రాష్ట్ర మహాసభల్లో ప్రారంభోపన్యాసం చేస్తున్న జాతీయ కన్వీనర్ సుభోద్ మిత్రా
ఏఐకేఎంకేఎస్ కన్వీనర్ సుబోధ్ మిత్రా పిలుపు
ఏలూరులో రైతు కూలీ సంఘం మహాసభలు ప్రారంభం
ఏలూరు (టూటౌన్): కేంద్రంలో, రాష్ట్రంలో వరుసగా అధికారంలోకి వస్తున్న పాలకులంతా రైతాంగ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంకేఎస్ కన్వీనర్ సుబోధ్‌విుత్రా పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర మహాసభలు శనివారం ఏలూరులో ప్రారంభమయ్యాయి. సుబోధ్ మిత్రా ప్రారంభోపన్యాసం చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో ముందుగా రైతు కూలీ సంఘం పతాకాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆవిష్కరించారు.
అనంతరం సుబోధ్ మిత్రా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల గ్రామాలు భూస్వాముల పీడన నుంచి విముక్తి చేసి, పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసుకున్నారని గుర్తు చేశారు. దున్నేవాడిదే భూమి హక్కు కేంద్ర విధానంగా దేశంలో బలమైన రైతాంగ ఉద్యమం సాగాలన్నారు. అటవీ సంరక్షణ చట్టానికి సవరణల పేరుతో అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను తరిమేసి గనుల తవ్వకానికి, సహజ సంపదల దోపిడీకి కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను పాలకులు వేగిరం చేస్తున్నారని, వీటిపై అవిశ్రాంత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ 1937 జూలైలో ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకూ సాగించిన రైతు రక్షణ యాత్రకు నాయకత్వం వహించిన జిల్లా రైతులు కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి దంతులూరి వర్మ.. గత మహాసభల నుంచి ఇప్పటి వరకు సాగిన రైతాంగ ఉద్యమంలో అమరులైన 750 మందికి జోహార్లు అర్పిస్తూ తీర్మానం చేశారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ రైతుల హక్కుల సాధనకు ప్రాణాలైనా అర్పించి పోరాడాలని పిలుపునిచ్చారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న హత్యాకాండలో మరణిస్తున్న వారికి మహాసభ సంతాపం తెలియజేసింది. ఏఐఎఫ్‌టీయూ(న్యూ) జాతీయ అధ్యక్షుడు గుర్రం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌బాబు, ఏఐకేఎంకేఎస్ ఒడిశా నేత శ్రీకాంత్ మొహంతి, తెలంగాణ నేత ప్రసాదన్న, కర్ణాటక నేత చాగనూరు మల్లికార్జునరెడ్డి, ఆహ్వాన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment