అటవీ భూంఫట్..!
Published Wed, Oct 30 2013 1:56 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : జిల్లాలో అటవీభూములకు సంబంధించి అటు రెవెన్యూ, ఇటు అటవీశాఖలో ఉన్న రికార్డుల్లో పొంతనలేని సమాచారాన్ని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిర్భయంగా భూములను ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1.64 లక్షల హెక్టార్లలో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. వీటిల్లో సుమారు 3,260 హెక్టార్లు(8,058 ఎకరాలు) అన్యాక్రాంతమైనట్లు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలోని నల్లమల, కాకిరాల అటవీప్రాంత భూములతో పాటు మంగళగిరి, తాడేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాల్లో అటవీభూములు పెద్ద ఎత్తున ఆక్రమణల బారినపడ్డాయి. గుంటూరు రేంజ్‌లోనే మొత్తం 1630 హెక్టార్లు, మాచర్ల రేంజ్ పరిధిలో 1394 హెక్టార్లు, వినుకొండ రేంజ్‌లోని 20 హెక్టార్లు అన్యాక్రాంతం కాగా, రేపల్లె రేంజ్‌కు చెందిన 226.37 హెక్టార్ల అటవీభూములు ఆక్రమణలకు గురయ్యాయి.
చదును భూములపై కన్నేస్తూ.. జిల్లాలో పట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ సమీపంలోని అటవీభూములు ఆక్రమణలబారిన పడుతున్నాయి. కొం డలు, అడవుల్లో చదునుగా ఉన్న భూములపై కొం దరు కన్నేస్తున్నారు. సొసైటీలు, యువజన సంఘాల పేరుతో పాగా వేయడం, అనంతరం వాటిని గజాల చొప్పున పేదలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. ఈ ప్రకారం పల్నాడు డివిజన్‌లో అనేక చోట్ల అటవీభూముల్లో గుడిసెలు వెలిశాయి. దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో 210 హెక్టా ర్లు, మాచవరం మండలంలోని కోనంకి, నకరికల్లు మండలంలోని కొంతభాగం, పిడుగురాళ్ల సమీపాన గుత్తికొండ, రాజుపాలెం మండలంలోని గుడ్లపల్లి, త్రిపురాపురం, దుర్గి సమీపాన కాకిరాల, ముటుకూరు, మంచాలపాడు తదితర అటవీభూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి.
మాచర్ల రేంజ్ పరిధిలోనే కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి మండలాల్లో సుమారు 1394 హెక్టా ర్లు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుంది.పొంతనలేని రికార్డులు.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గత నెల రెండు మార్లు జిల్లాకొచ్చి ఆక్రమణలపై పరిశీలన జరిపారు. కొన్ని ప్రాంతాల్లోని కబ్జా భూములకు సంబంధించి గ్రామమ్యాప్‌లు, సర్వే రికార్డులకు వ్యత్యాసం ఉండటం ఆక్రమణదారులకు అనువుగా మారినట్లు వారు గుర్తించారు. సాధారణంగా సర్వే రికార్డులు తయారైన తర్వాత విలేజ్ మ్యాప్‌లు ఏర్పడ్డాయి.
అయితే, అటవీభూములకు సంబంధించి సర్వే రికార్డుల్లో కొండపోరంబోకుగా చూపితే, విలేజ్‌మ్యాప్‌లో మాత్రం అసైన్డ్‌గా పేర్కొన్నారు. దీంతో పేదలకు అసైన్డ్ భూములు పంపిణీచేయవచ్చనే సాకుతో ఆక్రమణదార్లు ముందుగా గుడిసెలు వేయడం, ఆ తర్వాత రెవెన్యూ కార్యాలయాలపై ఒత్తిళ్లు తెచ్చి పట్టాలు సాధించుకోవడం పరిపాటిగా మారింది. మరి కొన్ని చోట్ల అన్‌సర్వే భూములుండటం విశేషం. ఉదాహరణకు బెల్లంకొండ మండలం, చండ్రాజుపాలెం గ్రామంలో సర్వేనంబర్ ఒకటి, క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో సర్వేనంబర్ 337/18లు గ్రామమ్యాప్‌లో అటవీశాఖకింద ఉండగా, సర్వే రికార్డుల్లో మాత్రం అసైన్డ్ భూమలుగా పేర్కొని ఉండటంతో అధికారులు ఎటూ తేల్చుకోలేక తికమకపడుతున్నారు.
కొరవడుతున్న సమన్వయం.. అటవీభూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ సహకరించడం లేదంటూ అటవీశాఖాధికారులు వాపోతున్నారు. తమ భూములకు పట్టాలిచ్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిని రెవెన్యూ శాఖ కొట్టిపారేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో కొన్నిచోట్ల అటవీభూములు అన్యాక్రాంతం కాగా, అక్కడ నివసించే వారికి రెవెన్యూ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించడంపై అటవీశాఖాధికారులు తప్పుపడుతున్నారు. అయితే, మానవహక్కుల చట్టం మేరకు వసతులు కల్పిస్తున్నామని వారు వాదిస్తున్నారు.
కాగా రేపల్లె, మంగళగిరి ఏరియాల్లో విలువైన భూములు కూడా కబ్జా కాటుకు హరించుకుపోతున్నాయని పలువురు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మాచర్ల, బెల్లంకొండ ఏరియాల్లో కొన్నిచోట్ల గిరిజనుల పేరిట బినామీలు ఆక్రమించుకుని అటవీహక్కు చట్టం కింద పట్టాల కోసం తిరుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ తనిఖీలు వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.
Advertisement
Advertisement