సాక్షి, ఆసిఫాబాద్: కుమ్రం భీం జిల్లాలోని ఆదివాసీలకు కోపమొచ్చింది. తమ వర్గానికి చెందిన వారిని అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ సంఘాలు గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆదివాసీలు అక్కడ పార్క్ చేసి ఉన్న పలువురు అధికారుల కార్ల అద్దాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆదివాసీలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి పలు మండలాల నుంచి వేలాది మంది తరలివచ్చారు.
తొలుత ర్యాలీ తీసి, అంతర్ రాష్ట్ర రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఐక్యకార్యాచరణ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం అనంతరం వేలాది సంఖ్యలో ఆదివాసీలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో పార్కింగ్ చేసిన జేసీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇరిగేషన్ ఈఈ, జిల్లా వ్యవసాయ అధికారి, సీపీవో వాహనాలపై దాడి చేశారు. ఒక దశలో కార్యాలయ ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. వేలాది సంఖ్యలో బైఠాయించిన ఆదివాసీలను అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది.
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వచ్చి ఆదివాసీలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. జోడేఘాట్‌లోని కుమ్రంభీం మ్యూజియంలో ఉన్న లంబాడీ తెగకు చెందిన శాంకిమాత విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 5న కాల్చివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా లంబాడీ నాయకులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు దాదాపు 20 మందిపైగా ఆదివాసీలపై కేసులు నమోదు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని, కలెక్టర్ చంపాలాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీల సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment