జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించండి | Zilla Parishad assets protect | Sakshi
Sakshi News home page

జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించండి

Published Sun, May 3 2015 4:53 AM | Last Updated on Thu, Oct 4 2018 6:07 PM

Zilla Parishad assets protect

- స్థాయి సంఘాల సమావేశాల్లో జెడ్పీటీసీల వినతి
పాతగుంటూరు : జిల్లా పరిషత్ ఆస్తుల వివరాలు అడిగాం... ఇప్పటివరకు అధికారులు ఇవ్వలేకపోయారు... జిల్లా పరిషత్ భూముల్లో అక్రమ మైనింగ్, అటవీ భూముల ఆక్రమణలనూ పట్టించుకోవడంలేదు... అంటూ పలువురు జెడ్పీటీసీలు స్థాయి సంఘాల చైర్మన్లకు విన్నవించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని చైర్‌పర్సన్ చాంబర్, సీఈవో చాంబర్‌లో శనివారం ఏడు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. 1వ స్థాయి సంఘం సమావేశం చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ ఆధ్వర్యంలో జరిగింది.

జిల్లా పరిషత్ ఆస్తుల వివరాలు గతంలో అడిగామని, ఇప్పటివరకు తెలియజేయలేదంటూ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి అధికారులను ప్రశ్నించారు. దాచేపల్లి, నకరికల్లు మండలాల్లో జెడ్పీ నిధులు మంజూరైనప్పటికీ అక్కడి ఎమ్మెల్యేలు పనులు చేయకుండా అడ్డు తగులుతున్నారని , వాటిని పరిష్కరించాలని కోరారు. 2వ స్థాయి సంఘం సమావేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని రాజుపాలెం, పిడుగురాళ్ళ జెడ్పీటీసీలు మర్రి వెంకటరామిరెడ్డి, వీరభద్రుని రామిరెడ్డిలు కోరారు. జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన 3వ సమావేశంలో దాచేపల్లి జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అటవీ భూములను కొన్ని కంపెనీల యాజమాన్యం ఆక్రమించుకున్నాయని, వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు.

దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో మత్స్యకారులకు మంజూరైన వలలు ఇవ్వాల్సిందిగా కోరారు.  జానీమూన్ ఆధ్వర్యంలో జరిగిన 4వ స్థాయి సంఘం సమావేశంలో పీహెచ్‌సీలను మెరుగుపరచాలని, సిబ్బంది కొరత లేకుండా చూడాలని దుగ్గిరాల జెడ్పీటీసీ విజయలక్ష్మి సూచించారు. డాక్టర్లు లేక కొన్ని పీహెచ్‌సీల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సమావేశానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరయ్యారు. 5వ స్థాయి సంఘం సమావేశం చైర్మన్ ఉప్పుటూరి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. బొల్లాపల్లి జెడ్పీటీసీ కె. సంతోషమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని, అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులను సక్రమంగా రవాణా చేయాలని కోరారు.

జెడ్పీ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ స్థాయి సంఘం సమావేశంలో గుంటూరు రూరల్ మండలం జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైన లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించడంలేదన్నారు. బ్యాంకు అధికారులను ఒప్పించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని తెలిపారు. 7వ స్థాయి సంఘ సమావేశంలో పనులు కేటాయింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement