కవ్వాల్‌ నుంచి  రెండు గ్రామాలు రీలొకేట్‌   | Tiger Reserve is the main forest area | Sakshi
Sakshi News home page

కవ్వాల్‌ నుంచి  రెండు గ్రామాలు రీలొకేట్‌  

Published Fri, May 24 2019 1:05 AM | Last Updated on Fri, May 24 2019 6:52 AM

Tiger Reserve is the main forest area - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లాలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రధాన అటవీ ప్రాంతం (కోర్‌ ఏరియా) నుంచి మైసంపేట, రాంపూర్‌ గ్రామాలను రీలొకేట్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 112 హెక్టార్ల అటవీప్రాం తాన్ని డీనోటిఫై చేస్తూ ఆదేశాలిచ్చింది. గురువారం ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌ మిశ్రా ఉత్తర్వులిచ్చారు. గ్రామస్తులు ఖాళీ చేసిన ప్రాంతాన్ని అటవీశాఖ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని, తగిన విధంగా నిర్వహించాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర సంప్రదాయ నివాసుల (రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌), 2006 చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలోని వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో చెట్లను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు (ట్రాన్స్‌లొకేషన్‌) పీసీసీఎఫ్‌ చర్యలు తీసుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అటవీశాఖ పర్యవేక్షణలో చెట్లను కొట్టాలని పేర్కొన్నారు. ఏడాదిలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస ప్రక్రియ ఏ మేరకు జరిగిందన్న దానిపై చెన్నైలోని కేంద్ర అటవీశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిశీలిస్తుందని, ఒకవేళ గ్రామస్తులు వెనక్కు వెళితే ఈ అనుమతిని తిరగదోడవచ్చునని స్పష్టం చేశారు. తొలి ఐదేళ్ల వరకు ప్రాంతీయ కార్యాలయం పరిశీలనను కొనసాగిస్తుందని తెలిపారు. అటవీ భూమిలో లేబర్‌ క్యాంప్‌లు లేకుండా పీసీసీఎఫ్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. 

దశలవారీగా తరలింపు
దశల వారీగా కవ్వాల్‌ అడవి ప్రధాన ప్రాంతం నుంచి వివిధ గ్రామాలు, నివాసిత ప్రాంతాలను బయటి ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అడ్మిన్, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌చార్జి అడిషనల్‌ పీసీసీఎఫ్‌ మునీంద్ర ‘సాక్షి’కి తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తుల నుంచి స్వచ్ఛంద అంగీకారం తీసుకున్నాకే వారిని ఇతర ప్రాంతాల్లోకి పంపించే ప్రక్రియను చేపడుతున్నట్టు చెప్పారు.  గ్రామసభల్లో తీర్మానం చేశాకే తరలింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ గ్రామాల ప్రజలకు ప్రధాన అటవీ ప్రాంతం కాకుండా ఇతర అటవీ ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. టైగర్‌ రిజర్వ్‌లోని కోర్‌ ఏరియాలో మొత్తం 37 వరకు ఆవాసాలు (హ్యాబిటేషన్లు) ఉన్నాయని, వాటిలో మైసంపేట, రాంపూర్‌ గ్రామాలను రీలొకేట్‌ చేయడం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement