెళ్లరాదని కేఆర్‌ఎంబీ, జల్‌శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పలుమార్లు లేఖ రాశాయి. ఈమేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపేందుకు అంగీకరించారు’
3. కేఆర్‌ఎంబీ స్పందించలేదన్న ఆరోపణలపై..
‘పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపడంలో కేఆర్‌ఎంబీ విఫలమైందని మీరు పేర్కొన్నారు. అలాగే ఏపీ కృష్ణా బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటి తరలించడాన్ని కూడా కేఆర్‌ఎంబీ ఆపలేకపోయిందని రాశారు. టెండర్ ప్రక్రియను ఆపడంలో కూడా విఫలమైందన్నారు. ఏపీ అక్రమంగా జలాలు వినియోగించడాన్ని పర్యవేక్షించడానికి టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 2016లో జల్‌శక్తి శాఖ చేసిన సూచనలు అమలు చేయడంలో కేఆర్‌ఎంబీ విఫలమైందని రాశారు. అలాగే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నుంచి విద్యుదుత్పత్తిని ఆపాలని తెలంగాణను కేఆర్‌ఎంబీ కోరడం తప్పని మీరు రాశారు. కేడబ్ల్యూడీటీ–1 ఆదేశాల మేరకు శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తికి, నీటిని దిగువకు విడుదల చేయడానికి, తాగునీరు మాత్రమే కాకుండా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఆపరేషన్, నియంత్రణను ఇవ్వమని మీరు అభ్యర్థించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ డీపీఆర్‌లను మదింపు చేసే వరకు ముందుకు వెళ్లవద్దని కేఆర్‌ఎంబీతోపాటు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీని నిరంతరం కోరుతూ వచ్చింది. దీనికి ఏపీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల సహా రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపాలని మేం నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. నోటిఫై చేయడం పూర్తయితే విద్యుదుత్పత్తి సహా శ్రీశైలం నుండి దిగువకు నీటిని విడుదల చేయడం, నియంత్రించడం వంటి అంశాలను కేఆర్‌ఎంబీ నిర్దేశిస్తుంది. ఇక టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు వ్యయం భరించాలని 2016లో జరిగిన 1వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించారు. దీనిపై పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించలేదు. రెండు రాష్ట్రాలు ఈ దిశగా వ్యయం భరిస్తే టెలిమెట్రీ వ్యవస్థ స్థాపించడం పూర్తవుతుంది’
4. సెక్షన్ 89 అంశంపై..
‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89కు సంబంధించిన సమస్యల గురించి మీరు రాశారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కేంద్రం రెఫర్ చేయనందున కృష్ణా నదీజలాలను పునఃపంపిణీ చేసే అంశం పరిశీలించలేమని, సెక్షన్ 89 పరిధిలో మాత్రమే పరిశీలన జరుగుతుందని కేడబ్ల్యూడీటీ–2 అభిప్రాయపడ్డట్టు మీరు రాశారు. సెక్షన్ 3 పరిధిలో కొత్త ట్రిబ్యునల్ గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌గానీ కృష్ణా నదీజలాల పునఃపంపిణీ జరిపేలా రెఫర్ చేయాలని మీరు కోరారు. కేంద్రం స్పందించలేదని మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే మేం మీ అభ్యర్థనను పరిశీలించేందుకు సిద్ధమని చెప్పగా అపెక్స్ కౌన్సిల్‌లో మీరు కూడా అంగీకరించారు’
5. ఆ ఏడు ప్రాజెక్టుల్లో ముందుకు వెళ్లొద్దు..
‘తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను మీరు మీ లేఖలో ప్రస్తావించారు. మీరు గోదావరిపై చేపట్టిన ఏడు ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినవని మీరు ప్రస్తావించారు. భారీ ముంపు నష్టం లేకుండా కొన్ని ప్రాజెక్టుల స్థలాన్ని మార్చినట్టు, మెరుగైన సామర్థ్యం కనబరిచేలా కొన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేసినట్టు మీరు చెప్పారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కూడా కాళేశ్వరం (2 టీఎంసీ) ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు, ఆ స్థలంలో నీటి లభ్యత కారణంగా 3వ టీఎంసీ విస్తరణకు ముందుకు వెళ్లినట్టు మీరు మీ లేఖలో తెలిపారు. అయితే, ఆగస్టు 7న మీకు నేను రాసిన లేఖను గుర్తు చేయాలనుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రతిపాదనకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ 2018 జూన్‌లో అంగీకరించింది. కానీ, ·ఈ ప్రాజెక్ట్ పరిధిని 3 టీఎంసీలకు పెంచుతూ మీరు మార్చారు. అలాంటి మార్పు ఏదైనా ఉన్నప్పుడు కేంద్రం నుంచి హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని మీకు రాశాను. ఈ మార్పు కారణంగా ఏపీఆర్‌ఏ–2014ను అనుసరించి జీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరి. ఏపీ అభ్యంతరం చెప్పినట్టుగా ఈ ఏడు ప్రాజెక్టుల డీపీఆర్‌ల మదింపు జరగకుండా ముందుకు వెళ్లరాదని కూడా ఆ లేఖలో చెప్పాం. దీనిపై అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కూడా చర్చించాం. జీఆర్‌ఎంబీకి డీపీఆర్‌లు పంపేందుకు మీరు సమ్మతించారు. అందువల్ల మీరు కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదన, సీతారామ ఎత్తిపోతల, జీఎల్‌ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు ప్రాజెక్టులకు జీఆర్‌ఎంబీ మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను’
6. గోదావరి జలాల పంపిణీపై..
‘గోదావరి నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.2 టీఎంసీలు కేటాయించారని మీరు ప్రస్తావించారు. తెలంగాణకు 1950 టీఎంసీల వాటా దక్కాలని మీరు రాశారు. ఏపీ, తెలంగాణల మధ్య గోదావరి జలాలను పంచుకునే విషయంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు తక్షణం అభ్యర్థన పంపుతామని ఇరు రాష్ట్రాలు అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించాయి. అభ్యర్థన రాగానే ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది’అని మంత్రి పేర్కొన్నారు. ‘రెండు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యం, నీటి వినియోగ సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై వేగంగా ముందుకు సాగుతున్నామని ఆశిస్తున్నాను. తద్వారా రెండు రాష్ట్రాల చట్టబద్ధమైన నీటి హక్కులు త్వరితగతిన సాకారం అయ్యేలా చూసుకోవచ్చు’అని జల్‌శక్తి మంత్రి షెకావత్ పేర్కొన్నారు.
ఆ ఏడు ప్రాజెక్టులు ఇవే..
- కాళేశ్వరం మూడో టీఎంసీ
- సీతారామ ఎత్తిపోతలు
- జీఎల్‌ఐఎస్ ఫేజ్–3
- తుపాకులగూడెం ప్రాజెక్టు
- తెలంగాణ తాగునీరు
- సరఫరా ప్రాజెక్టు
- లోయర్ పెన్‌గంగపై బ్యారేజీ
- రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు
Comments
Please login to add a commentAdd a comment